వైట్‌ హౌస్‌లో డోనల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ 'లంచ్'‌, దీనికి ముందే అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ, ఏం జరుగుతోంది?

జనరల్ ఆసిమ్ మునీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఐదురోజుల పాటు యూఎస్‌లో ఉంటారు. అమెరికా కాలమానం ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 1 గంటకు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను కలిసి, ఆయనతో భోజనం చేయనున్నారు మునీర్. అంతకుముందే, ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ 35 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు.

జీ-7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి కెనడా వెళ్లారు ప్రధాని మోదీ. ట్రంప్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు కానీ, అకస్మాత్తుగా పర్యటనను కుదించుకున్నారు. మోదీ కెనడా చేరుకోవడానికి ముందే వాషింగ్టన్‌కు వెళ్లిపోయారు ట్రంప్.

కాగా, ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు.

"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు బుధవారం ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఏప్రిల్ 22 తర్వాత, ఉగ్రవాదంపై చర్య తీసుకోవాలనే తన దృఢ సంకల్పాన్ని ప్రపంచం ముందు ఉంచినట్లు ట్రంప్‌తో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు" అని మిస్రీ అన్నారు.

"మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్‌లో ఇండియాపై పాక్ పెద్ద దాడి చేయవచ్చని చెప్పారు. భారత్ అంతకంటే పెద్ద దాడి చేస్తుందని ప్రధాని మోదీ బదులిచ్చారు" అని మిస్రీ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (ఫైల్)

సైనిక చర్యను ఆపడానికి భారత్, పాకిస్తాన్ మధ్య మాత్రమే చర్చలు జరిగాయని మిస్రీ అన్నారు.

''భారత్ ధీటైన సమాధానం ఇవ్వడంతో, సైనిక చర్యను ఆపాలని భారత్‌ను పాక్ కోరింది. ఈ సమయంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు మధ్యవర్తిత్వం లేదా అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఏ స్థాయిలోనూ చర్చలు జరగలేదు. భారత్ ఎప్పటికీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదని ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు" అని విక్రమ్ మిస్రీ అన్నారు.

డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

'అసౌకర్యంగా' భారత్

"ట్రంప్ భారత్ కోణంలో విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఉగ్ర దాడులను భారత్ యుద్ధంగానే చూస్తుందని ట్రంప్‌తో ప్రధాని మోదీ చెప్పారు. కెనడా నుంచి అమెరికా వచ్చి, భారత్ వెళ్లవచ్చు కదా అని ట్రంప్ అడిగారు. కానీ, ముందస్తు షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నట్లు ప్రధాని మోదీ బదులిచ్చారు. భారత్‌లో జరగబోయే తదుపరి క్వాడ్ సమావేశానికి రావాలని ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. భారత్ రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు ట్రంప్ బదులిచ్చారు" అని మిస్రీ తెలిపారు.

పహల్గాం దాడి తర్వాత, ఉగ్ర స్థావరాలుగా పేర్కొంటూ పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై భారత్ దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనగా, భారత్‌పై పాకిస్తాన్ కూడా దాడి చేసింది. ఈ ఘర్షణ కొనసాగుతుండగానే భారత్, పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని డోనల్డ్ ట్రంప్ మే 10న ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు.

ట్రంప్ ప్రకటన భారత్‌ను అసౌకర్యానికి గురిచేసింది. అయితే, పాకిస్తాన్ మాత్రం స్వాగతించింది. ఇదే సందర్భంలో, కాల్పుల విరమణ ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్యే జరిగిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.

కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని, ఏ మూడో దేశం మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యం కాదనేది భారత విధానం.

అయితే, ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతోనే ఆగిపోలేదు. భారత్, పాకిస్తాన్‌లతో వాణిజ్యాన్ని నిలిపివేస్తానని బెదిరించినట్లు, ఆ తర్వాతే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు.

ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్‌కు ట్రంప్ బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు.

అయితే, భారత్, పాకిస్తాన్ మాదిరే ఇజ్రాయెల్, ఇరాన్‌లు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని ట్రంప్ సూచిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.

జీ7 సమావేశం

ఫొటో సోర్స్, @narendramodi

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ జీ-7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లారు. అక్కడ ట్రంప్‌‌తో భేటీ కావాల్సి ఉంది, అయితే అప్పటికే ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

భారత వ్యూహాత్మక వ్యవహారాల్లో నిపుణులు బ్రహ్మ చెల్లానీ ఎక్స్(ట్విట్టర్) పోస్టులో "ప్రధాని మోదీ G-7 శిఖరాగ్ర సమావేశానికి కెనడాలోని ఆల్బెర్టాకు రాకముందే అధ్యక్షుడు ట్రంప్ వెళ్లిపోవడంతో, ఇద్దరు నాయకులు ముఖాముఖి కలుసుకోలేకపోయారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో తాను పాత్ర పోషించానని ట్రంప్ నిరంతరం పేర్కొంటున్నందున ఈ సమావేశం మీడియా దృష్టిని కూడా ఆకర్షించి ఉండేది" అని రాశారు.

