క్రాకోనోష్: ఈ గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా? అయితే, మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయ్యే ముప్పుంది..

కంప్యుటర్లో గేమ్స్ ఆడుతున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జో టైడీ
    • హోదా, సైబర్ ప్రతినిధి

కొంత మంది హ్యాకర్లు కొన్ని డిజిటల్ గేమ్స్‌ను యూజర్లకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కలిగిస్తున్నారు. కానీ, ఆ ఉచితం వెనుక మరో పన్నాగం దాగి ఉంటోంది.

ఆ గేమ్స్‌లో రహస్యంగా మాల్‌వేర్ చొప్పిస్తున్నారు. ఈ గేమ్స్‌ ద్వారా గేమర్లను మోసం చేసి హ్యాకర్లు ధనవంతులుగా మారుతున్నారు.

గ్రాండ్ తెఫ్ట్ ఆటో- వి, ఎన్‌బిఏ 2కె 19, ప్రో ఇవల్యూషన్ సాకర్ 2018 లాంటి గేమ్స్‌ను కొన్ని ఫోరమ్స్‌లో ఉచితంగా ఇస్తారు.

కానీ, ఈ గేమ్‌ల పేర్లలో దాగిన కోడ్‌లలోనే క్రాకోనోష్ అనే క్రిప్టో మైనింగ్ మాల్‌వేర్ ఉంటుంది. ఒక్కసారి గేమ్ డౌన్‌లోడ్ కాగానే ఈ మాల్‌వేర్ ఆ కంప్యూటర్ నుంచి రహస్యంగా డిజిటల్ మనీని సృష్టిస్తుంది.

ఇలాంటి మోసాల ద్వారా ఇప్పటికే హ్యాకర్లు 2 మిలియన్ డాలర్లకుపైగా సొమ్ము చేసుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

అవస్ట్ యాంటీ వైరస్ ఇన్‌స్టాల్ చేసిన కంప్యూటర్లలోనే ఈ హానికారక సాఫ్ట్‌వేర్‌ను కనిపెట్టగలరని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, RESOLUTION GAMES

ఫొటో క్యాప్షన్, వీడియోగేమ్-ప్రతీకాత్మక చిత్రం

ఈ గేమ్‌లు క్రాకోనోష్‌ను వేగంగా వ్యాపింపచేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సంస్థ అవెస్టా పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు ప్రతీ రోజూ 800 వరకు వస్తున్నట్లు చెప్పారు.

అయితే, అవెస్టా యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేసిన కంప్యూటర్లలో మాత్రమే ఈ హానికారక సాఫ్ట్‌వేర్‌ను పరిశోధకులు కనిపెట్టగలుగుతున్నారు. దీనిని బట్టీ చూస్తే, క్రాకోనోష్ చూపిస్తున్న ప్రభావం చాలా ఎక్కువగానే ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇలాంటి మాల్‌వేర్ 12కు పైగా దేశాలలో లభించింది.

బాధితుల జాబితా ఇదీ

  • ఫిలిప్పీన్స్: 18,448 బాధితులు
  • బ్రెజిల్: 16,584 బాధితులు
  • భారత్: 13,779 బాధితులు
  • పోలండ్: 12,727 బాధితులు
  • అమెరికా: 11,856 బాధితులు
  • యూకే: 8,946 బాధితులు

క్రాకోనోష్ ఇన్‌స్టాల్ అవ్వగానే, అది తనను తాను రక్షించుకోవడానికి కావల్సిన చర్యలను తీసుకుంటుంది.

అందులో భాగంగా

  • విండోస్ అప్ డేట్స్‌ను డిజేబుల్ చేస్తుంది
  • సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని తొలగించేస్తుంది.
  • ఆ తర్వాత క్రిప్టోకరెన్సీ ప్రోగ్రాం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. ఈ విషయం గురించి కంప్యూటర్ యజమానికి తెలియదు.
  • ఇది కంప్యూటర్ పనితీరును మందగిస్తుంది.
  • కంప్యూటర్ భాగాలను వాడకుండానే పనికి రాకుండా చేస్తుంది.
  • బాధితుల కరెంటు బిల్లును పెంచేస్తుంది.
గ్రాండ్ తెఫ్ట్ ఆటో 5

ఫొటో సోర్స్, Rockstar games

ఫొటో క్యాప్షన్, ఉచితంగా అందించే గేమ్స్‌లో గ్రాండ్ తెఫ్ట్ ఆటో 5 ఒకటి

"గేమ్స్‌ను ఉచితంగా పొందడం వల్ల మీరు ఊహించని మాల్‌వేర్ బారిన పడతారనే విషయం క్రాకోనోష్ ద్వారా తెలుస్తుంది" అని అవెస్టాకు చెందిన క్రిస్టోఫర్ బడ్ చెప్పారు.

"మాల్‌వేర్ ప్రోగ్రాం చేసేవాళ్లకు ఇది చాలా లాభదాయకమైన చర్యగా కనిపిస్తోంది."

హ్యాకర్ల డిజిటల్ వ్యాలెట్లు పరిశీలించిన తర్వాత ఈ మోసంలో సుమారు 2 మిలియన్ డాలర్ల క్రిప్టోకరెన్సీ చేరినట్లు అవెస్టా చెబుతోంది.

ఈ మాల్‌వేర్ పేరును బట్టీ దీనిని చెక్ రిపబ్లిక్ దేశస్థులు రూపొందించి ఉంటారని భావిస్తున్నారు. చెక్ జానపద కథల్లో క్రాకోనోష్ అంటే "పర్వత ఆత్మ" అని అర్ధం.

చాలా గేమ్స్‌లో ఈ మోసపూరిత సాఫ్ట్‌వేర్ ఉంటున్నట్లు మార్చిలో సిస్కో టాలోస్‌లో పరిశోధకులు కనుగొన్నారు.

ఈ నెల మొదట్లో స్టీమ్ ప్లాట్‌ఫార్మ్ వాడుతున్న గేమర్లను లక్ష్యంగా చేసుకున్న మరో హ్యాకింగ్ ముఠాను కూడా జిడేటా సాఫ్ట్‌వేర్ బృందం కనిపెట్టింది.

2019 నుంచీ గేమింగ్ బ్రాండ్లు , గేమర్లపై కూడా ఈ సైబర్ దాడులు 340 శాతం పెరిగాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ అకామయి విడుదల చేసిన సైబర్ త్రెట్ నివేదికలో పేర్కొంది.

గేమింగ్ అకౌంట్లకు ఉండే అధిక విలువ వల్ల చాలా వరకు ఈ అకౌంట్లు సైబర్ దాడులకు గురయ్యాయి.

"నేరస్థులు గేమ్స్ ఆడేవాళ్లను చాలా వేగంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు" అని అకామయిలో సెక్యూరిటీ పరిశోధకుడు స్టీవ్ రాగన్ చెప్పారు.

"గేమ్స్ ఆడేవాళ్లు సాధారణంగా వారికున్న అభిరుచులపై డబ్బును ఖర్చు పెట్టడమే కాకుండా, నిరంతరం గేమ్స్ ఆడుతూ ఉంటారు. దాంతో, నేరస్థులు వారినొక స్థిరమైన వనరుగా చూస్తున్నారు."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)