అమెరికా కాన్సులేట్ దగ్గర ఆటోడ్రైవర్ సంపాదన 5 నుంచి 8 లక్షలంటూ సోషల్ మీడియా పోస్ట్ వైరల్, అసలు విషయమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అల్పేష్ కర్కరే
- హోదా, బీబీసీ కోసం
ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
బీకేసీలోని అమెరికా కాన్సులేట్‌కి వచ్చేవారి బ్యాగులు, ఇతర వస్తువులను భద్రపరుస్తూ ఆటో డ్రైవర్లు నెలకు 5 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని వార్తలొచ్చాయి.
దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి అధికారులతో సహా చాలామంది దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇది నిజం కాదని ఆటో డ్రైవర్లు, పోలీసులు అంటున్నారు.
ఆటో డ్రైవర్లు నిజంగా ఇంత సంపాదిస్తున్నారా? ఇంతకీ ఆ కాన్సులేట్ దగ్గర ఏం జరుగుతోంది?


ఫొటో సోర్స్, BBC/ALPESH KARKARE
అవసరం తెలుసుకొని ఆదాయంగా..
ముంబయిలోని అమెరికన్ కాన్సులేట్ ప్రాంగణం అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చాలా కఠినంగా ఉంటాయి.
నిర్ణీత పార్కింగ్ స్థలాల్లో తప్ప కాన్సులేట్ దగ్గర పార్కింగ్ నిషేధం. అలాగే, కాన్సులేట్ లోపలికి బ్యాగులు తీసుకెళ్లడం కూడా నిషేధం.
ఇక్కడికి వచ్చే చాలామందికి ఈ విషయం తెలియదు, కాబట్టి వారు తమ బ్యాగులను ఎక్కడ పెట్టాలా? అని తర్జనభర్జన పడుతుంటారు.
ఈ సమస్యను గుర్తించిన ఆటో డ్రైవర్లు, మరికొందరు దాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. అక్కడికి వచ్చిన వారి దగ్గర డబ్బులు తీసుకొని బ్యాగులు, ఇతర వస్తువులను భద్రపరుస్తున్నారు.
కొన్నేళ్లుగా కుర్లా మోతీలాల్ నగర్ ప్రాంతంలోని లాకర్ గదిలో లేదా ఆటోల్లో బ్యాగులు, సామగ్రిని భద్రపరచడం మొదలుపెట్టారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొంతమంది స్థానిక దుకాణదారులు, సామాజిక కార్యకర్తలు చెప్పారు.
కాన్సులేట్‌కు చాలామంది వస్తుంటారని, అందుకే, ఆటో డ్రైవర్లకు, మరికొందరికి ఇది మంచి ఆదాయంగా మారిందని వారన్నారు.
ఈ రాయబార కార్యాలయం వెలుపల లాకర్లు లేకపోవడం సందర్శకులకు ఇబ్బందిగా మారింది. ఒక పెద్ద కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇలానే ఇబ్బంది పడటంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది.

