బయ్యా సన్నీ యాదవ్: ఈ తెలుగు యూట్యూబర్ పాకిస్తాన్ వెళ్లి, జకీర్ నాయక్ ను కలిశాడా, ఏమిటి వివాదం?

సన్నీ యాదవ్, యూట్యూబర్, పాకిస్తాన్, ఎన్ఐఏ, ఆపరేషన్ సిందూర్

ఫొటో సోర్స్, YT/bayyasunnyyadav

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల బైక్‌పై పాకిస్తాన్ వెళ్లినట్లు చెప్తున్న తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ బయ్యా సన్నీయాదవ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.

బయ్యా సందీప్ యాదవ్ అలియాస్ సన్నీయాదవ్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన కుటుంబీకులు చెప్తున్నారు.

‘మా అబ్బాయిని చెన్నైలో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది’ అని సన్నీ యాదవ్ తండ్రి బయ్యా రవీందర్ యాదవ్ మీడియాకు చెప్పారు.

మే 29న సన్నీ యాదవ్ తన స్నేహితుడు, చైన్నెకు చెందిన మరో యూట్యూబర్ చెర్రీ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు రవీందర్ యాదవ్.

సన్నీ యాదవ్‌ను ఎన్ఐఏ అధికారులు, చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

దీనిపై ఎన్ఐఏ అధికారులు, చెన్నై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

''సన్నీయాదవ్‌ను సివిల్ డ్రెస్‌లో వచ్చిన కొందరు పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చారనే కారణంతో అతడిని తీసుకెళ్లారు'' అని సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీ చెప్పారు.

ఈ మేరకు ''వేర్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్?' థంబ్‌‌నెయిల్‌తో సన్నీయాదవ్ యూట్యూబ్ చానల్‌లో మే 30న వీడియో పోస్టు చేశారు. తర్వాత ఆ వీడియోను డిలీట్ చేశారు.

దీనిపై సన్నీయాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన ఫోన్‌లో అందుబాటులో దొరకలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సన్నీ యాదవ్, యూట్యూబర్, పాకిస్తాన్, ఎన్ఐఏ, ఆపరేషన్ సిందూర్

ఫొటో సోర్స్, YT/bayyasunnyyadav

ఫొటో క్యాప్షన్, తన తొలి పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన వీడియోను సన్నీ యాదవ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ తర్వాత హరియాణా, పంజాబ్‌కు చెందిన కొంతమంది ట్రావెల్ వ్లాగర్లను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరిపారని, దేశానికి సంబంధించిన కీలక సమాచారం చేరవేశారనే ఆరోపణలపై యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్‌ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఆమెతోపాటు పాకిస్తాన్ సందర్శించిన మరికొంత మంది యూట్యూబర్లను దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల పాకిస్తాన్‌కు బైకుపై వెళ్లి వచ్చానంటూ ఆ వీడియోలను బయ్యా సన్నీ యాదవ్ తన యూట్యూబ్ చానల్ సహా సోషల్ మీడియా అకౌంట్లలో అప్‌లోడ్ చేస్తున్నారు.

సన్నీ యాదవ్ చుట్టూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తండ్రి రవీందర్ బీబీసీతో చెప్పారు.

''మా అబ్బాయి ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్లి వచ్చిన మాట నిజమే. ఇప్పటివరకు 40 దేశాలు వెళ్లి వచ్చాడు. అలాగే పాకిస్తాన్ కూడా. ఉగ్రవాదులతో సంబంధాలు అంటూ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి'' అన్నారు రవీందర్ యాదవ్.

సన్నీ యాదవ్, యూట్యూబర్, పాకిస్తాన్, ఎన్ఐఏ, ఆపరేషన్ సిందూర్

ఫొటో సోర్స్, YT/bayyasunnyyadav

ఫొటో క్యాప్షన్, 2025 ఫిబ్రవరిలో సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్లి వచ్చినట్లు ఆయన తండ్రి రవీందర్ యాదవ్ చెప్పారు

అసలు పాకిస్తాన్ ఎప్పుడు వెళ్లారు?

సన్నీయాదవ్ బైకుపై వివిధ దేశాలకు వెళ్లి వచ్చి, ఆ వీడియోలు తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు.

