పదకొండేళ్లకే తండ్రిని కోల్పోయి వాచ్‌మేన్‌గా పనిచేసిన యవకుడు ఐఐఎంలో అడ్మిషన్ సాధించాడు

ఐఐఎం, అహ్మదాబాద్, ఎంబీఏ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ఫొటో సోర్స్, Dipesh Kewlani

ఫొటో క్యాప్షన్, వాచ్‌మేన్‌గా పని చేస్తూ ఐఐఎంలో సీటు సాధించిన దీపేష్
    • రచయిత, అర్జున్ పర్మార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నేను పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టడం ఇదే తొలిసారి కావచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు నేను చదువుతో పాటు ఉద్యోగం కూడా చేస్తూ ఉండేవాడిని. కేవలం చదువు మీదనే దృష్టి పెట్టగలిగే పరిస్థితి ఉండేది కాదు. నాకు ఫైనాన్స్‌ విభాగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉంది. ఐఐఎంలో ఎంబీఏ చేశాక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అవుదామనుకుంటున్నాను"

అహ్మదాబాద్ కంటోన్మెంట్‌లో వాచ్‌మేన్‌గా పని చేసిన దీపేష్ కెవ్‌లానీ తన విజయం గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో టాప్ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్, ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో ప్రవేశాల కోసం 2024 నవంబర్‌లో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 27ఏళ్ల దీపేష్ కెవ్‌లానీ 92.5 పర్సంటైల్‌ సాధించి ఐఐఎం షిల్లాంగ్‌లో సీటు సంపాదించారు.

బిజినెస్ మేనేజ్‌మెంట్‌ చదవాలనుకునేవారికి దేశంలో అగ్రశ్రేణి విద్యా సంస్థ అంటే ఐఐఎం అనే గుర్తింపు ఉంది.

ఐఐఎంలో సీటు సాధిస్తే జీవితంలో విజయం సాధించినట్లుగా భావిస్తారు.

ఐఐఎంలలో చదివిన వారికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు లక్షల రూపాయలు జీతాలు చెల్లిస్తున్నట్లుగా తరచుగా కథనాలు వస్తున్నాయి.

దీపేష్ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. దీంతో ఆయన చదువుకుంటూనే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే చుట్టుముట్టిన కష్టాలను చూసి ఏనాడు నిరాశ చెందలేదని, తన శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నానని ఆయన చెప్పారు.

దీపేష్ అహ్మదాబాద్‌లో తన కుటుంబంతో కలిసి చిన్న ఇంట్లో నివసిస్తున్నారు.

ఈ విజయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఆయన ‘బీబీసీ’తో పంచుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐఐఎం, అహ్మదాబాద్, ఎంబీఏ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ఫొటో సోర్స్, facebook.com/dipesh.kewlani

ఫొటో క్యాప్షన్, దీపేష్ ఏడో తరగతి చదువుతూనే బూట్ల దుకాణంలో పని చేసి కుటుంబానికి అండగా నిలిచారు.

11 ఏళ్లకే తండ్రిని కోల్పోవడంతో చిన్న వయసులోనే పనిలోకి

దీపేష్‌కు 11 ఏళ్లున్నప్పడు ఆయన తండ్రి చనిపోయారు.

తండ్రి చనిపోయిన తర్వాత దీపేష్ కుటుంబం జైపుర్ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో దీపేష్ మేనమామ ఉంటున్నారు. అక్కడే వారి కుటుంబం కూడా స్థిరపడింది.

దీపేష్‌ కుటుంబంలో తల్లితో పాటు ఆరేళ్ల తమ్ముడు దినేష్ ఉన్నారు.

దీపేష్ చిన్నవాడైనప్పటికీ కుటుంబ భారం ఆయన భుజాల మీదనే పడింది.

"మా ప్రాంతంలో ఉన్న ఒక ట్రస్ట్ మాకు సాయం చేసింది. నాకు, మా తమ్ముడికి స్కూలు ఫీజులు చెల్లించింది. దీంతో మా చదువు కొనసాగింది. అయితే ఇంట్లో సాయంగా ఉండేందుకు నేను ఏదైనా పని చేయాలని అనుకున్నాను" అని దీపేష్ చెప్పారు.

తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు, తమ ప్రాంతంలోని హోల్‌సేల్ బూట్ల దుకాణంలో పని చేయడం మొదలు పెట్టానని దీపేష్ చెప్పారు.

"ఇది 2011-12లో జరిగింది. అప్పట్లో నాకు నెలకు 1500 రూపాయల జీతం వచ్చేది. అది కూలి పని లాంటిది. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ పని చేయడానికి వెళ్లేవాడిని. నా జీతానికి తోడు మా మామయ్య కూడా కొంత సాయం చేసేవారు. దీంతో మా జీవితం గడిచేది" అని అన్నారాయన.

ఉద్యోగం చేస్తూనే పది, పన్నెండో తరగతి పరీక్షలు రాసి, రెండింటిలో మంచి మార్కులు సాధించారు.

"మాకు స్కూల్లో చదవడానికి సమయం ఉండేది కాదు. ఆ సమయంలో ట్యూషన్‌కు వెళ్లడం అనేది కల లాంటిది. అయినప్పటికీ నేను పదో తరగతిలో 85శాతం మార్కులు సాధించాను. పన్నెండో తరగతిలో 89శాతం మార్కులు వచ్చాయి. పన్నెండో తరగతిలో నేనే క్లాస్‌లో టాపర్‌ని" అని దీపేష్ వివరించారు.

ఐఐఎం, అహ్మదాబాద్, ఎంబీఏ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ఫొటో సోర్స్, facebook.com/dipesh.kewlani

ఫొటో క్యాప్షన్, ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో స్నేహితులు సాయం చేశారని దీపేష్ చెప్పారు.

పన్నెండో తరగతి పాసైన తర్వాత వాచ్‌మేన్ ఉద్యోగం

2017 మార్చ్‌లో పన్నెండో తరగతి పరీక్షలు రాసిన తర్వాత అహ్మదాబాద్‌లోని షాహిబాగ్ కంటోన్మెంట్‌లో వాచ్‌మేన్ ఉద్యోగం ఖాళీగా ఉన్నట్లు దీపేష్‌కు తెలిసింది.

"ఆ సమయంలో నేను పన్నెండో తరగతి పరీక్షలు రాశాను. అక్కడ వాచ్‌మేన్ ఉద్యోగం వచ్చినట్లు అప్పుడే తెలిసింది. అయితే నాకు శాశ్వత ఆదాయ వనరు ఉండాలని అనుకున్నాను. అందుకే అయిష్టంగానే ఆ ఉద్యోగంలో చేరాను. అది ప్రభుత్వ ఉద్యోగం. ఆ సమయంలో నా జీతం 18వేల రూపాయలు" అని దీపేష్ చెప్పారు.

వాచ్‌మేన్‌గా పని చేస్తూనే దీపేష్ బీకామ్, ఎంకామ్ పరీక్షలు రాసి పాసయ్యారు.

ఐఐఎం, అహ్మదాబాద్, ఎంబీఏ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ఫొటో సోర్స్, Dipesh Kewlani

ఫొటో క్యాప్షన్, దినేష్ గ్రాడ్యుయేషన్ వేడుకకు ఆయన అన్న దీపేష్‌‌తో పాటు తల్లి భారతి కూడా వచ్చారు.

ఎంబీఏ పక్కన పెట్టి తమ్ముణ్ణి ఐఐఎంకు పంపే ప్రయత్నం

"నేను ఎంబీఏ చేయాలని అనుకున్నాను. అయితే నాకు ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి. అదే సమయంలో నా తమ్ముడు ఐఐఎంలో ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు. దీంతో నేను ఐఐఎంలో చేరాలన్న నా కలను పక్కన పెట్టి తమ్ముడి చదువుకు ప్రాధాన్యం ఇచ్చాను" అని దీపేష్ తన ఎంబీఏ కల గురించి వివరించారు.

2023లో దీపేష్ సోదరుడు దినేష్ ఐఐఎం -లఖ్‌నవూలో సీటు సాధించారు.

ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్న తన కలను కొంతకాలం పక్కన పెట్టిన దీపేష్, తమ్ముడి స్ఫూర్తితో మళ్లీ తన ప్రయత్నాన్ని కొనసాగించారు.

