విమానం క్యాంటీన్‌లోకి చొచ్చుకెళ్లిన భయానక క్షణాల గురించి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..

డాక్టర్స్ హాస్టల్‌లోని దృశ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వికాస్ పాండే, అంత్రిక్షా పథానియా, జోయా మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్

గురువారం మధ్యాహ్నం వేళ భోజనానికి వచ్చిన విద్యార్థులతో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ క్యాంటీన్ కళకళలాడుతోంది. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగానూ ఉంది.

విద్యార్థుల సరదా ముచ్చట్లు, గిల్లికజ్జాలు, చదువుకు సంబంధించిన చర్చలతో క్యాంటీనంతా సందడిగా ఉంది.

మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆ క్యాంటీన్‌లో కనీసం 35 మంది ఉన్నారు. కొంతమంది ప్లేట్లలో భోజనం వడ్డించుకొని క్యాంటీన్‌లో నడుస్తుండగా, మరికొంతమంది తమవంతు కోసం క్యూలో నిల్చున్నారు.

అక్కడ డాక్టర్లు, తమ కుటుంబసభ్యులతో విద్యార్థులు కలిసిపోయారు. అయితే, కొన్ని సెకండ్లలోనే అక్కడి వాతావరణం మారిపోయింది.

క్యాంటీన్‌లో విద్యార్థుల మాటలు, ముచ్చట్ల గోల కాస్తా సమీపిస్తున్న జెట్ ఇంజిన్ల హోరులో మూగబోయింది. ఆ గది పేలిపోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అంతకు ఒక నిమిషం ముందు, అక్కడికి ఒకటిన్నర కిలో మీటర్ దూరంలో ఉన్న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ171 విమానం టేకాఫ్ తీసుకుంది.

ఆ ఎయిరిండియా 787 డ్రీమ్‌లైనర్ విమానం 242 మందితో లండన్‌ బయల్దేరింది.

కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది.

అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే ఒక నివాస ప్రాంతంలో ఉన్న డాక్టర్స్ హాస్టల్ పైకప్పు మీద ఆ విమానం కూలిపోయి అగ్ని గుండంలా మారింది. విమానంలోని ఒక్కరు తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది.

ఆ భయానక క్షణాల్లో, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు, మరణించిన ట్రైనీ డాక్టర్ల స్నేహితులు, టీచర్లతో బీబీసీ మాట్లాడింది.

ప్రమాదం తర్వాత మెస్ హాల్‌లో శిథిలాలు, శకలాలు

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రమాదం తర్వాత మెస్ హాల్‌లో శిథిలాలు, శకలాలు

ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ప్రజలకు వెంటనే అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు.

దిక్కులు పిక్కటిల్లే ఒక భారీ శబ్దం వినిపించిందని, అప్పుడు డాక్టర్స్ హాస్టల్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న మరో భవనంలో తాము ఉన్నామని బీజే మెడికల్ కాలేజీ కిడ్నీ సైన్సెస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే ఒక డాక్టర్ చెప్పారు.

''మొదట మెరుపు లేదా పిడుగు శబ్దం అని అనుకున్నాం. కానీ, 40 డిగ్రీల ఎండలో మెరుపు వచ్చే అవకాశం ఉందా అని మళ్లీ ఆశ్యర్యపోయాం. డాక్టర్లంతా బయటకు పరిగెత్తారు. మన బిల్డింగ్‌లో విమానం క్రాష్ అయిందంటూ కొంతమంది అరుపులు వినిపించాయి'' అని ఆయన వివరించారు.

ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు అంతా మసకగా కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించేవారితో, అసలేమైందో తెలుసుకునేందుకు బయటకు వచ్చిన వారితో క్యాంపస్‌ అంతా గందరగోళ వాతావరణం నెలకొందని వాళ్లు వెల్లడించారు.

ప్రిన్స్, క్రిష్ పాట్నీ అనే ఇద్దరు సోదరులు తమ బైక్‌ల మీద వస్తున్నప్పుడు వారికి పెద్ద శబ్దం వినిపించింది. వాళ్లిద్దరూ డాక్టర్స్ హాస్టల్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నారు.

''అటు చూస్తే విమానం రెక్కలా ఏదో కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లాం. కానీ, పేలుడు ధాటికి పుట్టిన వేడి చాలా దారుణంగా ఉంది. అందుకే మేం హాస్టల్‌లోకి వెళ్లలేకపోయాం. అక్కడ శిథిలాల కుప్ప ఏర్పడింది'' అని బీబీసీకి చెప్పారు 18 ఏళ్ల ప్రిన్స్ చెప్పారు.

బాధితుల గుర్తింపు చర్యలు కొనసాగుతున్నాయి

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బాధితుల గుర్తింపు చర్యలు కొనసాగుతున్నాయి

ఈ ఇద్దరు సోదరులతో పాటు మరికొంతమంది స్థానిక వలంటీర్లు అక్కడ వేడి తగ్గేవరకు చూసి, తర్వాత భవనంలోకి ప్రవేశించారు. ఎంట్రన్స్ వద్ద శిథిలాలను తీసేయడంలో పోలీసులతో కలిసి వారంతా పనిచేశారు.

ఎట్టకేలకు క్యాంటీన్‌కు చేరుకున్న వారు అక్కడేమీ చూడలేకపోయారు.