ఆయనది సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం శిల్పకుంట్ల గ్రామం. యూట్యూబ్‌లో ఆయనకు 47.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు 1476 వీడియోలు పోస్టు చేశారు.

పాకిస్తాన్ వెళ్లి వచ్చినట్లుగా ఉన్న వీడియోలను గత మూడు వారాలుగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేస్తున్నారు.

సన్నీయాదవ్ ఎప్పుడు పాకిస్తాన్ వెళ్లారనే స్పష్టమైన తేదీని తన వీడియోల్లో చెప్పలేదు కానీ ఒక వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం 2024 అక్టోబర్, 2025 ఫిబ్రవరిలో వెళ్లినట్లుగా తెలుస్తోంది.

''గత మూడున్నరేళ్లుగా పేపర్ వర్క్స్ చేస్తున్నాం. ఆగస్టులో వీసా రావడంతో మొదట నేను 2024 అక్టోబరులో పాకిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించా. కస్టమ్స్ అధికారుల నుంచి అనుమతులు లేవని చెప్పడంతో వెనక్కి వచ్చేశాను'' అని తన వీడియోల్లో చెప్పారు సన్నీ యాదవ్.

దిల్లీ నుంచి బంగ్లాదేశ్‌కు చెందిన మరో ట్రావెల్ వ్లాగర్ ముస్తాక్ చౌదరితో కలిసి నిరుడు అక్టోబరులో పాకిస్తాన్ బయల్దేరి వెళ్లినట్లుగా చెప్పారు.

వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్‌లోకి వెళ్లి, అక్కడి కస్టమ్స్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తిరిగి వచ్చినట్లుగా తన వీడియోలో చెప్పారు సన్నీయాదవ్.

సన్నీ యాదవ్, యూట్యూబర్, పాకిస్తాన్, ఎన్ఐఏ, ఆపరేషన్ సిందూర్

ఫొటో సోర్స్, YT/bayyasunnyyadav

ఫొటో క్యాప్షన్, తొలిసారి పాకిస్తాన్ వెళ్లినప్పుడు కర్తార్‌పూర్ సందర్శించినట్లు సన్నీ యాదవ్ ఓ వీడియోలో చెప్పారు.

జకీర్ నాయక్‌ను ప్రశ్న అడుగుతున్న వీడియో వైరల్

అయితే, వివాదాస్పద మత ప్రబోధకుడు, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపకుడు జకీర్ నాయక్‌ను సన్నీయాదవ్ పాకిస్తాన్‌లో కలిసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.

జకీర్ నాయక్‌పై మనీ లాండరింగ్ సహా వివిధ కేసులు నమోదవడంతో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్, పీస్ టీవీని గతంలో భారత్ నిషేధించింది.

అయితే, జకీర్ నాయక్ నిర్వహించిన ఓ సభలో సన్నీయాదవ్ ఆయన్ను కలిసినట్లుగా ఉన్న వీడియోను 2024 అక్టోబరు 14న కొన్ని యూట్యూబ్ చానళ్లు అప్‌లోడ్ చేశాయి.

అందులో జకీర్ నాయక్‌ను సన్నీ యాదవ్ ప్రశ్న అడుగుతున్నట్లుగా ఉంది.

''నా పేరు సందీప్ యాదవ్. నేను ఇండియాలోని హైదరాబాద్‌కు చెందిన వాడిని. నేను ప్రొఫెషనల్ యూట్యూబర్, మోటార్ సైక్లిస్టును. హిందూ మతం ఈ ప్రపంచానికి ఫిట్‌నెస్ కోసం యోగా, వ్యాధులు నయం చేయడానికి ఆయుర్వేదం, విజ్జానం కోసం వేదాలను ఇచ్చింది. మరి, ఇస్లాం లేదా ఖురాన్ ఈ ప్రపంచానికి ఏం ఇచ్చింది'' అని ప్రశ్న అడిగారు.

నిరుడు అక్టోబరులో పాకిస్తాన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు జకీర్ నాయక్, ఆయన కుమారుడు ఫరీఖ్ నాయక్ అక్కడ పర్యటించి మత బోధన సభలు నిర్వహించారు.

