'నో బ్రా - నో ఎగ్జామ్': వివాదానికి కారణమైన యూనివర్సిటీ రూల్

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, మన్సూర్ అబూబకర్
    • హోదా, బీబీసీ న్యూస్

నైజీరియాలోని ఓ యూనివర్సిటీలో పరీక్షా హాలులోకి ప్రవేశిస్తున్న విద్యార్థినులు బ్రా (లో దుస్తులు) ధరించారో లేదోనని వారిని తాకుతూ చెక్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో వర్సిటీ తీరుపై విమర్శలు రేగాయి.

నైజీరియాలోని ఓగున్ రాష్ట్రంలో ఒలాబిసి ఒనాబాంజో యూనివర్సిటీలోని పరీక్ష హాలులోకి వస్తున్న కొంతమంది విద్యార్థినులను, వారి ఛాతీ ప్రాంతాన్ని మహిళా సిబ్బంది తాకుతూ తనిఖీలు చేస్తున్నట్టు ఆ వీడియో ఫుటేజీలో ఉంది.

ఆ వీడియోపై యూనివర్సిటీ స్పందించలేదు. కానీ, యూనివర్సిటీలో అమలవుతున్న డ్రెస్‌కోడ్‌లోని ఈ లోదుస్తుల నిబంధన, విద్యాసంస్థ వాతావరణాన్ని స్వేచ్ఛగా ఉంచాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్నట్టు ఓ విద్యార్థినేత తెలిపారు.

అయితే ఈ విధానాన్ని అనాగరికం, లైంగిక దాడిగా విమర్శకులు ఖండిస్తుండటంతో, దీనిని అమలు చేయడానికి మెరుగైన పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'వర్సిటీపై కేసు పెట్టొచ్చు'

తమ హక్కులను ఉల్లంఘించేలా ప్రవర్తించినందుకు వర్సిటీపై విద్యార్థులు కేసు పెట్టవచ్చని హ్యూమన్ రైట్స్ నెట్‌వర్క్‌ క్యాంపెయిన్ గ్రూపులోని ఒక సీనియర్ అధికారి బీబీసీకి తెలిపారు.

"ఇతరుల శరీరాన్ని అనవసరంగా తాకడం ఉల్లంఘనే అవుతుంది.అది చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చు. అసభ్యకరమైన వస్త్రధారణను అరికట్టడానికి విశ్వవిద్యాలయం ఈ పద్ధతిని అనుసరించడం తప్పు" అని హరుణ అయాగి అన్నారు.

వర్సిటీ మతపరమైన సంస్థ కాకపోయినా, కఠినమైన నైతిక నియామవళిని అమలు చేస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక విద్యార్థి బీబీసీకి తెలిపారు.

''మా దుస్తులను ప్రతీసారి తనిఖీ చేస్తుండేవారు'' అని ఆమె చెప్పారు.

కాలేజీ విద్యార్థులు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'గౌరవంగా ఉండటానికే'

విమర్శల నేపథ్యంలో ''గౌరవప్రదమైన, స్వేచ్ఛాయుత వాతావరణం దెబ్బతినకుండా సంస్థ విలువలకు అనుగుణంగా విద్యార్థినుల వస్త్రధారణ హుందాగా ఉండేలా చూడటమే డ్రెస్ కోడ్ లక్ష్యం'' అని యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేత మయిజ్ ఒలాతుంజీ ఎక్స్‌లో చెప్పారు.

‘‘ఈ విధానం కొత్తది కాదు. అసభ్య వస్త్రధారణను అరికట్టేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించేలా విద్యాసంస్థతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులు, సిబ్బంది మధ్య గౌరవంగా, హుందాగా సంభాషణలు కొనసాగడంపై దృష్టి సారించాం'' అని ఆ పోస్టులో రాశారు.

దీంతోపాటు వస్త్రధారణ కోడ్‌ను కూడా అందులో ప్రచురించారు.

''ఇతరులు లైంగిక ఆకర్షణకు గురయ్యేలా కనిపించే అసభ్య వస్త్రధారణను నిషేధిస్తున్నాం'' అని ఆ డ్రెస్‌కోడ్‌లో ఉందని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)