పాక్‌తో సమస్యలో ఏ దేశ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. కానీ, ఇదే సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలవబోతుండటం కీలకంగా మారింది.

వైట్ హౌస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైట్ హౌస్

వైట్‌ హౌస్‌లో మునీర్ భేటీ

ట్రంప్, మునీర్ భేటీపై దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను నిశితంగా పరిశీలించే మైకేల్ కుగెల్‌మన్ ఎక్స్‌లో స్పందించారు.

"ట్రంప్, మునీర్ మధ్య సమావేశాన్ని ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంగానే చూడకూడదు. ముఖ్యమైన ఖనిజాలు, క్రిప్టో కోణంలోనూ చూడాలి. వీటిపై ట్రంప్ ఆసక్తితో ఉన్నారు. జనరల్ మునీర్‌కు ఈ విషయాలపై మాట్లాడే స్థాయి ఉంది, కశ్మీర్‌పై కూడా" అని ఆయన తెలిపారు.

మైకేల్ కుగెల్‌మన్ పోస్ట్‌ను భారత మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ రీపోస్ట్ చేస్తూ "ఊహించనిది. దీనికి రెండు అర్థాలు ఉండవచ్చు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా చేరితే పాకిస్తాన్ సైన్యం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తుండటం. లేదా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలని ట్రంప్ ఇప్పటికే నిర్ణయించుకుని, పాకిస్తాన్ సాయం కోరడం" అని తెలిపారు.

"అమెరికా సీనియర్ అధికారులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో తరచుగా సమావేశమవుతారు. కానీ, అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడం అసాధారణం. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం" అని కుగెల్‌మన్ ఆ పోస్టులో రాశారు.

"ఇప్పుడు భారత్ మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఉగ్ర దాడికి సూత్రధారిగా భారత్ ఎవరినైతో భావిస్తుందో అదే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ మునీర్‌ను వైట్‌హౌస్‌లో ట్రంప్ కలవబోతున్నారు" అని ఇండో-పసిఫిక్ ప్రాంత వ్యవహారాలను నిశితంగా పరిశీలించే విశ్లేషకుడు డెరెక్ గ్రాస్‌మాన్ ఎక్స్‌లో తెలిపారు.

ట్రంప్ తన మొదటి పదవీకాలంలో పాకిస్తాన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేశారు. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కానీ, ఈ నెలలో పాకిస్తాన్ నాయకత్వ సామర్థ్యాలపై ట్రంప్ మాట్లాడారు.

ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికాకు పాకిస్తాన్ మిత్రదేశంగా ఉందని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మైకేల్ కురిల్లా ఇదే నెలలో వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలను ఇండియాతో ముడిపెట్టకూడదని జనరల్ కురిల్లా అభిప్రాయపడ్డారు.

మంగళవారం యూఎస్ హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ సమావేశానికి ముందు కురిల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్‌తో తన సంబంధాలను అమెరికా మూల్యంగా చెల్లించుకోకూడదన్నారు కురిల్లా.

అమెరికా, ఐక్యరాజ్యసమితిలో గతంలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేసిన మలీహా లోధి బ్రిటిష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ "అమెరికాతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. కానీ, చైనాతో సంబంధాలను చెడగొట్టుకునే మూల్యంతో కాదు. పాకిస్తాన్‌తో చైనా సంబంధాన్ని అమెరికాతో పోల్చలేం. పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రాధాన్యం చైనా, ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ, ఆర్థిక అవసరాలు రెండింటినీ చైనా తీరుస్తోంది" అని అన్నారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను ఈ నెలలో "మీరు డోనల్డ్ ట్రంప్‌ను నమ్ముతున్నారా?" యూరోపియన్ మీడియా అని ప్రశ్నించింది. "దీనర్థం ఏమిటి?" అని జైశంకర్ అడిగారు.

"ట్రంప్ చెప్పే దానికి మీరు కట్టుబడి ఉంటారా?. భారత్ తన సంబంధాలను మరింతగా పెంచుకోవాలనుకునే భాగస్వామి ఆయనేనా?" అని అడిగింది.

జైశంకర్ బదులిస్తూ "మా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ప్రతి సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. అమెరికాతో సంబంధం మాకు ముఖ్యం. అమెరికాలో X అధ్యక్షుడు ఉన్నా, లేదా Y ఉన్నా, మా సంబంధాలు దీని ద్వారా నిర్ణయం కావు" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)