శాంతి చర్చలకుముందు రష్యాపై డ్రోన్లతో యుక్రెయిన్ భారీ దాడి

రష్యా యుద్ధ విమానాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు

ఫొటో సోర్స్, SBU source

    • రచయిత, పాల్ ఆడమ్స్, జరోస్లావ్ లుకివ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

రష్యాలోని నాలుగు మిలటరీ స్థావరాలపై యుక్రెయిన్ డ్రోన్లతో వరుసగా భారీ దాడులు చేసింది.

రష్యాతో యుద్ధం మొదలైన తరువాత ఇదే అతిపెద్ద దీర్ఘశ్రేణి దాడి అని యుక్రెయిన్ పేర్కొంది.

మొత్తం 40 రష్యా యుద్ధ విమానాలపై దాడులు చేశామని తెలిపింది.

రష్యాలోకి రహస్యంగా తరలించిన డ్రోన్ల ద్వారా యుక్రెయిన్ ఈ దాడులు చేసింది.

రష్యా వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహకనౌకల్లో 34 శాతంపై దాడి చేసిన ఎస్‌బీయూ భద్రతా విభాగం, 'స్పైడర్స్ వెబ్' ఆపరేషన్‌లో 117 డ్రోన్లను ఉపయోగించిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ‌ తెలిపారు.

ఈ దాడులను నిర్వహించడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని అంతకుముందు ఎస్‌బీయూ వర్గాలు బీబీసీకి చెప్పాయి.

చెక్క మొబైల్ క్యాబిన్లలో దాచిన డ్రోన్లు, రిమోట్‌తో పనిచేసే పైకప్పులున్న ట్రక్కులను వైమానిక స్థావరాలకు సమీపంలోకి తీసుకు వచ్చి సరైన సమయంలో కాల్పులు జరిపినట్లు ఎస్‌బీయూ వర్గాలు బీబీసీకి తెలిపాయి.

ఐదు ప్రాంతాల్లో యుక్రెయిన్ దాడులను ''ఉగ్రవాద చర్య''గా రష్యా ధృవీకరించింది.

మరోవైపు, తమ భూభాగంపై రాత్రికి రాత్రే భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయని యుక్రెయిన్ అధికారులు కూడా తెలిపారు.

తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో రష్యా, యుక్రెయిన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమవుతున్న వేళ ఈ దాడులు జరిగాయి.

ఇరు పక్షాలు ఈ స్థితిలో ఉంటే యుద్దం ఎలా ముగుస్తుందనే విషయం ఎప్పటికి తేలుతుందో చెప్పడం కష్టమే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రకు దిగారు. 2014లో విలీనం చేసుకున్న దక్షిణ క్రిమియా ద్వీపకల్పం సహా ప్రస్తుతం మాస్కో సుమారు 20 శాతం యుక్రెయిన్ భూభాగాన్ని నియంత్రిస్తోంది.

యుక్రెయిన్ సాహసోపేతమైన డ్రోన్ దాడి రష్యాకు పాశ్చాత్య దేశాలకు కీలక సందేశాన్ని పంపుతుంది.

ఈ ఆపరేషన్ ''నిజంగా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది'' అని ఎస్‌బీయూ అధిపతి వాసిల్ మాలిక్‌ను జెలియెన్‌స్కీ‌ అభినందిస్తూ ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో పలు పోస్టులు చేశారు.

యుక్రెయిన్ ప్రయోగించిన 117 డ్రోన్లలో ప్రతిదానికి సొంత పైలట్ ఉన్నారన్నారు.

''మేం బహిరంగంగా చెప్పగలిగే ఆసక్తికర విషయం ఏమిటంటే... మా ఆపరేషన్ కార్యాలయం ఒకటి రష్యా భూభాగంలోని ఎఫ్ఎస్‌బీ కార్యాలయాలలో ఒకదాని పక్కనే ఉంది'' అని జెలియెన్‌స్కీ చెప్పారు.

ఎఫ్ఎస్‌బీ రష్యా శక్తిమంతమైన ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ.

రష్యా వ్యూహాత్మక విమానయానానికి జరిగిన నష్టం సుమారు 7 బిలియన్ డాలర్లు ఉంటుందని ఎస్‌బీయూ అంచనా వేసింది.

మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

యుక్రెయన్ వాదనలు స్వతంత్రంగా ధృవీకృతం కాలేదు.

