అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణు కార్యక్రమానికి కీలకమైన ప్రాంతాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇరాన్ ప్రతిదాడులు చేయచ్చని భావిస్తున్న ఇజ్రాయెల్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనిక దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా ప్రకటించింది.


ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్ ఏయే ప్రాంతాలపై దాడి చేసింది?
ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5.30గంటల సమయంలో పేలుళ్లు జరిగినట్టు సమాచారం.
నివాసిత ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయని, ఈశాన్య తెహ్రాన్‌లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ సమాచారాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
తెహ్రాన్‌లో పేలుళ్లు జరిగే సమయానికి (ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30గంటలు) ఇజ్రాయెల్ పౌరులు సైర్లన మోతలతో, అత్యవసర ఫోన్ అలర్ట్‌లతో నిద్రలేచారు.
తొలుత దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత నతాంజ్ అణు కేంద్రం దగ్గర పేలుడు జరిగినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
రాజధాని తెహ్రాన్‌కు ఈ ప్రాంతం 225 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
దాడి ఎందుకు?
ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దాడులు ప్రారంభించామని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
''ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పును తొలగించడమే లక్ష్యంగా ఈ సైనిక చర్య చేపట్టాం'' అని నెతన్యాహు తెలిపారు. ముప్పు తొలగిపోయేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.
''శుద్ధి చేసిన యురేనియాన్ని ఆయుధాలుగా మార్చేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. దీనిని ఆపకపోతే ఇరాన్ త్వరలోనే అణ్వాయుధాలను తయారుచేయగలదు. అది ఏడాది కావచ్చు లేదంటే కొన్నినెలలు, సంవత్సరంలోపే కావొచ్చు. ఇజ్రాయెల్ ఉనికికి ఇది స్పష్టమైన ముప్పు'' అని నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్ అణ్వాయుధాల కార్యక్రమానికి మద్దతిస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు తెలియజేశారు.
''కొన్నిరోజుల్లోనే'' అణ్వాయుధాలు తయారు చేయడానికి సరిపడా అణుసామాగ్రి ఇరాన్ దగ్గర ఉందని ఇజ్రాయెల్ మిలటరీ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడిచేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా అధికారులు బుధవారమే చెప్పారు. దీంతోపాటు ఇరాక్‌లోని తమ రాయబార కార్యాలయాలపై ఇరాన్ దాడులు చేయవచ్చని అమెరికా అనుమానించింది. ఈమేరకు ఇరాక్‌లోని తమ రాయబార కార్యాలయంలోని అత్యవసరం కాని సిబ్బందిని తరలిస్తున్నామని పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడికి అమెరికా మద్దతు ఇస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది, దీనిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ ఈ దాడుల గురించి తనకు ముందే తెలుసునని, అయితే అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని నొక్కి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
దాడులపై ఇరాన్ ఏమంటోంది?
తమపై చేసిన దాడులు అమెరికా, ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లిస్తాయని ఇరాన్ సాయుధ బలగాల ప్రతినిధి చెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది.
ఈ దాడిపై తమ సాయుధ బలగాలు కచ్చితంగా స్పందిస్తాయని ఇరాన్ ప్రతినిధి అబొల్‌ఫజల్ షెక్రాచి చెప్పారు.

ఫొటో సోర్స్, Majid Asgaripour/WANA (West Asia News Agency) via Reuters
ఇరాన్ అణు విధానంపై ఆరోపణలేంటి?
తన అణు కార్యక్రమం పౌర అవసరాల కోసమేనని ఇరాన్ చాలా కాలంగా చెబుతోంది. ఇరాన్ చుట్టూ అనేక అణుస్థావరాలున్నాయి. ఇజ్రాయెల్ వాటిలో కొన్నింటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
అయితే ఇరాన్ వాదనతో చాలా దేశాలతో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) ఏకీభవించడం లేదు.
ఇరాన్ అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక నిబంధనలను ఉల్లంఘిస్తోందని 20ఏళ్లలో మొదటిసారి ఐఏఈఏ గవర్నర్ల బోర్డు ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














