థాయిలాండ్ నుంచి ముంబయి వచ్చిన ప్రయాణికుడి బ్యాగ్‌లో 47 విషపూరిత పాములు

సరీసృపాలు, పాములు, స్మగ్లింగ్ ముంబయి ఎయిర్‌పోర్టు

ఫొటో సోర్స్, Mumbai Customs-III/X

    • రచయిత, చెరిలాన్ మొల్లన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి

అరుదైన సరీసృపాలు, విషపూరిత పాములను భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

థాయిలాండ్ నుంచి భారత్ వస్తున్న ప్రయాణికుడిని ముంబయి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు.

అతని చెక్‌ఇన్ లగేజ్‌లో సరీసృపాలు, 47 విషపూరిత పాములను దాచి ఉంచినట్లు గుర్తించామని అధికారులు చెప్పారు.

వన్యప్రాణుల చట్టం కింద ఆ సరీసృపాలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన ప్రయాణికుడు పోలీసుల అదుపులో ఉండటంతో అతని పేరు వెల్లడించలేదు. అరెస్ట్‌పై అతను కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒక పాత్రలో అటు ఇటు తిరుగుతున్న రంగు రంగుల పాములున్న ఫోటోను కస్టమ్స్ అధికారులు ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

తాము ఆ ప్రయాణికుడి నుంచి మూడు స్పైడర్ టెయిల్ హార్న్డ్ వైపర్స్, ఐదు ఏషియన్ లీఫ్ టర్టిల్స్, 44 ఇండోనేషియన్ పిట్ వైపర్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు ఆ పోస్టులో వివరించారు.

ఈ పాములను థాయిలాండ్‌లో ఎక్కడ నుంచి తెస్తున్నారో తెలియలేదు.

దేశంలోకి జంతువుల్ని దిగుమతి చేసుకోవడం నేరం కాకున్నప్పటికీ, భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం కొన్ని జంతువుల దిగుమతుల్ని నిషేధిస్తోంది.

అందులో అంతరించేపోయే జాతికి చెందిన జీవుతలో పాటు ప్రభుత్వ సంరక్షణలో ఉన్న జీవులు కూడా ఉన్నాయి.

వన్యప్రాణులను దిగుమతి చేసుకోవాలనుకున్న ప్రయాణికులు తప్పనిసరిగా అనుమతితో పాటు లైసెన్స్ తీసుకోవాలి.

దేశంలోకి అక్రమంగా వన్య ప్రాణుల్ని తీసుకు వస్తున్న ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడం అసాధారణమేమీ కాదు.

సరీసృపాలు, పాములు, స్మగ్లింగ్ ముంబయి ఎయిర్‌పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హార్న్ పిట్ వైపర్ స్నేక్‌గా పిలిచే ఈ పాము రెండు కళ్ల మీద రెండు కొమ్ములు ఉంటాయి.

జనవరిలో మొసలి పుర్రెను తన లగేజ్‌లో తీసుకువెళుతున్న ఓ కెనడా ప్రయాణికుడిని దిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మలేసియా, ఇండోనేషియా, థాయిలాండ్ అడవుల నుంచి ఐదు సియామంగ్ గిబ్బన్స్ (చింపాంజీలు), ఒక చిన్న కోతిని తీసుకువెళ్తున్న ఒకరిని ముంబయి ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ గిబ్బన్స్‌ను ప్రమాదంలో ఉన్న జీవులుగా గుర్తించింది. ప్రయాణికుల ట్రాలీ బ్యాగ్ లోపల ఉంచిన ప్లాస్టిక్ పెట్టెలో వాటిని దాచి పెట్టారు.

నిరుడు నవంబర్‌లో బ్యాంకాక్ నుంచి వస్తూ 12 విదేశీ తాబేళ్లను తీసుకువస్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

2019లో చెన్నై ఎయిర్‌పోర్టులో థాయిలాండ్ నుంచి ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి హార్న్డ్ పిట్ వైపర్ స్నేక్ ఒకటి, ఐదు ఇగువానాలు, నాలుగు నీలి రంగు నాలుక ఉన్న నలకందాసులు, మూడు ఆకుపచ్చ కప్పలు, 22 ఈజిప్షియన్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)