ఐపీఎల్: రిటైర్‌మెంట్ ప్లాన్ గురించి ధోని ఏమన్నాడంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరిలో, ప్లేఆఫ్ రేసు నుంచి బయటికి వచ్చేసిన జట్లు, ఊహించని రీతిలో ఆడుతూ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి.
మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉన్నప్పటికీ, చివరి మ్యాచ్‌ను గెలుపుతో ముగించిన తీరు క్రీడాభిమానులకు హాయినిచ్చి ఉండొచ్చు.
ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను సీఎస్‌కే 83 పరుగుల తేడాతో ఓడించింది.
డెవాల్డ్ బ్రెవిస్, కాన్వేలు అర్ధ సెంచరీలు చేయడంతో 230 పరుగులు చేసిన సీఎస్‌కే.. గుజరాత్ టైటాన్స్‌కు సమస్యలను తీసుకొచ్చి పెట్టింది.
అద్భుతమైన బౌలింగ్‌తో, గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌ను కేవలం 147 పరుగులకే పరిమితం చేసింది.

రిటైర్‌మెంట్‌పై ధోని ఏం చెప్పారు?
గత కొన్ని సీజన్లుగా మహేంద్ర సింగ్ ధోని ఆడిన ప్రతిసారి, అదే ఆయన చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వచ్చేవి.
ఈ సీజన్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఇప్పుడూ అవే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
''నా రిటైర్‌మెంట్‌పై నేనేమీ ప్రకటన చేయడం లేదు. అలాగని తిరిగి ఆడటంపైనా నేను మాట్లాడను'' అంటూ మ్యాచ్ తర్వాత ధోని అన్నారు.
''ఈ నిర్ణయం తీసుకునేందుకు నాకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంది. తొందరేమీ లేదు. క్రీడాకారులు పెర్ఫార్మెన్స్ ఆధారంగా రిటైర్‌మెంట్ ప్రకటిస్తే, కొందరు 22 ఏళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుంది'' అని అన్నారు.
''నేను ఇప్పుడు రాంచీ వెళ్తాను. బైక్ రైడ్‌ను ఆస్వాదించాలి. సమయం ఉంది. ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటా'' అని ధోని చెప్పారు.
ఈ ఆటలో తమ జట్టు ప్రదర్శన బాగుందని ధోని అన్నారు.
‘‘ఈ సీజన్‌లో మా ఫీల్డింగ్ బాగోలేదు. కానీ, ఈ మ్యాచ్‌లో క్యాచింగ్ బాగుంది. రుతురాజ్ గైక్వాడ్ తిరిగొచ్చాక, ఆయన చాలా విషయాలపై కంగారు పడాల్సిన అవసరం ఉండదు'' అని అన్నారు.
రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
ధోనిపై ఊహాగానాలు
మ్యాచ్ ప్రారంభానికి ముందే, చివరిసారి సీఎస్‌కేకు ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ఊహాగానాలు వచ్చాయి.
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ధోని కెప్టెన్‌గా వ్యవహరించినా.. ఒకవేళ వచ్చే ఏడాది ధోని ఆడినా, జట్టుకు మాత్రం కొత్త కెప్టెన్ ఉంటారని కథనాలు వచ్చాయి.
మైదానంలో ధోని ఆడుతున్నప్పుడు, పసుపు జెర్సీతో స్టేడియమంతా నిండిపోతుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం కూడా దీనికి మినహాయింపేమీ కాదు.
ఈ సీజన్‌లో అభిమానుల అంచనాల మేరకు సీఎస్‌కే ఆడలేకపోయింది. అయినప్పటికీ, ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని మాత్రం చాలా కూల్‌గా కనిపించారు.
ఆయన మునపటి అలవాట్ల మాదిరిగానే, ఫీల్డర్లకు ఏవో సైగలు చేస్తూ కనిపించారు. స్టంప్ మైక్ నుంచి కొన్నిసార్లు ఆయన ఫన్నీ కామెంట్లు వినిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
సీఎస్‌కేకు ఊపిరిపోసిన కొత్త ఆటగాళ్లు
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లల్లో కొందరు గాయాలు పాలు కావడంతో, వారి స్థానంలో కొత్త వారు వచ్చారు. అలా వచ్చిన ఆటగాళ్లు తమను నమ్మితే, జట్టు తీరునే మార్చేస్తామని నిరూపించారు.
ఆయుష్ మాత్రే రాకతో, జట్టులోకి కొత్త ఊపిరి వచ్చినట్లు అనిపించింది. ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్‌ల కోఆర్డినేషన్ జట్టు రూపాన్నే మార్చేసింది.
గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్‌కే గెలవడంలో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారు.
సీఎస్‌కే ఎప్పుడూ దూకుడుగా ఆడే జట్టులా కనిపించ లేదు. ప్రస్తుతం ఈ జట్టు మాత్రం ఆధునిక శైలిలో ఆడుతోంది.
23 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులతో 57 పరుగులు చేసిన బ్రెవిస్, జట్టు స్కోరును 200ను దాటించడంలో కీలకంగా వ్యవహరించారు.
అద్భుతమైన ప్రదర్శన కారణంగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బ్రెవిస్ ఎంపికయ్యాడు
కొన్ని మ్యాచ్‌లే ఆడినా, భవిష్యత్ తనదే అని చూపించడంలో బ్రెవిస్ సక్సెస్ అయ్యాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