యుక్రెయిన్‌కు వేల మైళ్ల దూరంలో ఉన్న నాలుగు రష్యన్ వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని ఎస్‌బీయూ వర్గాలు ఆదివారం బీబీసీకి పంపిన ఒక ప్రకటనలో తెలిపాయి.

వాటిల్లో రెండు యుక్రెయిన్‌కు వేల కి.మీల దూరంలో ఉన్నాయి.

యుక్రెయిన్ దాడిలో దెబ్బతిన్న రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌లలో.. టీయూ-95, టీయూ-22ఎం3 అనే వ్యూహాత్మక అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాంబర్లు, ఏ-50 ముందస్తు హెచ్చరిక యుద్ధ విమానాలు ఉన్నాయని ఎస్‌బీయూ వర్గాలు తెలిపాయి.

ఈ మొత్తం ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనదని అభివర్ణించాయి.

''ఎస్‌బీయూ తొలుత ఎఫ్‌పీవీ డ్రోన్లను రష్యాలోకి రవాణా చేసింది. ఆ తర్వాత చెక్క మొబైల్ క్యాబిన్లను పంపింది. రష్యా భూభాగంలోకి చేరుకున్న తర్వాత, కార్గో వాహనాలపై ఉంచిన మొబైల్ క్యాబిన్ల పైకప్పుల కింద డ్రోన్లను దాచి పెట్టింది.'' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

''సరైన సమయంలో, పైకప్పులను రిమోట్ ద్వారా తెరిచి, డ్రోన్లను రష్యా బాంబర్ల పైకి వదిలారు.'' అని చెప్పాయి.

సైబీరియాలోని స్రెడ్నీలో బెలాయా సైనిక స్థావరంపై దాడి చేసిన డ్రోన్లు ట్రక్కు నుంచి ప్రయోగించినవేనని ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కోబ్జేవ్ ధ్రువీకరించారు.

ఇతర దాడులను కూడా లారీల ద్వారా డ్రోన్లతో చేపట్టినట్లు రష్యా మీడియా సంస్థలు తెలిపాయి.

పెట్రోల్ పంపు సమీపంలో ట్రక్కు నుంచి డ్రోన్లు బయటికి ఎగిరినట్లు ఓ పెట్రోల్ వినియోగదారుడు చెప్పారు.

ముర్మాన్‌స్క్‌‌లో డ్రోన్ దాడి జరిగినట్లు రష్యా మీడియా కూడా తెలిపింది.

కానీ, తమ రక్షణ వ్యవస్థలు పనిచేసినట్లు పేర్కొంది. ఇర్కుట్స్క్‌లో కూడా దాడి జరిగినట్లు పలు కథనాలు రిపోర్టు చేస్తున్నాయి.

యుక్రెయిన్ అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Ukraine Presidential Press Service/EPA-EFE/Shutterstock

ఐదు వైమానిక స్థావరాలపై దాడులు

దేశంలోని ఐదు ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై దాడులు జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇవానోవో, రియాజాన్, అమూర్ ప్రాంతాల్లోని సైనిక వైమానిక స్థావరాలపై జరిగిన దాడులను తిప్పికొట్టినట్లు పేర్కొంది. రెండో స్థావరాన్ని ఎస్‌బీయూ వర్గాలు ప్రస్తావించలేదు.

ముర్మాన్‌స్క్, ఇర్కుట్స్క్‌ సమీప ప్రాంతాల నుంచి డ్రోన్లను ప్రయోగించడంతో పలు విమానాల్లో మంటలు చెలరేగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మంటలన్నీ ఆర్పివేశామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.

టెర్రరిస్టు దాడులలో పాల్గొన్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పింది.

గత రాత్రి యుక్రెయిన్‌పై 472 డ్రోన్లు, ఏడు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో రష్యా దాడులు చేసిందని యుక్రెయిన్ తెలిపింది.

ఇప్పటివరకు జరిగిన రష్యన్ డ్రోన్ దాడుల్లో ఇదొక అతిపెద్ద దాడి.

385 గగనతల లక్ష్యాలను నిర్వీర్యం చేసినట్లు యుక్రెయిన్ ప్రకటించింది.

శిక్షణా కేంద్రంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది తమ సైనిక సిబ్బంది మరణించారని, 60 మందికి పైగా గాయపడ్డారని యుక్రెయిన్ పదాతిదళం తెలిపింది.

యుక్రెయిన్ పదాతిదళాధిపతి మేజర్ జనరల్ మైఖైలో ద్రప్తయ్ కొద్దిసేపటి తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.

ఈ దుర్ఘటనకు తాను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తున్నట్టు స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)