చర్చ ఎలా మొదలైందంటే..
రాహుల్ రూపానీ లెన్స్‌కార్ట్ కంపెనీలో ప్రొడక్ట్ హెడ్. రెండువారాల కిందట తన లింక్డ్ఇన్ అకౌంట్‌లో ఒక ఆటోవాలాను ప్రశంసిస్తూ ఆయన పోస్టు పెట్టారు.
"యాప్ లేదు, నిధులు లేవు, సాంకేతికత లేదు" అని రూపానీ పోస్టులో రాశారు.
వీసా దరఖాస్తుకు సంబంధించి అమెరికన్ రాయబార కార్యాలయానికి వెళ్లినపుడు, అక్కడ తనకు ఎదురైన అనుభవాన్ని రూపానీ పంచుకున్నారు.
"నేను వీసా అపాయింట్‌మెంట్ కోసం అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లాను. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు నా బ్యాగ్‌ను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతించలేదు. నా బ్యాగ్ పెట్టుకోవడానికి అక్కడ లాకర్ కూడా లేదు. ప్రత్యామ్నాయం కోసం ఫుట్‌పాత్‌పై నిలబడి చూస్తున్నా. ఆ సమయంలో ఒక ఆటో డ్రైవర్ వచ్చి వెయ్యి రూపాయలిస్తే మీ బ్యాగ్‌ను సురక్షితంగా భద్రపరుస్తానన్నారు. మొదట సందేహించాను, కానీ ఆ తర్వాత బ్యాగ్‌ను అతని వద్దే పెట్టాను" అని రూపానీ పోస్ట్‌లో పేర్కొన్నారు.
"ఈ వ్యక్తి బిజినెస్ గురించి నాకు తెలిసింది. అతను రోజులో 20-30 మంది కస్టమర్ల బ్యాగులను భద్రపరుస్తారు. ఒక్కొక్కరి నుంచి రూ. 1,000 వసూలు చేస్తారు. ప్రతి నెలా రూ. 5 నుంచి రూ.8 లక్షలు సంపాదిస్తారు" అని రూపానీ రాశారు.
పోస్ట్ వైరల్ కావడంతో ఇబ్బందుల్లో ఆటోవాలా
రూపానీ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై చాలా చర్చ జరిగింది.
ఇది బాంద్రాలోని పలువురు ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, స్థానిక పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారని ఆటోడ్రైవర్లు చెప్పారు.
రూపానీ పోస్టులో ఆటోరిక్షా డ్రైవర్ ఆదిల్ షేక్ ఫోటోను కూడా షేర్ చేశారు. దీని కారణంగా, గత రెండు వారాలుగా పోలీసులతో సహా ఇతరుల నుంచి ఆదిల్ ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. దీంతో, ఆదిల్ ఒత్తిడికి గురయ్యారని బాంద్రాలోని భారత్ నగర్ ప్రాంతంలో నివసించే సుల్తాన్ షేక్ తెలిపారు.
సుల్తాన్ షేక్ కూడా బాంద్రాకు చెందిన ఆటో డ్రైవర్.
"ఐదు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే వార్తలు అవాస్తవం. కొంతమంది ఆటో డ్రైవర్లు ప్రజలకు సాయం చేస్తారు. అంతేకానీ అదే వారి వ్యాపారం కాదు" అని సుల్తాన్ అన్నారు.
"రాయబార కార్యాలయానికి వచ్చే వారు తమ సామగ్రిని లాకర్లలో భద్రపరుచుకునేలా ఆటో డ్రైవర్లు, మరికొందరు సాయం చేస్తారు. నిబంధనల ప్రకారం రుసుము వసూలు చేస్తారు. సోషల్ మీడియాలో మాట్లాడుకునేది అవాస్తవం" అని ఆయన అన్నారు.
సోషల్ మీడియా ఫేమ్ కోసం మమ్మల్ని ఇలా వేధిస్తున్నారని రషీద్ ఖురేషి అనే మరో ఆటో డ్రైవర్ ఆరోపించారు.
ఆటో డ్రైవర్లు నెలకు ఐదు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తే, వారు మురికివాడల్లో నివసించేవారు కాదని, వారి పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని ఆయన అన్నారు.

పోలీసులు ఏమంటున్నారు?
ఈ ఘటనపై ముంబయి పోలీసులు 12 మందిని విచారించారు, వారిలో అమెరికా కాన్సులేట్ వెలుపల లాకర్ సర్వీస్ నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. లాకర్ సర్వీస్ నిర్వహించడానికి లేదా సమీపంలోని దుకాణాలలో వస్తువులను భద్రపరచడానికి వారిలో ఎవరికీ చట్టపరమైన అనుమతి లేదని విచారణలో తేలింది.
"ఆటోడ్రైవర్లు, మరికొంతమంది వస్తువులను చట్టవిరుద్ధంగా భద్రపరుస్తున్నారు" అని బీకేసీ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ యోగేష్ చవాన్ అన్నారు.
ఆటోలు నడపడానికే డ్రైవర్లకు లైసెన్స్‌లు ఇస్తున్నారని, ఇతర ప్రయోజనాల కోసం కాదని వారికి సూచించినట్లు ఆయన చెప్పారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా లగేజీ లేదా బ్యాగులను భద్రపరుస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చవాన్ తెలిపారు.
ఈ విషయంపై యూఎస్ కాన్సులేట్‌ను బీబీసీ సంప్రదించింది. అయితే, వారు స్పందించలేదు.

ఫొటో సోర్స్, Linkedin screen grab
ఆటో డ్రైవర్ సాయాన్ని అభినందించడానికే: రూపానీ
రూపానీ చేసిన ఒక్క పోస్ట్‌తో ఈ చర్చ జరిగింది. ఆటో డ్రైవర్, పోలీసుల పనితీరుపై సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి. దీంతో, రాహుల్ రూపానీ తన ఉద్దేశాన్ని అదే పోస్టును అప్‌డేట్ చేసి వివరించారు.
"ఈ పోస్ట్ ఆటో డ్రైవర్ నిజాయితీ, సహాయాన్ని అభినందించడానికి మాత్రమే చేసింది. ఎందుకంటే, మరెవరూ సహాయం చేయడానికి రానప్పుడు ఆయన ముందుకొచ్చారు. రాయబార కార్యాలయం వెలుపల అవసరమైన సేవలు అందించారు" అని రూపానీ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఆ పోస్టు తన వ్యక్తిగత అనుభవం, ఆటో డ్రైవర్‌తో ఒకసారి జరిగిన చర్చ ఆధారంగా వేసినదని ఆయన స్పష్టం చేశారు. ఎవరికో హాని కలిగించడానికి లేదా సంచలనం కోసం పోస్టు చేయలేదన్నారు.
తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దని, స్థానికులను ఏ విధంగానూ అసౌకర్యానికి గురిచేయవద్దని రూపానీ పోస్ట్‌లో అభ్యర్థించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














