ఫాంటసీ క్రికెట్ యాప్స్: రూపాయి పెట్టుబడితో కోటీశ్వరులు కావాలనుకునే కల ఎందుకు పెరుగుతోంది? ఏమిటీ ‘మాయా ప్రపంచం’?

ఫాంటసీ గేమింగ్ యాప్స్, డ్రీమ్ 11, ఐపీఎల్ క్రికెట్
    • రచయిత, సుమేధా పాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ను మే17న తిరిగి ప్రారంభించారు. దిల్లీలోని ఓ పార్కింగ్‌ ఏరియాకు సూపర్‌వైజర్‌గా ఉన్న ధర్మేందర్ గౌతమ్‌కు ఇది ఎంతో ఆనందం కలిగించింది.

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రికెట్‌ ఫ్రాంచైజ్‌గా ఐపీఎల్ గుర్తింపు పొందింది.

అయితే గౌతమ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద ప్రేమ ఏర్పడటానికి కారణం క్రికెట్ కాదు. ఫాంటసీ క్రికెట్ యాప్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెండు నెలల పాటు ఆయనకు లభించిన అవకాశం ఇది.

"ఆటలో ఉత్కంఠతో పాటు గెలుస్తాననే ఆశ నన్ను నడిపిస్తుంది" అని గౌతమ్ చెప్పారు.

ఫాంటసీ గేమింగ్ యాప్స్‌లో ఆయా జట్లలోని తమకు నచ్చిన ఆటగాళ్లతో టీమ్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు.

ఐపీఎల్‌లో జరిగే మ్యాచ్‌లలో వారు బాగా ఆడితే అందుకు తగినట్లుగా పాయింట్లు వస్తాయి.

యాప్‌లో లీడర్ ‌బోర్డులో ఉన్న వారు నగదు బహుమతులు గెలుచుకోవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యాప్‌లో ఈ గేమ్ ఆడాలంటే ప్రవేశ రుసుము ఒక రూపాయి నుంచి మొదలవుతుంది. అయితే వారు గెలిస్తే లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితి ఉండటంతో.. గౌతమ్ లాంటి అనేక మంది భారతీయులు తమకు ఇష్టమైన క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూనే డబ్బులు సంపాదించుకునేందుకు ఫాంటసీ యాప్స్‌లో అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు.

ఫాంటసీ గేమింగ్ యాప్స్, డ్రీమ్ 11, ఐపీఎల్ క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఐపీఎల్‌ను వారం రోజులు నిలిపివేశారు.

భారత్‌లో ఫాంటసీ క్రికెట్ బూమ్

ఔత్సాహికులు ఫాంటసీ గేమింగ్ యాప్స్‌ను భారీగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

ఇది ఫాంటసీ గేమింగ్ పరిశ్రమకు ఊహించని ప్రోత్సాహాన్ని అందించింది.

ఇంటర్నెట్ విస్తృత వినియోగం క్రీడల ప్రత్యక్ష ప్రసారం, ఫాంటసీ యాప్స్‌ను సగటు భారతీయుడి మొబైల్ స్క్రీన్ మీదకు తీసుకువచ్చింది.

కేపీఎంజీ 2019 నివేదిక ప్రకారం.. భారత్‌లో 2016లో 36.8 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 2018 నాటికి 56 కోట్లకు చేరింది.

ఇదే సమయంలో ఫాంటసీ స్పోర్ట్స్ ఆపరేటర్ల సంఖ్య 10 నుంచి 70కి పెరిగినట్లు కేపీఎంజీ గుర్తించింది.

2019లో "యూనికార్న్ హోదా" దక్కించుకున్న తొలి ఫాంటసీ గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా డ్రీమ్ 11 యాప్ గుర్తింపు పొందింది. 2021లో ది మొబైల్ ప్రీమియర్ లీగ్ యాప్, 2022లో గేమ్స్ 24x7 యాప్ యూనికార్న్ క్లబ్‌లో ( ఏదైనా స్టార్టప్ బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరిస్తే దానికి యూనికార్న్ హోదా ఇస్తారు) చేరాయి.

