1921 నాటి టొల్సా నరమేధానికి నష్టపరిహారంగా సుమారు రూ. 900 కోట్లు

 డ్రీమ్‌ల్యాండ్ థియేటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1921లో టొల్సా నరమేధంలో ధ్వంసమైన విలియమ్స్ డ్రీమ్‌ల్యాండ్ థియేటర్
    • రచయిత, బ్రాండన్ డ్రెనాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఓక్లహామా రాష్ట్రంలోని టొల్సా నగరంలోని ‘నల్లజాతి’ సమాజానికి 105 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 900 కోట్ల) నష్టపరిహారం ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

1921లో టొల్సాలోని నల్లజాతి ప్రజలు లక్ష్యంగా జరిగిన నరమేధంలో నష్టపోయిన వారికి పరిహారం ప్యాకేజీగా ఈ మొత్తం అందించనున్నారు.

టొల్సా నరమేధాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత హింసాత్మక జాతి విద్వేష దాడులలో ఒకటిగా చెప్తారు.

టొల్సా తొలినల్లజాతి మేయర్ మన్రో నికోల్స్ రూపొందించిన ఈ ప్రణాళిక కమ్యూనిటీ పునరాభివృద్ధిపై దృష్టి పెడుతుంది.

ఆనాటి నరమేధం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో ఇప్పటికీ ఉన్న ఇద్దరు లెస్సీ బెన్నింగ్‌ఫీల్డ్ రాండిల్, వియోలా ఫోర్డ్ ఫ్లెచర్‌కి కానీ, ఆ దాడిలో చనిపోయినవారి వారసులకు కానీ ఈ పరిహారం ప్యాకేజీ నుంచి చెల్లింపులేమీ ఉండవు.

టొల్సా మారణహోమం తరువాత అధికారికంగా నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమం సందర్భంగా ఆదివారం నికోల్స్ ఈ ప్రకటన చేశారు.

గృహ నిర్మాణ నిధి కోసం 24 మిలియన్ డాలర్లు( సుమారు రూ. 205 కోట్లు), సాంస్కృతిక పరిరక్షణ కోసం 60 మిలియన్ డాలర్లు (సుమారు 513 కోట్లు) ఒక ప్రైవేట్ ట్రస్ట్ సేకరించిన ఈ నిధులలో ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"టొల్సాలో జరిగిన జాతి హననం మన నగర చరిత్రపై మాయని మచ్చగా మారింది. చరిత్ర పుస్తకాలలో దీని గురించి రాయకుండా దాచిపెట్టారు" అని నికోల్స్ అన్నారు.

ఆ దాడి తర్వాత ఆర్థిక నష్టాలు మరింత తీవ్రమయ్యాయని... టొల్సా ఆర్థికంగా ఎదగకుండా అనేక ప్రయత్నాలు చేశారని, ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతంలో పెట్టుబడులు తగ్గించారని, నల్లజాతీయులకు గృహ, ఆస్తి రుణాలు ఇవ్వడానికి కూడా నిరాకరించారని నికోల్స్ అన్నారు.

"ఇప్పుడు పునరుద్ధరణకు ముందడుగు వేయాల్సిన టైం వచ్చింది" అని అన్నారు.

‘రోడ్ టు రిపేర్’గా పిలుస్తున్న ప్రస్తుత ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నష్టపరిహార ప్యాకేజీ నిధుల నిర్వహణను గ్రీన్‌వుడ్ ట్రస్ట్ చూసుకుంటుంది.

నష్ట పరిహార నిధులను ఆస్తుల రూపంలో సమీకరించాలనుకుంటున్నారు. అందులో కొంత ట్రస్ట్ లెగసీ ఫండ్‌కి వెళ్తుంది. ఆ మొత్తంలో భూమి కొని డెవలప్ చేస్తారు.

ఈ ప్రతిపాదనలకు నగర కౌన్సిల్ ఆమోదం అవసరం లేదని నికోల్స్ అన్నారు.

