భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో మునుపటిలా ఎందుకు రాణించలేకపోతున్నారు?

సైనా నెహ్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సైనా నెహ్వాల్ 2015లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని సాధించి, భారత బ్యాడ్మింటన్‌కు ముఖచిత్రంగా మారారు.
    • రచయిత, అనుపమ్ ప్రతిహారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

క్రీడల్లో 2011 నుంచి 2023 వరకు భారత్ బ్యాడ్మింటన్ స్వర్ణయుగాన్ని చూసింది.

ఆ సమయంలో ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్, థామస్ కప్ వంటి ప్రధాన టోర్నమెంట్లలో ట్రోఫీలను భారత్ గెలుచుకుంది.

భారత బ్యాడ్మింటన్ ప్రస్తుతం మార్పు దశలో ఉంది. ఈ రంగంలోని 'స్వర్ణ యుగం' ఆటగాళ్లు కొందరు రిటైర్ అయ్యారు, ఇంకొందరు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు లేదా వారి కెరీర్ చివరి దశలో ఉన్నారు.

కొత్త తరం ఆటగాళ్లలో లక్ష్య సేన్ (ప్రపంచ ర్యాంకింగ్ 16), డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి (ప్రపంచ ర్యాంకింగ్ 10), ట్రీషా జాలీ-గాయత్రి గోపీచంద్ పుల్లెల (ప్రపంచ ర్యాంకింగ్ 9) తప్ప, మిగతా వారెవరూ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో చెప్పుకోదగ్గ ముద్ర వేయలేదు.

మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు (ప్రపంచ నంబర్ 17) విదేశాల్లో చివరిసారిగా 2022లో టైటిల్ సాధించారు.

జులై 17న సింగపూర్ ఓపెన్‌లో ఆమె ఈ టైటిల్ గెలుచుకున్నారు, ఇది వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్.

మరోవైపు, లక్ష్యసేన్ చివరిసారిగా 2023 జులై 9న వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్ బీడబ్ల్యూఎఫ్ కెనడా ఓపెన్‌లో టైటిల్ గెలుచుకున్నారు.

డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ అయిన సాత్విక్, చిరాగ్ జంట 2024 మే 19న థాయిలాండ్ ఓపెన్‌లో తమ చివరి టైటిల్‌ను గెలుచుకుంది. ఇది వరల్డ్ టూర్ సూపర్ 500 ఈవెంట్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జ్వాలా గుత్తా, అశ్విని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2011 లండన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్‌లో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

‘ఇది బలహీనమైన దశ’

బ్యాడ్మింటన్ కోచ్ విమల్ కుమార్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ "ఇది బలహీనమైన దశ, ఆటలో ఇటువంటి దశలు వస్తూనే ఉంటాయి. ప్లేయర్లు దీనిని ఎదుర్కోవాలి. మనం ఓపికగా ఉండాలి, ప్లేయర్లకు సరైన దిశానిర్దేశం చేయాలి" అని అన్నారు.

‘‘బ్యాడ్మింటన్ ప్రపంచంలో బలమైన జట్లలో ఒకటిగా పరిగణించే చైనా కూడా ఈ పరిస్థితికి మినహాయింపు కాదు.

చైనా 2018లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించింది కానీ, ఊహించిన దానికంటే స్వదేశంలో చాలా తక్కువ విజయాలను సాధించింది.

దీంతో చైనా ఎవరూ ఊహించని పని చేసింది. మొదటిసారి ఇద్దరు విదేశీ కోచ్‌లను నియమించింది’’ అన్నారు విమల్ కుమార్.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యాడ్మింటన్ ప్రపంచంలో బలమైన జట్లలో ఒకటిగా పరిగణించే చైనా కూడా ఈ పరిస్థితికి మినహాయింపు కాదు.

2020లో చైనా ప్రధాన ప్లేయర్ లిన్ డాన్ రిటైర్ కావడంతో ఆ దేశ కష్టాలు మరింత పెరిగాయి. 2024 వరకు బ్యాడ్మింటన్‌లో చైనా ముద్ర అంతగా లేదు.