ప్రస్తుతం భారత్‌లో ఫాంటసీ స్పోర్ట్స్ యాప్స్‌కు 22.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారని డెలాయిట్‌తో కలిసి తాను నిర్వహించిన అధ్యయంలో తేలిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ బీబీసీకి తెలిపింది.

ఈ యాప్‌ల ద్వారా వివిధ రకాల క్రీడలపై పందెం వేసే అవకాశం ఉంది. అయితే ఎఫ్ఐఎఫ్ఎస్ డేటా ప్రకారం 85 శాతం మంది క్రికెట్‌పైనే పందేలు వేస్తున్నారు.

ఫాంటసీ గేమింగ్ యాప్స్, డ్రీమ్ 11, ఐపీఎల్ క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫాంటసీ గేమింగ్ యాప్స్‌లో గెలిచే అవకాశాలు చాలా తక్కువని ధర్మేందర్ గౌతమ్ చెప్పారు.

ఈజీ మనీ: ప్రమాదమా? ఆదాయమా?

ఫాంటసీ గేమింగ్ యాప్స్‌కు ప్రజాదరణ పెరగడానికి కారణం త్వరగా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనే అని స్పష్టంగా కనిపిస్తోంది.

"గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనే ఆశను కలిగించడం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించేలా ఈ ఆటలను రూపొందించారు" అని దిల్లీకి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ సిద్ధాంత్ చెప్పారు.

"భారత్‌లో ఇది ఎక్కువగా క్రికెట్ కేంద్రంగా నడుస్తున్నప్పటికీ ఇతర క్రీడలకు విస్తరిస్తోంది. దీనికి కారణం త్వరగా వచ్చే డబ్బు" అని ఆయన అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన దయారామ్ స్థానిక కోర్టులో క్లర్క్‌గా పని చేస్తున్నారు. జర్నలిస్ట్ సిద్ధాంత్ వాదనకు ఆయన ప్రత్యక్ష ఉదాహరణ.

ఏప్రిల్‌లో దయారామ్ 3 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌పై డ్రీమ్11యాప్‌లో పందెం వేసిన ఆయన లీడర్ బోర్డులో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు.

"నేను రెండేళ్లుగా ఆడుతున్నాను. ఇది తొలి అతి పెద్ద గెలుపు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనిదంతా నమ్మలేకపోతున్నాను" అని దయారామ్ బీబీసీతో చెప్పారు.

తాను గెలుచుకున్న సొమ్ముతో ఇల్లు కట్టాలని దయారామ్ భావిస్తున్నారు.

"ఇంకా ఆడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు ఇందులో నష్టపోవచ్చు కూడా" అని ఆయన చెప్పారు.

దిల్లీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పని చేస్తున్న మొహమ్మద్ రకీబ్ అనుభవం మరోలా ఉంది.

"నేను ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కు ఫాంటసీ టీమ్‌ను క్రియేట్ చేస్తాను. అయితే నేనేప్పుడూ గెలవలేదు" అని రకీబ్ చెప్పారు.

ఫాంటసీ గేమింగ్ యాప్స్‌లో గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ధర్మేందర్ గౌతమ్ కూడా చెబుతున్నారు. అయితే ఏదో ఒక రోజు గెలుస్తామనే ఆశతో ఆడుతూ ఉంటానని చెప్పారు.

"ఫాంటసీ యాప్స్‌లో ఉండే మజా, గెలుస్తామనే ఆశ ఉత్సాహపరుస్తాయి. గెలవకున్నా, ఈసారి గెలుస్తామనే భావన కలుగుతుంది. నేను మూడు కోట్లు గెలవకపోవచ్చు కానీ 300, 500 రూపాయలు గెలుచుకున్నవాళ్లను చూశాను" అని ఆయన చెప్పారు.

