ఆర్సీబీ ‘విక్టరీ సెలబ్రేషన్స్’ సందర్భంగా తొక్కిసలాటలో 11 మంది మృతి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న 'రాయల్ చాలెంజర్స్ బెంగళూరు'(ఆర్‌సీబీ) జట్టు 'విక్టరీ సెలబ్రేషన్స్' సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 33 మంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆయన పరిహారం ప్రకటించారు.
క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచితంగా చికిత్స చేయిస్తుందని చెప్పారు.
ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న తరువాత ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియం వద్దకు రావడంతో స్టేడియం గేట్ల వద్ద భారీగా ప్రజలు గుమిగూడారు.
18 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెలుపొందిన ఆర్సీబీ జట్టును చూడటానికి, అభినందించడానికి రోడ్ల పొడవునా వేలాది మంది క్యూ కట్టారు.
వీరిలో యువతతో పాటు మధ్య వయసు మహిళలు, పురుషులు, వృద్దులు కూడా ఉన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
''చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో 10 మంది చనిపోయారు'' అని బీబీసీతో ఒక సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
ఈ ఘటన జరిగినప్పుడు కనీసం స్టేడియం గేట్లు తెరుచుకోలేదని, కానీ ఒక చిన్న గేట్ నుంచి వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించిన సమయంలో తొక్కిసలాట జరిగిందని ఆయన వెల్లడించారు.
''సాధారణంగా ఒక లక్ష మంది ప్రజలు స్టేడియం వద్దకు వస్తారని అంచనా వేశారు. కానీ, దాదాపు రెండు లక్షల మంది వచ్చారు. వీరిలో చాలామంది స్టేడియం చుట్టూ ఉన్నారు'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో పోలీస్ అధికారి తెలిపారు.
ఆర్సీబీ జట్టు ఒక ప్రత్యేక విమానంలో పాత హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ జట్టుకు స్వాగతం పలికారు. తర్వాత వారిని ఊరేగింపుగా హోటల్‌కు తీసుకెళ్లారు.
తర్వాత ఆర్సీబీ జట్టు సభ్యులను విధానసౌధ వద్ద గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర మంత్రులు సన్మానించారు.

ఫొటో సోర్స్, Getty Images
విక్టరీ పరేడ్ క్యాన్సిల్
షెడ్యూల్ ప్రకారం, ఆర్సీబీ జట్టు బస్సులో ఊరేగింపుగా స్టేడియం వద్దకు వెళ్లాల్సి ఉంది. కానీ, వర్షం పడటం అదే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో జట్టును తిరిగి హోటల్‌కు పంపించారు.
18 నంబర్‌తో ఉండే విరాట్ జెర్సీని ధరించి నగరంలోని నలు మూలల నుంచి రకరకాల వాహనాల్లో ప్రజలంతా స్టేడియం వైపు కదిలారు.
మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఇంత రద్దీలోనూ మెట్రోలోని ప్రయాణికులు, బయట ఉన్నవారంతా ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు.
స్టేడియం వద్దకు కస్టమర్లను తీసుకెళ్లడానికి ఆటోరిక్షాలు, టాక్సీ డ్రైవర్లు ముందుకు రాలేదు.
ఎక్కువ చార్జీలు (బ్లాక్ మార్కెట్ రేట్స్) ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారిని స్టేడియానికి మూడు కిలోమీటర్ల దూరంలో దిగబెట్టి వెళ్లారు.
స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి చనిపోయారనే వార్తలు వ్యాప్తి చెందడటంతో ప్రజలంతా తిరిగి మెట్రో స్టేషన్ వైపు వెళ్లడం మొదలుపెట్టారు.
ప్లాట్‌ఫాంలపై ప్రయాణికులు కిక్కిరిసిపోవడంతో స్టేడియం సమీపంలోని మెట్రో స్టేషన్లను అధికారులు మూసేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మృతుల సంఖ్య చెప్పలేమన్న డీకే శివ కుమార్
మరోవైపు మృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియాతో చెప్పారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఆ జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ వేడుక చూడ్డానికి భారీగా చేరుకున్న అభిమానులు స్టేడియం గేట్లు, చుట్టుపక్కల ఉన్న గోడలు, భవనాలు, చెట్లు ఎక్కారు.
పెద్దసంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా గేట్లలోంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగినట్లు అక్కడున్న పోలీసులు చెప్తున్నారు.
జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు బలప్రయోగం చేసినట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ 'ఎక్స్'లో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది.
శివకుమార్‌తో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
కాగా అభిమానులు భారీగా చేరడం, తొక్కిసలాట పరిస్థితుల కారణంగా విక్టరీ పరేడ్ క్యాన్సిల్ చేశారు.
ఈ మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














