డోనల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తామని ప్రకటించిన పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాక్స్ మజ్జా
- హోదా, బీబీసీ న్యూస్
గత నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరేందుకు దోహదపడిన చర్చల్లో ‘పోషించిన పాత్ర’కు గాను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని అనుకుంటున్నామని పాకిస్తాన్ ప్రకటించింది.
''ఇటీవలి భారత్-పాకిస్తాన్ సంక్షోభ సమయంలో దౌత్య పరమైన జోక్యం, కీలకమైన నాయకత్వానికి గుర్తింపుగా" ట్రంప్ ఈ అవార్డుకు అర్హులని పాకిస్తాన్ ప్రభుత్వం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.
అయితే, భారత్, పాకిస్తాన్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిగా వ్యవహరించారన్న వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
మూడో పక్షం నుంచి తాము ఎలాంటి దౌత్యపరమైన జోక్యాన్ని కోరుకోవడం లేదని తెలిపింది.


ఫొటో సోర్స్, NICHOLAS KAMM/AFP via Getty Images
ట్రంప్ వ్యాఖ్యలను అంగీకరించని భారత్
తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఇటీవలికాలంలో ట్రంప్ తరచుగా మాట్లాడుతున్నారు. అక్టోబరులో ఈ బహుమతి ప్రకటిస్తారు.
భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన పోరు తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ గురించి ట్రంప్ ప్రకటన చేశారు.
"పరిస్థితులు వేగంగా దిగజారుతున్న వేళ ఇస్లామాబాద్, దిల్లీ రెండింటితో బలమైన, దౌత్యపరమైన సంబంధాల వల్ల అధ్యక్షుడు ట్రంప్ గొప్ప వ్యూహాత్మక దూరదృష్టి, అద్భుతమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు'' అని పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం(జూన్ 21) ఉదయం తన పోస్టులో తెలిపింది.
"ఈ జోక్యం నిజమైన శాంతికారకుడిగా ఆయన పాత్రకు నిదర్శనం'' అని చెప్పింది.
పాకిస్తాన్ ప్రకటనపై దిల్లీ, వాషింగ్టన్ స్పందించలేదు.
అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం ముగిసిందని, దీన్ని అంగీకరించడానికి వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించానని ట్రంప్ పదేపదే చెప్పారు.
కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడం గురించి అమెరికా చేసిన ప్రకటనలను పాకిస్తాన్ కూడా అవునని చెప్పింది గానీ భారత్ మాత్రం అంగీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఎంత చేసినా నోబెల్ ఇవ్వరు’
అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగించాలంటే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవసరమని తాను చెప్పానని గత నెలలో ట్రంప్ అన్నారు.
''మీతో(భారత్, పాకిస్తాన్) చాలా వ్యాపారం చేయబోతున్నాం. దీన్ని ఆపేద్దాం'' అని తాను చెప్పినట్టు ట్రంప్ మీడియాతో అన్నారు.
ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలన్న ఆలోచనను పాకిస్తాన్ పార్లమెంటులోని సెనేట్ డిఫెన్స్ కమిటీ మాజీ చైర్మన్ ముషాహిద్ హుస్సేన్ ప్రశంసించారు.
''పాకిస్తాన్‌కు ట్రంప్ మంచివారు. యూరోపియన్ నాయకులందరూ ఆయనను బాగా ఇష్టపడుతున్నారు" అని ముషాహిద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు.
ఇది "దురదృష్టకరం" అని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి మలీహా లోధి విమర్శించారు.
"గాజాలో ఇజ్రాయెల్ జాతి విధ్వంస యుద్ధానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని 'అద్భుతం' అని పిలిచిన వ్యక్తి" అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.
"ఇది మన జాతి గౌరవాన్ని దెబ్బతీస్తుంది" అని ఆమె వ్యాఖ్యానించారు.
అనేక దేశాల మధ్య చర్చలకు సాయం చేశానని, అయితే తానేం చేసినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపడుతూనే రష్యా-యుక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలను త్వరగా ముగించాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే రెండు సంఘర్షణల్లోనూ శాంతి ఒప్పందం కుదర్చడం ఇప్పటివరకు ఆయనకు సాధ్యం కాలేదు.
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి ఎనిమిది నెలలైనా గడవకముందే 2009లో బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడంపై ట్రంప్ తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ అవార్డును రద్దు చేయాలని 2013లో నార్వేజియన్ నోబెల్ కమిటీని ట్రంప్ కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