ఫాంటసీ గేమింగ్ యాప్స్, డ్రీమ్ 11, ఐపీఎల్ క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రూపాయి ప్రవేశ రుసుముతో రూ. కోట్లు గెలుచుకునే అవకాశం ఉండటంతో ఫాంటసీ గేమింగ్ యాప్స్ పాపులర్ అయ్యాయి.

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశ

ఫాంటసీ గేమింగ్ విషయంలో రకీబ్, గౌతమ్ అనుభవాలు కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాయి. భారత్‌లో అల్పాదాయ వర్గాల్లో అనేకమంది, సంపన్నులుగా మారేందుకు ఇదొక దగ్గరి దారిగా భావిస్తున్నారు.

ఏడాదికి మూడు లక్షల రూపాయలకు లోపు సంపాదించే వారిలో 40 శాతం మంది వారంలో ఐదుసార్లకు పైగా ఫాంటసీ స్పోర్ట్స్ ఆడుతున్నట్లు కేపీఎంజీ రిపోర్ట్ తెలిపింది. ఏడాదికి 10 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్న వారిలో 12 శాతం మంది ఫాంటసీ స్పోర్ట్స్ ఆడుతున్నారు.

వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకు లోపు ఉన్న వారు"డబ్బు సంపాదించే అవకాశం" ఉన్నందుకే తాము ఫాంటసీ యాప్స్‌లో ఆడుతున్నట్లు చెబుతుంటే, రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారిలో 25 శాతం మంది ఇదే కారణం చెబుతున్నారు.

ఈ యాప్‌ల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆశ అనేక సందర్భాల్లో విషాదకర పరిణామాలకు దారి తీస్తోంది.

ఫాంటసీ గేమింగ్‌లో డబ్బు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న కేసులు అనేకం ఉన్నాయి.

ఫాంటసీ గేమింగ్ యాప్స్‌లో 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న బిహార్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నసంఘటన మార్చ్‌2025లో జరిగింది.

కోవిడ్-19 సమయంలో తాను ఫాంటసీ క్రికెట్ పట్ల ఆకర్షితుడిని అయ్యానని ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖలో తెలిపారు.

కోవిడ్ మహమ్మారి కాలం నుంచే ఫాంటసీ స్పోర్ట్స్ పట్ల ఆశ పెరిగిందని టెక్నాలజీ సంబంధిత సమస్యల పరిష్కారానికి పని చేస్తున్న మానసిక ఆరోగ్య సంస్థ 'సర్వీస్ ఫర్ హెల్తీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ' అధిపతి డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ చెప్పారు.

"వాళ్లను ఒక ఆలోచన నియంత్రిస్తుంది. తాము గెలుస్తామని వారు భావిస్తుంటారు. అయితే తరచుగా వచ్చే నష్టాలతో వారి మైండ్ పని చేయడం మానేస్తుంది" అని ఆయన చెప్పారు.

గేమింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న ఆత్మహత్యలు పెరగడంతో రెండు రాష్ట్రాలు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫాంటసీ గేమింగ్ యాప్స్‌పై ప్రత్యేక దర్యాప్తు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 2022లో ప్రకటించారు. ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు తాము ఒక చట్టం తీసుకువస్తామని మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా చెప్పారు.

సరైన నియంత్రణ లేకపోవడం వల్ల ఫాంటసీ గేమింగ్ ప్రమాదకరమైన అంశంగా మారిందని నిపుణులు భావిస్తున్నారు.

(ఆత్మహత్య తీవ్రమైన మానసిక సమస్య. మీరు అలాంటి ఒత్తిడిలో ఉంటే భారత ప్రభుత్వానికి చెందిన జీవన్‌సాథీ నెంబర్‌ 18002333330కు ఫోన్ చేసి సాయం కోరవచ్చు. మీ బంధువులు, స్నేహితులతో మాట్లాడవచ్చు.)

ఫాంటసీ గేమింగ్ యాప్స్, డ్రీమ్ 11, ఐపీఎల్ క్రికెట్, స్టాలిన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గేమింగ్ యాప్స్ మరణాలపై దర్యాప్తుకు కమిటీని ఏర్పాటు చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.

