ఐపీఎల్: మ్యాచ్‌ సమయంలో బ్యాట్ల కొలతలు తీసుకుంటున్న అంపైర్లు, ఎందుకిలా?

ఐపీఎల్‌, కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇకపై ఐపీఎల్‌లో బ్యాట్ సైజును తనిఖీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభంలో, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్‌లో బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతౌల్యత లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంకా చాలా మంది కూడా ఇదే మాట అన్నారు.

ఐపీఎల్‌లో బ్యాటింగ్ చేస్తున్న జట్లు, ఇరవై ఓవర్లలో మూడు వందల పరుగుల స్కోరును చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాగే జరిగితే ఈ ఆటను 'క్రికెట్' అని కాకుండా 'బ్యాటింగ్' అని పిలవాల్సి ఉంటుందని రబాడ వ్యాఖ్యానించాడు.

అయితే ఇప్పుడు ఆ అసమతుల్యతను తగ్గించి, సమతౌల్యాన్ని పెంచే దిశగా బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కగిసో రబాడ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్‌లో పరుగులు పారుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

బ్యాట్‌ని పరిశీలిస్తారు...

ఇప్పుడు ప్రతి బ్యాటర్ బ్యాటింగ్ కోసం గార్డ్ తీసుకునే ముందు తన బ్యాట్‌ను టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఆటగాడు బ్యాటింగ్ ప్రారంభించే ముందు అతని బ్యాట్‌ను తనిఖీ చేస్తారు.

ఇకపై ఓపెనింగ్ బ్యాటర్ పిచ్‌పైకి అడుగు పెట్టే ముందు ఫోర్త్ అంపైర్ వారి బ్యాట్‌లను కొలిచి చూస్తారు. తరువాత మైదానంలోకి వచ్చే ఆటగాళ్ల బ్యాట్‌లను మైదానంలో ఉన్న అంపైర్లు చెక్ చేస్తారు.

ఐపీఎల్‌లో చాలామంది బ్యాటర్స్ నిర్దేశించిన పరిమితి కంటే పెద్ద బ్యాట్‌లను ఉపయోగించిన ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ చర్య తీసుకున్నారు.

ఇప్పటివరకు, ఐపీఎల్‌లో ఇలా చేసే బ్యాటర్స్‌ని హెచ్చరించి వదిలేసేవారు.

కానీ, ఇకపై అలా కాదు. మైదానంలో పారదర్శకత, సమానత్వాన్ని తీసుకురావడానికి ఐపీఎల్, ఇలా బ్యాట్‌లను కొలిచి చూసే చర్యలు తీసుకుంది.

బ్యాట్‌లకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇంగ్లిష్ కౌంటీ సర్క్యూట్ జట్టు నాటింగ్‌హామ్‌షైర్ గత సంవత్సరం కొన్ని పాయింట్లను కోల్పోయింది.

క్రికెట్ బ్యాట్ సైజు, నియమాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రికెట్ బ్యాట్ సైజుకు సంబంధించి నియమాలు స్పష్టంగా ఉన్నాయి.

నియమాలు ఏం చెబుతున్నాయి?

క్రికెట్‌లో బ్యాట్ ఎంత వెడల్పుగా, బరువుగా ఉండాలో నియమాలు స్పష్టంగా ఉన్నాయి. బ్యాట్‌కు రెండు భాగాలు ఉంటాయి, ఒకటి బ్లేడ్, మరొకటి హ్యాండిల్.

హ్యాండిల్ వెదురు (కేన్) లేదా చెక్కతో తయారు చేసి ఉండాలి. బ్యాటర్ పట్టుకోసం హ్యాండిల్‌కు గ్రిప్ అమర్చవచ్చు. ఈ గ్రిప్‌ని జనరల్‌గా రబ్బరుతో తయారు చేస్తారు.

ఇక రెండో భాగాన్ని బ్లేడ్ అంటారు. దీనికి సంబంధించిన నియమాలు కూడా స్పష్టంగా ఉన్నాయి.

ఎమ్‌సీసీ(MCC) అంటే మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ నిబంధనల ప్రకారం, హ్యాండిల్ సహా బ్యాట్ మొత్తం పొడవు 38 అంగుళాలు( 96.52 సెం.మీ.) మించకూడదు.

