ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు, భవిష్యత్తులో ఏం జరగబోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పీటర్ హాస్కిన్స్
- హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు ప్రకటించిన తర్వాత మధ్య పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
ఇజ్రాయెల్ దాడుల ఘటన తెలిసిన తర్వాత బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 10 శాతానికి పైగా పెరిగింది. జనవరి తర్వాత గరిష్ఠ స్థాయిలకు ఈ ధర చేరుకుంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు పెరగడంతో, ఇంధనం పుష్కలంగా లభించే ఈ ప్రాంతం నుంచి రాబోయే రోజుల్లో సరఫరాల్లో అంతరాయం నెలకొంటుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
కారులో ఇంధనాన్ని నింపడం నుంచి సూపర్‌మార్కెట్లో ఆహార వస్తువుల ధరల వరకు ప్రతీదానిపై చమురు ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తుంది.
చమురు ధరలు తొలుత భారీగా పెరిగిన తర్వాత, కాస్త తగ్గాయి. కానీ, గురువారం ముగింపు ధరతో పోలిస్తే 8 శాతం వరకు గరిష్ఠంగానే బ్రెంట్ క్రూడ్ ధరలు ఉన్నాయి. బ్యారల్ 74.65 డాలర్ల( సుమారు రూ. 6,429) వద్ద ట్రేడయ్యాయి.
శుక్రవారం, గురువారం బ్రెంట్ క్రూడ్ ధరల కదలికలను పక్కనపెడితే, గత ఏడాది స్థాయిల కంటే 10 శాతాని కంటే తక్కువగానే ఈ ధరలు ఉన్నాయి.
యుక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలు పెట్టిన తర్వాత 2022 ప్రారంభంలో చమురు ధరలు గరిష్ట స్థాయిలకు వెళ్లాయి.
ఆ సమయంలో క్రూడ్ ధర బ్యారల్ 100 డాలర్లు దాటింది.
శుక్రవారం రోజు ఆసియా, యూరప్ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోయాయి.
సురక్షితమైన ఆస్తులుగా భావించే బంగారం, స్విస్ ఫ్రాంక్‌లు లాభపడ్డాయి.
కొంతమంది పెట్టుబడిదారులు వీటిని అనిశ్చిత సమయాల్లో మరింత నమ్మదగిన పెట్టుబడులుగా చూస్తారు.
బంగారం ధర కూడా దాదాపు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఔన్స్ 1.2 శాతం పెరుగుదలతో 3,423 డాలర్లకు ఎగిసింది.

రాబోయే రోజుల్లో ఈ ఘర్షణలు ఎంత ప్రమాదకరంగా మారతాయో ఇంధన ట్రేడర్లు చూస్తున్నారని బీబీసీకి అనలిస్టులు చెప్పారు.
''గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్‌లో ఇజ్రాయెల్, ఇరాన్‌లు నేరుగా ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నప్పుడు మనం చూసిన మాదిరి ఇదొక విస్ఫోటన పరిస్థితి'' అని వంద ఇన్‌సైట్స్‌కు చెందిన వందనా హరి బీబీసీకి చెప్పారు.
''మధ్య ప్రాచ్యంలో చమురు సరఫరాలకు అంతరాయం కలిగించే అతిపెద్ద యుద్ధానికి కూడా ఇది దారితీయొచ్చు'' అని వందనా అన్నారు.
ఒకవేళ ఇరాన్‌లో చమురు ఉత్పత్తిని, ఎగుమతి సౌకర్యాలను కనుక లక్ష్యంగా చేసుకుంటే, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్ సుమారు 80 డాలర్ల నుంచి 100 డాలర్లకు ఎగిసే అవకాశం ఉందని క్యాపిటల్ ఎకనామిక్స్‌లోని అనలిస్టులు చెబుతున్నారు.
ధరలలో ఈ పెరుగుదల ఇతర చమురు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని పెంచేందుకు దోహదం చేసి, చివరికి ధరల పెరుగుదలను పరిమితం చేసి, ద్రవ్యోల్బణంపై పరోక్ష ప్రభావం చూపనుంది.
చమురు ధరల్లో తాజా పెరుగుదల పెట్రోల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేమని యూకే మానిటరింగ్ బాడీ ఆర్ఏసీ అధికార ప్రతినిధి రాడ్ డెన్నిస్ చెప్పారు.
''ఇక్కడ రెండు కీలక అంశాలున్నాయి: రాబోయే రోజుల్లో కూడా అత్యధిక హోల్‌సేల్ ఫ్యూయల్ ధరలు ఇలానే కొనసాగుతాయా? ముఖ్యంగా, ఎంత మార్జిన్‌ను రిటైలర్లు నిర్ణయించేందుకు సిద్ధంగా ఉన్నారు'' అనే దానిపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.
హార్ముజ్ జలసంధిలోని నిర్మాణాలను లేదా రవాణాను కనుక లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ చమురుకు ఒక్క రోజులోనే లక్షల బ్యారెళ్ల కొద్దీ సరఫరాలో అంతరాయం కలుగుతుంది.
ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రవాణా మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురులో ఐదోవంతు దీని గుండానే ప్రయాణిస్తుంది.
హార్ముజ్ జలసంధి గుండా డజన్ల ట్యాంకర్లు వెళ్తూ వస్తుంటాయి. మిడిల్ ఈస్ట్‌లో ప్రధాన చమురు, సహజ వాయువు ఉత్పత్తిదారులు, వారి వినియోగదారులు ఈ ప్రాంతం నుంచే ఇంధనాన్ని రవాణా చేస్తుంటాయి.
మిడిల్ ఈస్ట్ చమురు ఉత్పత్తులను ప్రపంచానికి.. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఎగువ ప్రాంతాలకు అనుసంధానించేది ఈ జలసంధే.
ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హద్దులుగా ఉన్న ఈ హార్ముజ్ జలసంధి, గల్ఫ్ ను అరేబియా సముద్రంతో కలుపుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