నియంత్రణపై అస్పష్టత

ఫాంటసీ స్పోర్ట్స్‌ నియంత్రించడం గురించి ఇటీవల ప్రశ్నలు తలెత్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అస్సాం రాష్ట్రాలు గ్యాంబ్లింగ్ నిషేధం కింద ఫాంటసీ గేమింగ్ యాప్స్‌ను నిషేధించాయి.

అయితే ఫాంటసీ గేమ్స్ జూదక్రీడలా లేక నైపుణ్యంతో ఆడే ఆటలా అనే వివాదం వల్ల ఈ నిషేధం అస్థిరంగా మారింది.

"ఫాంటసీ స్పోర్ట్స్ స్కిల్ గేమ్స్ కోటాలోకి వస్తాయని, వాటికి గ్యాంబ్లింగ్ చట్టాలు వర్తించవని అనేక హైకోర్టులు చెప్పాయి. కొన్ని హైకోర్టుల నిర్ణయాల్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అందుకే కేంద్రం, రాష్ట్రాలు వీటిని పూర్తిగా నిషేధించలేవు" అని న్యాయవాది జే సత్య చెప్పారు.

ఈ వాదనను చూపిస్తూ కర్నాటక, తమిళనాడులో ఫాంటసీ గేమింగ్ యాప్స్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించారు.

ఫాంటసీ గేమింగ్ యాప్స్, డ్రీమ్ 11, ఐపీఎల్ క్రికెట్, స్టాలిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గేమింగ్ యాప్స్‌లో గెలుచుకున్న సొమ్ము మీద కేంద్రం 28శాతం జీఎస్‌టీ వసూలు చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఫాంటసీ గేమింగ్ యాప్స్‌లో ఆడటాన్ని నిరుత్సాహపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ యాప్స్ ద్వారా వచ్చే నగదు బహుమతులపై 28శాతం జీఎస్‌టీ విధించింది. ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులపైనా ఇదే స్థాయిలో పన్ను అమల్లో ఉంది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

కేంద్రం విధించిన పన్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వం) ఆర్టికల్ 19( ఏ వృత్తినైనా ప్రాక్టీస్ చేసే స్వేచ్ఛ)ను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు, గేమింగ్ కంపెనీలు వాదించాయి.

ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమను నియంత్రించేందుకు 2023లో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ జాతీయ నియంత్రణ చట్టాన్ని రూపొందించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు కదలలేదు.

ఫాంటసీ గేమింగ్ ఫ్లాట్‌ఫామ్స్ "బలమైన, బాధ్యతాయుతమైన చర్యలు తీసుకున్నాయని" ఎఫ్ఐఎఫ్ ఎస్ ‌బీబీసీతోచెప్పింది. ఈ చర్యల వల్ల వినియోగదారులు "తమ సొంత ద్రవ్య, సమయ పరిమితి నిర్ణయించుకునేందుకు సమాచారం అందిస్తాయని" ఎఫ్ఐఎఫ్ఎస్ తెలిపింది.

భారత ఆర్థిక వ్యవస్థకు ఫాంటసీ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ద్వారా ఆదాయం వస్తోందని ఆన్‌లైన్ గేమింగ్ స్వీయ నియంత్రణ సంస్థ చెబుతోంది.

ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ మీద విస్తృత చర్చ జరుగుతున్నప్పటికీ, వాటిని ఆశ్రయిస్తున్న యూజర్ల సంఖ్య రోజువారీగా పెరుగుతోంది. ఇది తనకు వ్యసనంగా మారిందని ధర్మేంద్ర గౌతమ్ చెబుతున్నారు.

"నా చుట్టూ ఉన్నవాళ్లు ఆడుతున్నారు. అందుకే నేను కూడా ఆడుతున్నాను. ఏదో ఒక రోజు గెలుస్తామనే ఆశ ఉంది. అందుకే దీన్నుంచి బయటపడటం కష్టం" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)