అయితే, ఇప్పుడు చైనా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వారి స్టార్ ప్లేయర్ షి యు క్వి 2025 మార్చి 16న ప్రతిష్టాత్మక ఆల్-ఇంగ్లాండ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. అతను ప్రస్తుతం ప్రపంచ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నారు.

పారిస్‌లో విఫలం

2024 పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం నుంచి భారత బ్యాడ్మింటన్ కోలుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తోంది.

"అవును, పారిస్ ఒలింపిక్స్‌లో ప్లేయర్లు ఆందోళనచెందారు. అది పెద్ద వేదిక. ప్రత్యర్థుల ముందు మన ప్లేయర్ల వ్యూహం పని చేయలేదు, దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్లిపోయారు, గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయారు" అని మాజీ ప్రపంచ నంబర్ 6 పారుపల్లి కశ్యప్ అన్నారు.

బ్యాండ్మిటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫామ్‌లోకి వస్తున్న ప్లేయర్లు

సింధు, లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ ఇప్పుడు తమను తాము మళ్లీ నిరూపించుకునే పనిలో ఉన్నారు. ఈ నలుగురు ప్లేయర్లు కోచ్‌ల వద్ద కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. 2025 ఆగస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రాణించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

"ఈ రోజుల్లో ప్రత్యర్థులు మ్యాచ్ ప్రారంభం నుంచే పూర్తి శక్తితో ఎటాక్ చేస్తారు. ఆ ఒత్తిడిని, ఎదురుదాడిని ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యం. గాలి వీచే దిశలో ఆడుతూ ఆటపై నియంత్రణ సాధించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది" అని విమల్ కుమార్ పేర్కొన్నారు.

"2025 ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌కు ముందు, లక్ష్యసేన్ వరుసగా రెండు మ్యాచ్‌లలో ప్రపంచ 6వ ర్యాంక్ ఆటగాడు లి షి ఫెంగ్‌ను ఓడించాడు. కానీ, క్వార్టర్ ఫైనల్స్‌ మొదటి గేమ్‌లో గాలి వీచే దిశలో ఆడుతున్న సమయంలో లక్ష్యసేన్ అనవసరమైన తప్పులు చేశాడు. అవే ఫలితాన్ని నిర్దేశించాయి" అని విమల్ అన్నారు

"గత రెండు దశాబ్దాలలో దేశంలోని బ్యాడ్మింటన్ పరిస్థితి మెరుగుపడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనకు మంచి కోచ్‌లు, ఫిజియోలు, శిక్షకులు ఉన్నారు" అని పారుపల్లి కశ్యప్ గుర్తుచేస్తున్నారు.

"2009లో మాకు ఒకే ఒక ఫిజియో ఉన్నారు, మాతో ఆయన ప్రయాణించలేకపోయారు. ఇక, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మొత్తం భారత జట్టుకు ఒకే ఒక ఫిజియో ఉన్నారు" అని చెప్పారు కశ్యప్.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్నారు.

భారత బ్యాడ్మింటన్ సత్తాచాటిన కాలం

సైనా నెహ్వాల్ తన టెక్నిక్, మానసిక బలం, చక్కని శైలితో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో దేశం ఉనికిని చాటారు. ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు, ఒలింపిక్స్‌లో భారతదేశానికి తొలి బ్యాడ్మింటన్ పతకం అదే.

ఇక, 2015లో సైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని సాధించి, భారత బ్యాడ్మింటన్‌కు ముఖచిత్రంగా మారారు.

మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్ప 2011 లండన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

2017లో శ్రీకాంత్ ఒకే సంవత్సరంలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్నారు. మరుసటి సంవత్సరం, పురుషుల సింగిల్స్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు శ్రీకాంత్.

అదే సమయంలో పీవీ సింధు మరో విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకొని చరిత్ర సృష్టించారు. 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నారు సింధు.