ఆ గది మొత్తం దట్టమైన నల్లటి పొగ నిండిపోయింది. లోహాలు కాలిన వాసన వచ్చింది. మళ్లీ పేలుడు జరగకుండా అక్కడున్న గ్యాస్ సిలిండర్లను తొలగించామని 20 ఏళ్ల క్రిష్ వివరించారు.

అక్కడ కుప్పలా పడిన సూట్‌కేసులను చూసి వాటిని తొలగించడానికి ఆ ఇద్దరు సోదరులు, వలంటీర్లు అక్కడికి వెళ్లారు. అక్కడి కనిపించిన దృశ్యం చూశాక కడుపులో తిప్పేసినట్లయిందని వారు చెప్పారు.

వారిలో చాలామంది ప్రాణాలతో ఉన్నారు. కొంతమంది చేతుల్లో అన్నం ఉంది. మరికొంతమంది ముందు భోజనం ప్లేట్లు ఉన్నాయి. కొంతమంది చేతుల్లో గ్లాసులు ఉన్నాయి.

వాళ్లంతా తీవ్రంగా గాయపడ్డారు.

అంతకు కొద్దిసేపటి కిందటి వరకు భోజనం చేస్తున్నవాళ్లంతా, కొన్ని సెకండ్లలోనే విమాన శకలాల మధ్య తీవ్ర గాయాలతో పడిఉన్నారు.

''వాళ్లకు స్పందించే అవకాశం కూడా రాలేదు'' అని ఘటనా స్థలానికి సమీపంలోని ఒక భవనంలో ఉన్న మరో డాక్టర్ చెప్పారు.

మెస్ హాల్

ఫొటో సోర్స్, Dr Kevin Prajapati and Dr Bharat Ayar

అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో సెకండ్ ఇయర్ విద్యార్థి ఒకరు ఉన్నారు. ఆయన డాక్టర్స్ హాస్టల్‌లోనే ఉంటారు.

విమానం క్రాష్ అయినప్పుడు, క్యాంటీన్‌లో తాను ఎప్పుడూ కూర్చొనే టేబుల్ దగ్గరే కూర్చున్నానని, తనతో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారని ఆయన చెప్పారు.

''పెద్ద శబ్ధం వినిపించింది. భయంకరమైన అరుపులు వినిపించాయి. అప్పుడే మేమంతా పెద్ద బండరాళ్ల కింద చిక్కుకుపోయామని అర్థమైంది. ఎటూ కదల్లేని స్థితిలో ఉన్నాం. విమానంలో నుంచి వచ్చే పొగ, అగ్నికి మా ముఖాలు చాలా దగ్గరగా ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోలేకపోయాం'' అని ఆయన వివరించారు.

ఈ ప్రమాదంలో ఛాతీకి తీవ్ర గాయాలైన ఆయన, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన స్నేహితులకు ఏం జరిగిందో, వారెలా ఉన్నారో ఆయనకేమీ తెలియదు.

మొదట విమానం రెక్క, భవనం పైకప్పును చీల్చుతూ వచ్చిందని తర్వాత విమానం మిగతా భాగాలు భవనాన్ని చీల్చాయని చాలా మంది ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి చెప్పారు. విమానం రెక్క పడిన చోట తీవ్ర నష్టం జరిగింది.

భయంతో కూడిన ఈ గందరగోళంలో విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయేందుకు రెండో అంతస్తు నుంచి మూడో అంతస్తు నుంచి దూకేశారు. భవనంలోని ఒకే ఒక మెట్లదారి శిథిలాలతో పూడుకుపోయిందని తర్వాత విద్యార్థులు చెప్పారు.

విమానంలోని ప్రయాణికులు కాకుండా ఇంకా ఎంతమంది చనిపోయారో స్పష్టంగా తెలియదు. దీనిపై స్పష్టత రావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పట్టొచ్చు.

ఆ క్షణంలో క్యాంటిన్‌లో ఉన్నవాళ్లు మాత్రమే చనిపోలేదు.

ఎయిరిండియా శకలాలు

హాస్టల్ కిచెన్‌లో పనిచేసే రవి ఠాకూర్, నగరంలోని ఇతర హాస్టల్స్‌కు లంచ్ డెలివరీ చేయడం కోసం బయటకు వెళ్లారు. ఎప్పటిలాగే ఆయన భార్య, రెండేళ్ల కూతురు అక్కడే ఉన్నారు.

విమాన ప్రమాదం వార్త తెలియగానే వెంటనే వెనక్కి వచ్చిన ఆయనకు ఏమీ అర్థం కాలేదు. అక్కడంతా పొగ, ఫైరింజన్లు, పోలీసులు, అంబులెన్స్ వర్కర్లతో గందరగోళ వాతావరణం నెలకొంది.

తన భార్య, పాప కోసం ఆయన గాలించారు. కానీ, వారి ఆచూకీ దొరకలేదు.

ఇక హాస్పిటల్ దగ్గర పరిస్థితి చూస్తే, తమ విద్యార్థులను కాపాడుకోవడం కోసం టీచర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

''నేను వాళ్లకు పాఠాలు చెప్పాను. వాళ్లంతా నాకు బాగా తెలుసు. గాయపడిన విద్యార్థులకు చికిత్స జరుగుతోంది. ఈ క్షణంలో వాళ్లే మాకు ముఖ్యం'' అని బీబీసీతో చెప్పారు కాలేజీకి చెందిన ఒక ప్రొఫెసర్.

మరోవైపు, రవి ఠాకూర్ ఆశలు సన్నగిల్లుతున్నప్పటికీ తన భార్య, కూతురి కోసం వెతుకుతూనే ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)