గ్రీన్‌వుడ్ ట్రస్ట్ తన పేరును టొల్సాలోని గ్రీన్‌వుడ్ జిల్లా నుంచి తీసుకుంది. ఇది ఒకప్పుడు నల్లజాతి ప్రజలుండే సుసంపన్న ప్రాంతం. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని ‘బ్లాక్ వాల్ స్ట్రీట్’ అని పిలుస్తారు.

1921 మే నెలలో తెల్లజాతి వారు టొల్సా నగరాన్ని తగలబెట్టి 24 గంటల్లో 1,000 కి పైగా ఇళ్లను ధ్వంసం చేయడంతో అంతా తారుమారైంది. ఆ దాడిలో సుమారు 300 మంది నల్లజాతీయులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు.

‘ప్రపంచంతో పోటీపడేలా ఉండాల్సిన టొల్సా ఆర్థిక భవిష్యత్తును ఈ సంఘటన నాశనం చేసింది’ అని నికోల్స్ అన్నారు.

ఈ ఊచకోత విషయం దశాబ్దాలుగా చరిత్రలో లేకుండా మరుగునపడేలా చేశారు.

కానీ 2020లో అప్పటి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆ ఏడాది జూన్ 19న ‘బానిసత్వం ముగింపు దినోత్సవం’ సందర్భంగా టొల్సాలో ఎన్నికల ర్యాలీని నిర్వహిస్తానని ప్రకటించినప్పుడు ఈ ప్రాంతంలో జరిగిన నరమేధం మళ్లీ చర్చ జరిగింది. ఆయన ర్యాలీని రీషెడ్యూల్ చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ జూన్ 19ను జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.

ట్రంప్ ఇప్పుడు తిరిగి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టాక ప్రభుత్వంలో డైవర్షన్, ఈక్విటీ, ఇంక్లూజన్(డీఈఐ) ప్రాధాన్యం తగ్గించారు. అనేక పెద్ద కంపెనీలు కూడా ఇలాగే చేస్తున్నాయి. దీంతో టొల్సాకు నష్టపరిహారం అందే అవకాశం ఉంది.

షికాగో సమీపంలో ఉన్న ఇల్లినాయిస్‌‌లోని ఇవాన్‌స్టన్ నల్లజాతి ప్రజలకు నష్టపరిహారం అందుబాటులోకి తెచ్చిన తొలి అమెరికా నగరం. అక్కడ 2021లో ఇలాంటి ప్యాకేజీ అమలు చేశారు.

అక్కడ ఇళ్ల మరమ్మతులు, డౌన్ పేమెంట్లు వంటి ఖర్చుల కోసం అర్హులైనవారికి పరిహారం డబ్బు అందజేశారు.

అయితే, బానిసత్వం వంటి ఒకప్పటి జాత్యహంకార చర్యలకు నష్టపరిహారం చెల్లించడంపై కొందరు అమెరికన్లు చాలాకాలంగా విభేదిస్తున్నారు.

మేరీలాండ్ రాష్ట్రంలో ఇలాంటి నష్టపరిహారాలపై అధ్యయనానికి కమిషన్ వేయాలనుకున్నప్పుడు దాన్ని తాను వీటో చేస్తోానని మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ మే నెలలో చెప్పారు. మూర్ మేరీలాండ్‌కు తొలి నల్లజాతి గవర్నర్.

మరోవైపు కాలిఫోర్నియా రాష్ట్రం గతంలో నల్లజాతి అమెరికన్లపై చూపిన వివక్షకు క్షమాపణలు చెప్తూ గత ఏడాది ప్రకటన చేసింది.

కొన్ని పరిహార కార్యక్రమాలను ఆమోదించింది, కానీ ప్రత్యక్ష ఆర్థిక చెల్లింపులను అందించలేదు.

టొల్సాలో జరిగిన నల్లజాతి ఊచకోతలో ప్రాణాలతో బయటపడిన చివరి ఇద్దరు వ్యక్తులు, లెస్సీ బెన్నింగ్‌ఫీల్డ్ రాండిల్, వియోలా ఫోర్డ్ ఫ్లెచర్.. నష్టపరిహారం కోసం కోర్టులో సుదీర్ఘకాలాం పోరాడారు. గత వేసవిలో వారు ఆ కేసు ఓడిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)