AirIndia:ప్లేన్ ‌క్రాష్ తర్వాత సంస్థ పరిస్థితేంటి, పుంజుకోవడానికి ఎన్నాళ్లు పడుతుంది?

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిఖిల్ ఇనాందార్, అర్చనా శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా-171 విమాన ప్రమాదంలో 270 మంది మరణించారు. ఇప్పటికే కొందరి మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. లోపం ఎక్కడ ఉంది అనేది ఇప్పటిదాకా తెలియలేదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్ని నెలల సమయం పట్టొచ్చు.

అయితే జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ టీ వంటి ఇతర దిగ్గజ బ్రాండ్లతో పాటు విమానయాన సంస్థకు యజమాని అయిన టాటా గ్రూప్, తన ఎయిర్‌లైన్ ఎయిర్‌లైన్ సంస్థను విజయపథంలోకి తీసుకొస్తున్న సమయంలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గాడినపడుతోందని అనుకుంటుండగానే ఈ ప్రమాదం జరిగింది.

2022లో భారత ప్రభుత్వం నుంచి ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేసింది టాటా కంపెనీ. కొత్త యాజమాన్యంలోకి చేతుల్లోకి వెళ్లాక ఎయిర్ ఇండియా మెరుగైన ఆదాయాన్ని పొందింది. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు కూడా తగ్గాయి. అయితే అవి పూర్తిగా ఆగిపోలేదు.

సర్వీస్ బాగాలేదు, ఫ్లైట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ సరిగాలేదు, ప్రయాణంలో ఆలస్యం తరచూ జరుగుతోంది...అంటూ ఫిర్యాదులు వచ్చినా ఎయిర్‌లైన్‌ యాజమాన్య మార్పు, దాని కార్యకలాపాలను మెరుగుపరిచే క్రమంలో ఇటువంటివి సహజమేనని ప్రయాణికులు అర్థం చేసుకున్నారు.

చూడడానికి అందంగా కనిపించేలా విమానాలలో మార్పులు చేశారు. కొత్త రంగులు, కొన్ని విమానాలలో ఇంటీరియర్‌ మార్పులు, కీలక మార్గాల్లో బ్రాండ్-న్యూ ఏ350లు విమానాలు, పాత విమానాలను సర్వీస్ నుంచి తప్పించడంతోపాటు భారత్‌లో అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌కు అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా కొత్త విమానాల కోసం రికార్డ్-బ్రేకింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చింది టాటా.

"ప్రభుత్వ యాజమాన్యంలో సంవత్సరాల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఎయిర్ ఇండియా.. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా రూపాంతరం చెందడంలో చివరి దశను దాటబోతోంది’’ అని టాటా ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది.

కానీ గత వారం జరిగిన భయంకరమైన ప్రమాదంతో ఇప్పుడు ఈ ప్రణాళికలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విషాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రమాదంలో మరణించిన 14 ఏళ్ల ఆకాశ్ పట్ని మృతదేహం కోసం ఎదురు చూస్తున్న బాలుడి బంధువులు.

అహ్మదాబాద్ ప్రమాదంతో భయాందోళనలకు గురైన ప్రయాణికుల్లో కొందరు "నేను మళ్ళీ ఎప్పటికీ ఎయిర్ ఇండియాలో ప్రయాణించను" అని చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ముఖ్యంగా దాని డ్రీమ్‌లైనర్లకు మంచి సేఫ్టీ రికార్డు ఉన్నప్పటికీ, ఈ స్థాయి ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఇలాగే స్పందిస్తారని నిపుణులు అంటున్నారు.

ఈ విమానయాన సంస్థపై ప్రజలు ఇలాగే నమ్మకం కోల్పోతే, ఎయిర్‌లైన్ తిరిగి పుంజుకోవడంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఈ నెలలో ఫుకెట్ నుంచి దిల్లీకి 156 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఇంజిన్లలో సాంకేతిక లోపాలు తలెత్తడం, నకిలీ బాంబు బెదిరింపు వంటి ఇతర సంఘటనల వల్ల పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది.

"ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించడానికి ప్రజలు కొంతకాలంపాటు మొగ్గు చూపకపోవచ్చు. ఈ విపత్తు విషాదకరం, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ప్రజల మనసులో దీర్ఘకాలం పాటు నిలిచిపోతుంది’’ అని ఎయిర్‌లైన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అన్నారు.

"ఇప్పటికే చేసిన బుకింగ్‌లను కూడా రద్దు చేసుకుంటున్నారని మనం వింటూనే ఉన్నాం" అని మలేషియాకు చెందిన ఎండౌ అనలిటిక్స్ వ్యవస్థాపకుడు, విశ్లేషకుడు షుకోర్ యూసోఫ్ బీబీసీకి చెప్పారు.

"ఎయిర్ ఇండియా తిరిగి పుంజుకోవడానికి ప్రతిసారి కష్టపడుతూనే ఉంది. వారసత్వ సమస్యలు, ఆర్థిక భారాలతో సతమతమవుతోంది. ఈ విషాదం తర్వాతి పరిణామాలతో ఎయిర్‌లైన్ ఇబ్బంది పడుతోంది. తిరిగి పుంజుకోవడానికి యాజమాన్యం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చు" అని ఆయన అన్నారు.

"ఈ ప్రమాదం కారణంగా బీమా క్లెయిమ్‌లు, చట్టపరమైన చర్యలు, లాస్ మేనేజ్‌మెంట్‌ వంటి నాన్ ఆపరేషనల్ వ్యవహారాలకు పెద్ద మొత్తంలో నిధులు మళ్లించాల్సి ఉంటుంది. ఇది కొన్ని వారాలు, నెలలు లేదా సంవత్సరాలు సాగవచ్చు" అని యూసోఫ్ చెప్పారు.

