రాజేంద్ర ప్రసాద్.. ఇవేం మాటలు? తోటి నటులపై బూతుల దాడా?

ఫొటో సోర్స్, face book/S V Krishna Reddy
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బహిరంగ వేదికపై తోటి నటులను రాయడానికి వీల్లేని పదాలతో మాట్లాడారు.
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడిన మాటల్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
తోటి నటీనటులపై ఇలా మాట్లాడటమేమిటని ప్రశ్నిస్తున్నారు.
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు బాధించాయని నటుడు అలీ బీబీసీతో చెప్పారు.
అయితే, తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, తామంతా కుటుంబసభ్యుల్లా ఉంటామని రాజేంద్ర ప్రసాద్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.


ఫొటో సోర్స్, face book/S V Krishna Reddy
రాజేంద్రప్రసాద్ ఏం అన్నారంటే..
ఇంతకీ ఈ వివాదం వెనుక ఏం జరిగిందనే ఒకసారి పరిశీలిస్తే.. సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ ఫిలింనగర్ లో జూన్ ఒకటో తేదీన జరిగాయి.
''32 వసంతాలు – 42 చిత్రాల సృజనాత్మక జైత్ర యాత్ర'' పేరుతో వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమానికి నటుడు రాజేంద్రప్రసాద్ కూడా హాజరయ్యారు.
గతంలో రాజేంద్రప్రసాద్, కృష్ణా రెడ్డి కలిసి రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, కొబ్బరి బొండాం వంటి సినిమాలు తీశారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. సహ నటులు అలీ, రోజా(ఏపీ మాజీ మంత్రి), ఆమని, రవళిపై అనుచితంగా మాట్లాడారు.
అదే స్టేజ్‌పైన ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, సీనియర్ నటుడు మురళీ మోహన్ ఉన్నారు.
స్టేజీ దిగువన సభికుల్లోనూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటులు పెద్దసంఖ్యలో ఉన్నారు.
ఎవరూ రాజేంద్ర ప్రసాద్ను నియంత్రించే ప్రయత్నం చేయలేదు.
తన ప్రసంగంలో నటుడు అలీని ఉద్దేశించి కొన్ని రాయడానికి వీల్లేని మాటలు అన్నారు రాజేంద్ర ప్రసాద్.
''ఏరా అలీగా.. ఎక్కడ………….'' అంటూ బూతులు మాట్లాడారు.
అలాగే కెమెరా మెన్ శరత్ పైనా ఇదే విధంగా నోరు పారేసుకున్నారు రాజేంద్రప్రసాద్. ఇక్కడ రాయడానికి వీల్లేని పదాలు వాడారు.
తన వ్యాఖ్యలపై దుమారం రేగడం గురిచి రాజేంద్రప్రసాద్ బీబీసీతో మాట్లాడారు.
ఇలా ప్రతిదీ వివాదం చేస్తుంటే ఇక ఫంక్షన్లకు హాజరు కాలేనని అన్నారు.
''నేను కామెడీ బేస్డ్ నటుడ్ని. యాక్షన్ హీరోల్లా ఉండను. నేను పనిచేసే ప్రదేశంలో ఎలా ఉంటానో.. ఆ ఫంక్షన్‌లో కూడా అలాగే ఉంటూ మాట్లాడాను.
నా కుటుంబ కార్యక్రమం అది'' అని బీబీసీతో చెప్పారు రాజేంద్ర ప్రసాద్.

ఫొటో సోర్స్, instagram/ali_the_actor
ఆయన మాటలతో హర్ట్ అయ్యా: నటుడు అలీ
రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలతో హర్ట్ అయ్యాయని, వాటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అని బీబీసీతో చెప్పారు నటుడు అలీ.
''రాజేంద్రప్రసాద్ అన్న మాటతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే ఎలా స్పందించాలో అర్థం కాలేదు. నన్ను ఎలా సంబోధించినా ఏమైనా అన్నా సరే పర్వాలేదు గానీ అలాంటి మాటలు కరెక్ట్ కాదు.. పైగా పబ్లిక్ ఫంక్షన్ లో.. నేను ఆయన్ని 'అన్నా'.. అని ఎంతో గౌరవిస్తాను.. ఎప్పటికీ అంతే గౌరవం ఉంటుంది కానీ నిన్నటి మాటతో బాగా హర్ట్ అయ్యాను.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను.. ఆయన కుమార్తె ఇటీవల మరణించిన నేపథ్యంలో బాగా డిస్టర్బ్ గా ఉంటున్నట్టున్నారు. అందుకే అలా మాట్లాడుతున్నారని అనుకోవాలి'' అని అలీ అన్నారు.

