ఇజ్రాయెల్‌పై మిసైళ్లతో ఇరాన్ దాడులు

రమత్ గాన్ పట్టణంలో ఇరాన్ దాడిలో ధ్వంసమైన భవనంలో ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, రమత్ గాన్ పట్టణంలో ఇరాన్ దాడిలో ధ్వంసమైన భవనంలో ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు

ఇరాన్ శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్‌తో దాడులు చేసింది.

గురువారం రాత్రి నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిగా ఆ దేశానికి భారీ నష్టం కలిగిస్తామంటూ ఇరాన్ సుప్రీం నేత ప్రతిజ్ఞ చేశారు. 'ట్రూప్రామిస్ 3' పేరుతో ఇరాన్ ఈ ఆపరేషన్ చేపట్టింది.

ఇజ్రాయెల్‌లోని డజన్లకొద్దీ సైనిక, వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్ తెలిపింది. టెల్ అవీవ్‌కు తూర్పున ఉన్న రమత్‌గాన్ పట్టణంలో ఇరాన్ క్షిపణి దాడికి ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. ఇజ్రాయెల్ సైనికులు నష్టాన్ని అంచనా వేయడంతోపాటు ప్రాణాలతో ఎవరైనా మిగిలి ఉన్నారేమోనని గాలిస్తున్నారు.

ఇరాన్ దాదాపు 100 క్షిపణులు ప్రయోగించిందని, వీటిలో చాలా వాటిని కూల్చివేశామని, మరికొన్ని లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమయ్యాయని ఇజ్రాయెల్ రక్షణ దళాల అధికార ప్రతినిధి అవిచే అడ్రీ చెప్పారు.

''దెబ్బతిన్న భవనాల సంఖ్య తక్కువగానే ఉంది. క్షిపణులను కూల్చివేయడం వల్ల వాటి శకలాలు తగిలి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ రక్షణ అధికారి ఒకరు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టెల్ అవీవ్‌లో భారీ శబ్దాలు విన్నామని జర్నలిస్టు గిడియోన్ లెవీ చెప్పారు

ఇజ్రాయెల్ ఆస్పత్రులలో 40మంది చికిత్స పొందుతున్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు.

తాము బస చేసిన భవనం వద్ద, సమీపప్రాంతాల నుంచి అనేక పేలుళ్ల శబ్దాలు విన్నట్టు టెల్ అవీవ్‌ నుంచి బీబీసీ రిపోర్టర్ లూసీ విలియమ్సన్ తెలిపారు. తలదాచుకోవడానికి వచ్చే ప్రజలతో షెల్టర్స్ నిండిపోయాయని, ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

శనివారం తెల్లవారుజామున ఇరుదేశాల మధ్య గగనతల దాడులు జరిగాయి. అనంతరం టెల్ అవీవ్, జెరూసలెంలో సైరన్‌లు వినిపించాయి.

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

బాలిస్టిక్ మిసైల్స్‌తో దాడులు చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ చెప్పగా, ఈ మిసైల్స్‌లో కొన్నింటిని కూల్చివేసినట్టు ఐడీఎఫ్ చెప్పింది.

తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్చారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్చారు

ఇరాన్ ఈ దాడి చేస్తుందని ఇజ్రాయెల్ ముందుగానే ఊహించింది. ఈ పేలుళ్లతో దేశం మొత్తం యుద్ధంలో ఉందని ప్రజలు తెలుసుకున్నారు.

భారీ శబ్దాలతో సెంట్రల్ ఇజ్రాయెల్‌లో నివాస భవనాలు, కిటికీలు ఊగిపోయాయని జెరూసలెం నుంచి బీబీసీ రిపోర్టర్ టామ్ బెన్నెట్ చెప్పారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ యుద్ధం ఇరాన్ ప్రజలపై కాదని, ఆ దేశ నాయకత్వంపైన అని చెప్పారు.

''ఈ నాయకత్వం చాలా బలహీనంగా ఉంది. తమకు ఎలాంటి దెబ్బతగలనుందో కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు'' అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

ఇరాన్ సైనిక, అణుస్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని వివరించారు.

‘‘ఇరాన్ ప్రజలు తమ గళాన్ని వినిపించడానికి ఇదొక అవకాశమని చెప్పారు. ఇరాన్ అణు ముప్పును ఎదుర్కోవడమే తమ లక్ష్యమని’’ చెప్పారు.

‘‘మేం మా లక్ష్యాన్ని చేరుకోగానే మీరు స్వేచ్ఛను పొందేందుకు మార్గం సుగమం చేస్తాం’’ అని నెతన్యాహు అన్నారు.

ఇరాన్ ప్రజలు

ఫొటో సోర్స్, Abedin Taherkenareh/EPA

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌పై దాడుల తరువాత హర్షం వ్యక్తం చేస్తున్న ఇరాన్ ప్రజలు

ఇజ్రాయెల్ పైలట్‌ ఒకరిని ఇరాన్ బంధించిందనే వార్తలను ఇజ్రాయెల్ మిలటరీ ‘నిజం కాదు’ అని తోసిపుచ్చింది.

ఇజ్రాయెల్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను ఇరాన్ కూల్చివేసినట్టు ఇరాన్ తాస్మిన్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది. ‘ఈ యుద్ధ విమానాలలో మహిళా పైలట్‌ను బంధించారని’ పేర్కొంది.

అయితే బీబీసీ ఈ వార్తను స్వతంత్రంగా ధృవీకరించలేదు.

మరోపక్క ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను చైనా ఖండించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని కొద్దిసేపటి కిందట మొదలైన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో చైనా రాయబారి ఫూకాంగ్ చెప్పారు.

ఇజ్రాయెల్ దాడుల్లో సీనియర్ సైనికాధికారులతో సహా 78 మంది చనిపోయారని, 320 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి తెలిపారు.

ఇరాన్ తన అణు కార్యక్రమంపై రాజీ కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ కోరారు. ఇది జరగకపోతే, ఇజ్రాయెల్ మరింత తీవ్రదాడికి దిగుతుందని హెచ్చరించారు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరాన్, ఇజ్రాయెల్ 'శాంతి మార్గాన్ని అనుసరించాలి’ అని కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)