బ్యాట్ బ్లేడ్ గరిష్ట వెడల్పు 4.25 అంగుళాలు (10.8 సెం.మీ.) ఉంటుంది.

దీని మందం 2.64 అంగుళాల (6.7 సెం.మీ) వరకు ఉంటుంది. అంచులు 1.56 అంగుళాల (సుమారు 4 సెం.మీ.) వరకు ఉండొచ్చు.

ఈ నియమాలు ఎమ్‌సీసీకి సంబంధించినవి. బ్యాట్ కొలతలు ఎంతెంత ఉండాలో ఐపీఎల్‌లో అంపైర్లకు ఇచ్చే ట్రయాంగిల్ గేజ్‌ మీద రాసి ఉంటుంది.

ఈ బ్యాట్ 2.68 అంగుళాల మందం (డెప్త్), 4.33 అంగుళాల వెడల్పు, అంచు వద్ద 1.61 అంగుళాల మందం ఉంటుంది. బ్యాట్ దిగువ భాగం అంటే వంపు (మూపు లాంటి భాగం) 0.20 అంగుళాల మందం ఉంటుంది.

ఐపీఎల్‌లో బ్యాట్‌లను కొలవడానికి ఈ గేజ్ (ప్రమాణం)ను నిర్ణయించారు. అంటే, బ్యాటర్లు ఉపయోగించే బ్యాట్లన్నీ ఈ ప్రమాణాల ప్రకారం ఉండటం తప్పనిసరి.

హార్దిక్ పాండ్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైదానంలో హార్దిక్ పాండ్యాతో సహా చాలా మంది క్రికెటర్ల బ్యాట్లను అంపైర్లు తనిఖీ చేశారు (ఫైల్ ఫోటో)

మ్యాచ్ సమయంలో బ్యాట్‌ల తనిఖీ

మ్యాచ్‌ల సమయంలో బ్యాట్‌లను చాలాసార్లు తనిఖీ చేశారు.

ఈ ఐపీఎల్ సీజన్‌కు ముందు వరకు.. మ్యాచ్ రోజున బ్యాట్లను చెక్ చేసేవారు కాదు. ఒక రోజు ముందు మాత్రమే తనిఖీ చేసేవారు. అయితే ఇందులో లోపం ఏంటంటే, మరుసటి రోజు బ్యాటర్ మరో బ్యాట్‌తో మైదానంలోకి దిగే అవకాశం ఉండేది.

చాలామంది బ్యాటర్స్ నిర్దేశించిన పరిమితి కంటే వెడల్పుగా లేదా మందంగా ఉన్న బ్యాట్‌తో ఆడినట్లు గుర్తించారు.

బ్యాట్ కింది భాగంలో ఒక కీలకమైన ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచే బ్యాటర్స్ ఎక్కువ షాట్లు ఆడతారు. ఇది పై భాగం కంటే బరువుగా, వెడల్పుగా ఉంటే, స్ట్రోక్ మరింత శక్తివంతంగా మారుతుంది.

హార్డ్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ వెడల్పు అంచులు ఉన్న బ్యాట్‌లను ఇష్టపడతారు. బంతి బ్యాట్ అంచుకు తగిలినా అది బౌండరీకి చేరుకుంటుంది.

అయితే, ఇకనుంచి బ్యాట్లపై మరింత ఫోకస్ ఉంటుంది కాబట్టి, నిర్దేశించిన పరిమితి కంటే పెద్దగా లేదా వెడల్పుగా ఉన్న బ్యాట్‌తో ఏ బ్యాటర్ కూడా మైదానంలోకి ప్రవేశించరని అనుకోవచ్చు.

మైదానంలో హార్దిక్ పాండ్యా, షిమ్రాన్ హెట్మెయర్, నితేశ్ రాణా, ఫిల్ సాల్ట్ సహా పలువురు బ్యాటర్ల బ్యాట్‌లను అంపైర్లు చెక్ చేశారు.

అయితే, మైదానంలో బ్యాట్‌లను తనిఖీ చేయడం వల్ల ఆటకు అంతరాయం కలుగుతుందనే భయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అది పెద్ద విషయం కాదన్న వాదన కూడా ఉంది.

ఐపీఎల్‌లో బ్యాట్ సైజుకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటి వరకు ఏ బ్యాటర్‌ను గుర్తించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)