2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ ఎదుర్కొన్న జంట విషాదాలను ఉదహరిస్తూ , ఆ క్రాష్‌ల తర్వాత ఎయిర్‌లైన్ లాభాలు ఆర్జించడానికి పదేళ్లు పట్టిందని ఆయన అన్నారు.

ఎయిర్ ఇండియా కూడా కోలుకోవడానికి సమయం పడుతుందని, భారత్‌లో విమాన ప్రయాణంలో అసాధారణ వృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు దాని ప్రత్యర్థులకు దక్కే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఆ సంస్థ విమాన సర్వీసులపై ఇప్పటికే ఒత్తిడి కనిపిస్తోంది. మెరుగైన సేఫ్టీ చెక్స్, పెరుగుతున్న గగనతల పరిమితుల కారణంగా జూలై మధ్యకాలం వరకు అంతర్జాతీయ సర్వీసుల కోసం వినియోగించే భారీ విమానాల సర్వీసులలో 15శాతం రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

టాటా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ క్రాష్ కారణంగా ఎయిర్ ఇండియా పుంజుకోవడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

మరోవైపు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో ఏం తేలుతుందోనన్న భయం ఎయిర్‌లైన్‌ను పట్టిపీడిస్తూనే ఉంటుంది.

బ్రిటన్, అమెరికా, ఇండియా అధికారులు దర్యాప్తులో భాగంగా వివిధ భద్రతా తనిఖీలు, చట్టపరమైన అంశాలను పర్యవేక్షిస్తున్నందున ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిలో ఉంటుందని విమానయాన నిపుణులు మార్క్ మార్టిన్ అన్నారు.

‘‘విమానాల ఆపరేషన్లు, నిర్వహణ మీద ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే పాత విమానాల సమస్యను ఏం చేశారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి’’ అని ఆయన అన్నారు.

"ఒక సంక్షోభం తర్వాత అత్యంత కీలకమైన దశ ఏమిటంటే కోలుకునే ప్రయత్నంతోపాటు, స్థిరమైన కమ్యూనికేషన్" అని ముంబైలో కంపెనీలు, కార్పొరేట్ లీడర్ల రిస్క్ ఎండ్ రెప్యూటేషన్ అడ్వయిజర్‌గా పని చేస్తున్న మితు సమర్ ఝా అభిప్రాయపడ్డారు.

‘‘ఎయిర్ ఇండియా దీనిని సక్రమంగా నిర్వర్తించగలగాలి’’ అని ఆమె అన్నారు.

కమ్యూనికేషన్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిర్ ఇండియా నుంచి స్థిరమైన కమ్యూనికేషన్ ఉండడం బ్రాండ్ ఇమేజ్ పునర్నిర్మాణానికి కీలకం అని నిపుణులు అంటున్నారు.

బలమైన స్థానంలోనే ఉండడంవల్ల తాను ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలనని ఎయిర్ ఇండియా నమ్ముతోంది.

దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరించడానికి, బాధితుల కుటుంబాలకు మద్దతుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ చెప్పారు.

ఈ వారం ప్రారంభంలో, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఉద్యోగులతో టౌన్‌హాల్ నిర్వహించి, ఏవైనా విమర్శలు వచ్చినా ధైర్యంగా ఉండాలని కోరినట్లు రాయిటర్స్ నివేదించింది.

గత వారం జరిగిన విమాన ప్రమాదం తన కెరీర్‌లో అత్యంత హృదయ విదారకమైన ఘటన అని, దీనినుంచి పాఠం నేర్చుకుని సురక్షితమైన విమానయాన సర్వీసును అందించడానికి ఎయిర్‌లైన్ కృషి చేయాలని ఆయన అన్నారు.

ఎయిర్‌ ఇండియాలో ప్రపంచంలోని అత్యుత్తమ పైలట్లు, ఇంజనీర్లు పనిచేస్తున్నారని ఏవియేషన్ కన్సల్టెంట్ సంజయ్ లాజర్ బీబీసీకి తెలిపారు.

అదనంగా, అన్ని 787 డ్రీమ్‌లైనర్‌లలో మెరుగైన సేఫ్టీ చెక్స్ నిర్వహించాలని భారత ప్రభుత్వ విమానయాన నియంత్రణా సంస్థ ఆదేశించింది. దీంతో ప్రజలు కాస్త ధైర్యంగా ప్రయాణించగలుగుతారు.

‘‘ప్రమాదాలు, ఎమర్జెన్సీ పరిస్థితుల తర్వాత, విమానయాన సంస్థలు చాలా జాగ్రత్తగా ఉంటాయని గతంలో జరిగన సంఘటనలనుబట్టి అర్థమవుతుంది. అది మానవ సహజ ధోరణి. ఒక దొంగతనం తర్వాత యజమాని ఆ ఇంటికి పెద్ద పెద్ద తాళాలు వేయడం లాంటిదే ఇది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో ప్రతి చిన్న నియమాన్ని ఎయిర్‌లైన్ తప్పకుండా ఫాలో అవుతుంది" అని లాజర్ అన్నారు.

ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన సంస్థలలో ఒకటైన సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్ ఇండియాకు వాటాదారు కావడం టాటాలకు కాస్త ఊరటనిచ్చే అంశం.

"ఎయిర్ ఇండియా తిరిగి పుంజుకోవడానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ సహాయసహకారాలు అందిస్తుంది" అని యూసోఫ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)