ఫొటో సోర్స్, facebook/rojaselvamani
రోజా, ఆమని, రవళిపై అసభ్యకర వ్యాఖ్యలు
ఇదే వేదికపై నటి, ఏపీ మాజీ మంత్రి రోజా గురించి అనుచితంగా మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్.
''….. హీరోయిన్‌ను చేసింది కూడా నేనే'' అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరో నటి ఆమని గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు.
అలాగే నటి రవళి శరీరాకృతిపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే ''సరదాగా అన్నాను..'' అంటూ చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్.
మహిళల గురించి చులకనగా మాట్లాడినందుకు రాజేంద్ర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి అన్నారు.
''రాజేంద్రప్రసాద్ చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. మహిళల గురించి గతంలోనూ తప్పుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఆయన మహిళకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మహిళా సంఘాల తరఫున కేసు వేస్తాం. ''అని చెప్పారు.
తన వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.
''రోజాను కాలేజీ నుంచి తీసుకువచ్చి ప్రేమతపస్సు అనే సినిమా ద్వారా హీరోయిన్‌ను చేసింది నేను. రవళి నా కుటుంబసభ్యురాలు . సోషల్ మీడియాలో నెగిటివ్ రాస్తే తప్ప చూడటం లేదని కొందరు చెబుతున్నారు. నేను మాట్లాడిన అన్నింటిని వదిలేసి, ఇలాంటి వ్యాఖ్యలను చూపిస్తున్నారు.'' అని ఆయన అన్నారు.
ఎంత సన్నిహితులైనా సరే, బహిరంగ వేదికపై ఈ విధంగా మాట్లాడకూదు కదా.. అనే విషయంపై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, ''వాళ్లు నా కుటుంబసభ్యుల్లాంటివారు. అవి గౌరవంలోంచి వచ్చే ఇష్టంతో కూడిన పనులు, అర్థం చేసుకునే వారి సంస్కారం బట్టి ఉంటుంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, face book/S V Krishna Reddy
''చప్పట్లు కొట్టరా'' అంటూ సభికులపైనా..
అలాగే తన ప్రసంగంలో తోటి నటుల గురించే కాకుండా సభికులపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్,.
ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాను.. అని చెబుతూ, ''……..చప్పట్లు కొట్టరా..?'' అని సభికులపై నోరు పారేసుకున్నారు.
''నేను విజయవాడ వెళ్లి అవార్డు తీసుకుని టెన్షన్ పడుతూ నేరుగా ఫంక్షన్ కు వెళ్లాను.
తర్వాత కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నా కుటుంబ సభ్యుల వంటివారు. వాళ్లకు బొట్టు పెట్టి ఇండస్ట్రీకి తీసుకువచ్చింది నేనే.'' అన్నారు రాజేంద్రప్రసాద్.

ఫొటో సోర్స్, ugc
గతంలోనూ ఇదే తరహాలో బూతు ప్రసంగం
రాజేంద్ర ప్రసాద్ ఈ తరహాలో బూతులు మాట్లాడటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.
గతంలోనూ 'రాబిన్ హుడ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి బూతులు అన్నారు.
రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ కూడా నటించారు. రాయడానికి వీల్లేని భాషలో వార్నర్‌పై నోరు పారేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్.
తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో తర్వాత క్షమాపణలు చెప్పారు.
అలాగే జనవరిలో జరిగిన షష్టిపూర్తి 'గ్లింప్స్ లాంచ్' సందర్భంగానూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
''అవన్నీ సరదాగా అనుకున్న మాటలే. ఆ మాటలనే పట్టుకుని కొందరు ట్రోల్ చేస్తున్నారు.'' అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