అయితే, సన్నీ యాదవ్ తాను పాకిస్తాన్ వెళ్లలేదని తన వీడియోలో చెప్పగా, ఇప్పుడు జకీర్ నాయక్‌ను కలిసిన వీడియో బయటకు రావడం వివాదాస్పదంగా మారింది.

''నా కుమారుడు అక్టోబరులో జకీర్ నాయక్‌ను కలిసిన విషయం కూడా తెలియదు. అసలు ఆ సమయంలో పాకిస్తాన్ వెళ్లినట్లుగా నాకు సమాచారం కూడా లేదు'' అని రవీందర్ బీబీసీతో చెప్పారు.

సన్నీ యాదవ్, యూట్యూబర్, పాకిస్తాన్, ఎన్ఐఏ, ఆపరేషన్ సిందూర్

ఫొటో సోర్స్, facebook.com/bayyasunnyyadav

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో సన్నీయాదవ్

మే 9 నుంచి వీడియోలు అప్‌లోడ్

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మే 7న భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత యుద్ధం అంచుల వరకు పరిస్థితి చేరుకుంది.

ఈ క్రమంలో భారత్ నుంచి పాకిస్తా‌న్‌లోకి, పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి రాకపోకలపై నిషేధం విధించారు. సరిహద్దులు కూడా మూసివేశారు.

పాకిస్తాన్ ట్రావెల్ సిరీస్ వీడియోలలో భాగంగా హైదరాబాద్‌లో యాత్ర ప్రారంభానికి సంబంధించిన మొదటి వీడియోను మే 9న అప్‌లోడ్ చేసినట్లు బయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ చానల్‌లో ఉంది.

అక్కడి నుంచి ముందుగా బైకుపై వెళ్తున్న వీడియోలు పెట్టారు.

పాకిస్తాన్‌లో ప్రవేశించిన తర్వాత చేసిన మొదటి వీడియోను మే 28న అప్‌లోడ్ చేశారు సన్నీ యాదవ్.

తర్వాత నుంచి వీడియోలు అప్‌లోడ్ చేయడం నిలిచిపోయింది.

''కొద్ది రోజుల కిందట సెంట్రల్ నుంచి అని చెప్పి కొంతమంది అధికారులు వచ్చారు. సన్నీ యాదవ్‌కు సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకున్నారు'' అని చెప్పారు రవీందర్ యాదవ్.

గతంలోనూ పాకిస్తాన్ సందర్శన

గతంలోనూ పాకిస్తాన్ వెళ్లినట్లుగా తన మొదటి వీడియోలో చెప్పారు సన్నీ యాదవ్. అప్పట్లో కర్తార్‌పూర్‌ను సందర్శించినట్లుగా చెప్పారాయన.

''ప్రస్తుతం పాకిస్తాన్‌కు హైదరాబాద్ నుంచి బైకుపై వెళ్తున్నా. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీతోపాటు మరో సిటీకి వెళ్తున్నా'' అని ఆ వీడియోలో చెప్పారు సన్నీ యాదవ్.

సన్నీ యాదవ్, యూట్యూబర్, పాకిస్తాన్, ఎన్ఐఏ, ఆపరేషన్ సిందూర్

ఫొటో సోర్స్, facebook.com/bayyasunnyyadav

ఫొటో క్యాప్షన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణల విషయంలో సన్నీయాదవ్‌పై మార్చిలో నూతన్‌కల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై కేసు

బయ్యా సన్నీ యాదవ్ 2012లో యూట్యూబ్ చానల్ ప్రారంభించి ట్రావెల్ వీడియోలు పోస్టు చేస్తూ వచ్చారు.

మొదట్లో తక్కువ దూరాలకు వెళ్లి వచ్చానని తన వీడియోల్లో చెప్పుకొచ్చారు.

2019లో 21 రోజుల్లో లద్దాఖ్ యాత్రతో తన సబ్‌స్క్రైబర్లను బాగా పెంచుకున్నారు సన్నీ యాదవ్. తర్వాత నేపాల్ యాత్ర చేశారు.

వంద దేశాలు బైక్‌పై తిరగాలనేది తన లక్ష్యమని వీడియోల్లో సన్నీయాదవ్ చెబుతుంటారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలపై సన్నీ యాదవ్‌పై మార్చిలో నూతన్‌కల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ కేసులో సన్నీయాదవ్ బెయిల్‌పై ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)