2024లో దినేష్ ఐఐఎం- లఖ్‌నవూ నుంచి ఇంటర్న్‌షిప్ కోసం అహ్మదాబాద్ వచ్చారు. ఈ సమయంలో దినేష్‌తో పాటు ఆయన స్నేహితులు దీపేష్‌ను ఐఐఎం కోసం ప్రవేశ పరీక్ష రాసేలా ప్రోత్సహించారు.

వాళ్లు పదేపదే చెప్పడంతో దీపేష్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలని నిర్ణయించుకున్నారు.

"2024 మేలో నేను కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టాను. దీని కోసం కోచింగ్ తీసుకున్నాను. నేను 2.30 వరకు ఉద్యోగం చేసేవాడిని. 4.30 నుంచి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్లాసులకు హాజరయ్యేవాడిని" అని దీపేష్ చెప్పారు.

"కోచింగ్‌కు వెళ్లడానికి ముందు, మా ఆఫీసులోనే రోజూ గంటన్నర పాటు చదువుకునేవాడిని. ఆ తర్వాత క్లాసులకు వెళ్లి ఇంటికి వచ్చేవాడిని. తర్వాత రెండు గంటలు ఇంట్లోనే చదివే వాడిని. అలా రోజూ నాలుగు గంటలు చదివేలా ప్లాన్ చేసుకున్నాను" అని దీపేష్ తన ప్రిపరేషన గురించి వివరించారు.

ఆ సమయంలో ఉద్యోగం చేస్తూనే క్యాట్ కోచింగ్ కోసం రోజూ 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించేవారు.

అయినప్పటికీ అలసి పోకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించారు.

ఆయన కష్టం ఫలించింది.

2024 నవంబర్‌లో నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు 2024 డిసెంబర్‌లో ప్రకటించారు. ఈ పరీక్షలో దీపేష్ 92.5 శాతం పర్సంటైల్‌ సాధించారు.

ఆ తర్వాత ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ చాటి ఐఐఎం- షిల్లాంగ్‌లో అడ్మిషన్ తీసుకున్నారు.

తన కథ విన్న వారు తనపై జాలి, సానుభూతి చూపించడాన్ని ఇష్టపడనని ఆయన చెప్పారు.

తన జీవితం నుంచి మిగతా వారు స్ఫూర్తి పొందాలని కోరుకుంటానని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న తమ ప్రయత్నాన్ని విరమించవద్దని కోరారు.

తన జీవితంలో కొంతమంది వ్యక్తులు, సంస్థలు చేసిన సాయంతోనే తాను ఇవన్నీ సాధించగలిగినట్లు దీపేష్ చెప్పారు.

"స్కూలుకెళ్లేటప్పుడు మా మామయ్య, మా ప్రాంతంలో ఉన్న ట్రస్టు, కాలేజ్ రోజుల్లో స్నేహితులు, క్యాట్‌కు సిద్ధమయ్యేటప్పుడు కొలీగ్స్, టీచర్లు ఇలా అందరూ సాయం చేశారు, చివరిగా నేను షిల్లాంగ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పుడు నా సోదరుడు ఇంటి బాధ్యతల్ని చూసుకునేందుకు ముందుకు వచ్చాడు. కోచింగ్ సమయంలో వాడు కూడా నాకు అండగా నిలిచాడు. నేను షిల్లాంగ్ వెళితే మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆమె గురించి ఎలాంటి ఆందోళన లేకుండా నేను వెళ్లి చదువుకోగలను. ఇలా నా జీవితంలో అనేక మంది సాయపడ్డారు" అని దీపేష్ వివరించారు.

కుమారుడు సాధించిన విజయం చూసి దీపేష్ తల్లి భారతి కెవ్‌లాని గర్వపడుతున్నారు.

"నా పెద్ద కొడుకు దీపేష్ చాలా కష్టాలు పడ్డాడు. ఇప్పుడతని కల నిజం కాబోతోంది. నేను కొంతకాలం ఇంటి వద్ద ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. వాడి కష్టం వల్లనే ఇదంతా సాధ్యమైంది. జీవితంలో వాడు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తోంది" అని ఆమె చెప్పారు.

2025లో ఎంబీఏ పూర్తి చేసిన దినేష్ హైదరాబాద్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం సాధించారు.

జూన్ 23న ఐఐఎం- షిల్లాంగ్‌లో చేరబోతున్న దీపేష్ కూడా తన కలను నెరవేర్చుకునేందుకు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)