ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? అనుమానం ఆ స్వీట్‌పైనే

ఎర్రగడ్డ ఆసుపత్రి
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో 90 మందికి పైగా రోగులు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఒకరు మరణించారు. ఆహార కల్తీ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆసుపత్రి వర్గాలు అనుమానిస్తున్నాయి.

కలుషిత పదార్థాలు తీసుకున్న రోగుల్లో చాలా మందికి నీళ్ల విరేచనాలు, లో బీపీ వచ్చినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిత మీడియాకు చెప్పారు.

లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మిగిలిన వారికి అదే ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

వారికి వైద్యం చేయడం కోసం బయటి నుంచి ప్రభుత్వ వైద్యులను పిలిపించారు. ప్రస్తుతం రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా స్థిమితంగానే ఉన్నారనీ, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎర్రగడ్డ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిత
ఫొటో క్యాప్షన్, ఎర్రగడ్డ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిత

ఆసుపత్రి సూపరింటెండ్ ఏం చెప్పారు?

ఈ ఘటన రెండు రోజుల కిందట జరిగినట్టు తెలుస్తోంది. స్పష్టమైన తేదీ, సమయం ఇంకా ప్రకటించలేదు.

'ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాం' అని ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిత మీడియాతో అన్నారు.

రోగులకు ఇచ్చిన డైట్‌ కలుషితం అయినట్లు తాము అనుమానిస్తున్నామని ఆమె చెప్పారు.

ఆ ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను విధుల నుంచి తప్పించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. ఆయన బుధవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు.

స్వీట్ వల్లే ఇదంతా జరిగిందా?

''రోగులకు డైట్‌లో భాగంగా ఒక స్వీట్ వడ్డించారు. అది కలుషితం అయిందేమోనని అనుమానం ఉంది. నీటి శాంపిళ్ళు, మలం శాంపిళ్ళు పరీక్షకు పంపించాం.

ఫలితాలు వస్తేనే కారణం తెలుస్తుంది. ఎవరూ పట్టించుకోక రోడ్డుపై తిరుగుతుంటే కరణ్ అనే రోగిని ఇక్కడ చేర్చారు. అతనికి ఇంటలెక్చువల్ డిజెబులిటీ ఉంది.

చికిత్స అందిస్తున్నాం. బలహీనంగా ఉండేవాడు. ఘటనకు ముందు రోజు రాత్రి రౌండ్స్ సమయంలో అతను బాగానే ఉన్నాడు.

కానీ, మరునాడు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అతను మరణించాడు. అతని మరణానికి కారణాలు కూడా పోస్టుమార్టం తర్వాతే తెలుస్తాయి'' అని మీడియాతో చెప్పారు సూపరింటెండెంట్ అనిత.

ఆసుపత్రి రీహ్యాబ్ సెంటర్

ఫిర్యాదు చేసే స్థితిలో వారు ఉన్నారా?

''మా అబ్బాయి చికిత్స కోసం నాలుగు నెలలుగా ఇక్కడ ఉంటున్నాడు. ఫుడ్ పాయిజన్ వార్తలు విని ఇక్కడకు వచ్చాను. మా బాబును ఇంకా చూపించలేదు కానీ బాగానే ఉన్నాడని చెప్పారు. మా అబ్బాయికి చికిత్స కూడా పూర్తయింది కాబట్టి అతన్ని తీసుకెళ్తాను అంటే, ఆసుపత్రి వారు అంగీకరించారు. తీసుకువెళ్లమని చెప్పారు'' అని బీబీసీతో చెప్పారు ఒక రోగి తండ్రి సురేశ్.

మొత్తం ఆసుపత్రిలో ఉన్న రోగుల్లో ఎంత మందికి ఫుడ్ పాయిజన్ అయింది, ఎంత మందికి ఇబ్బంది కలగలేదు అనే స్పష్టత ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం ఆసుపత్రికి స్థానిక నాయకులు వచ్చి పరామర్శలు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ కూడా ఆసుపత్రికి వచ్చి పరిస్థితి సమీక్షించారు.

అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది? ఎవరు బాధ్యులు? కరణ్ అనే వ్యక్తి మరణానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు విచారణలో తేలాల్సి ఉంది. దాంతో పాటుగా, తమ ఆహారం బాగాలేకపోయినా దానిపై సరిగా ఫిర్యాదు చేయలేని స్థితిలో మానసిక చికిత్స తీసుకునే వారిలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. అటువంటి వారికి మరింత జాగ్రత్తగా ఆహారాన్ని సరఫరా చేయక నిర్లక్ష్యం వహించడంపై రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేయడం అక్కడ కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)