అక్టోబర్ 2023లో సాత్విక్-చిరాగ్ జంట ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ జంట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ జంట

'ర్యాంకింగ్ కోసం కాదు, విజయం కోసం ఆడాలి'

ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే.. పురుషుల సింగిల్స్‌లో టాప్-75 ర్యాంకింగ్స్‌లో డజను మంది భారతీయ ప్లేయర్లు ఉన్నారు. వారిలో శ్రీకాంత్, ప్రణయ్‌లకు మాత్రమే 32 సంవత్సరాలు, మిగతా వారందరూ 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారు.

"కొత్త ఆటగాళ్లలో ప్రియాంషు రాజావత్, కిరణ్ జార్జ్, తరుణ్ మన్నెపల్లి, ఆయుష్ శెట్టి, మన్రాజ్ సింగ్ రాబోయే రోజుల్లో రాణిస్తారని భావిస్తున్నాను" అని కశ్యప్ అన్నారు.

మహిళల సింగిల్స్‌ టాప్-100లో 17 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. టాప్-50లో పీవీ సింధు, మాల్వికా బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ, రక్షిత శ్రీ, ఆకర్షి కశ్యప్ ఉన్నారు.

"మన అమ్మాయిలు ర్యాంకింగ్ కోసం కాదు, గెలవాలనే ఉద్దేశంతో ఆడాలి. జపాన్‌కు చెందిన టోమోకా మియాజాకిని చూడండి. ఆమెకు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే, అయినప్పటికీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడవ స్థానంలో ఉన్నారు" అని బ్యాడ్మింటన్ కోచ్ విమల్ కుమార్ అన్నారు.

లక్ష్యసేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లక్ష్యసేన్

బ్మాడ్మింటన్ లీగ్ మారుస్తుందా?

ఐపీఎల్ మాదిరి బ్యాడ్మింటన్‌కూ ఓ లీగ్ ఉండేది. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ లీగ్‌ను పునఃప్రారంభించాలి, కార్పొరేట్‌ల నుంచి నిధులు సమకూరేలా చేయాలి.

"మనం లీగ్‌ను పునఃప్రారంభించగలిగితే, అది భారత ప్లేయర్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన యువ ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లు. కోచ్‌లతో మాట్లాడి, శిక్షణ పొందితే వారు ఇంకా నేర్చుకుంటారు. సాత్విక్, చిరాగ్ కూడా ఈ లీగ్ నుంచి ఎంతో ప్రయోజనం పొందారు" అని విమల్ కుమార్ తెలిపారు.

"ఈ లీగ్‌ బాధ్యతను కార్పొరేట్‌లు, ప్రొఫెషనల్ జట్లకు ఇవ్వాలి. చాలామంది విదేశీ ఆటగాళ్లు మన లీగ్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కూడా సంవత్సరానికి రెండు నుంచి మూడు వారాల నిర్ణీత కాలపరిమితిని ఇచ్చింది" అని ఆయన చెప్పారు.

ట్రీసా, గాయత్రి జోడీ.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2023లో ట్రీసా, గాయత్రి జోడీ.

'గెలవడం అలవాటు చేసుకోవాలి'

ఇటీవలి కాలంలో భారత ప్లేయర్లు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లు గెలవలేకపోవడం వల్లే చాలా టైటిళ్లను కోల్పోయారు.

"టైటిళ్లు గెలవడం ముఖ్యం. మన ఆటగాళ్లలో చాలామంది ర్యాంకింగ్‌ల వెంటే పరిగెత్తుతారు. ఆటగాళ్లు 18, 19 లేదా 20 సంవత్సరాల వయస్సులోనే పెద్ద విజయాలు సాధించడం ప్రారంభించాలి" అని విమల్ కుమార్ అభిప్రాయపడ్డారు.

మార్పు కలవరపెట్టేదిగా అనిపించవచ్చు, కానీ ఈ మార్పు చాలా మార్చగలదు.

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో లక్ష్య సేన్, సాత్విక్-చిరాగ్ జంట పతకాలు గెలవగలరని కశ్యప్ అభిప్రాయపడ్డారు.

ఎవరికి తెలుసు? ట్రీషా, గాయత్రి జోడీ లేదా మరేదైనా భారత జంటో గెలుపు పోడియంకు చేరుకోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)