MI Vs DC: ఆ మూడు బంతుల్లో జరిగింది ఐపీఎల్ చరిత్రలోనే అరుదు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కె. పోతిరాజ్
- హోదా, బీబీసీ కోసం
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ రెండో విజయాన్ని సాధించింది.
దిల్లీలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఒక అరుదైన సంఘటనతో దిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగులతో అనూహ్యంగా గెలిచింది.
మొదట ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది.
206 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన దిల్లీ జట్టు 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
వరుస పరాజయాలతో ఉన్న ముంబయి ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి తప్పేలా లేదని అభిమానులు భావిస్తున్న తరుణంలో అందరి అంచనాలను ముంబయి తలకిందులు చేసింది.
మూడు బంతుల్లో దిల్లీ నుంచి విజయాన్ని లాగేసుకుంది. ఆట ఎలా ముగిసిందో అర్థమే కాలేదని దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు.


ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ నిరాశపర్చిన రోహిత్ శర్మ
లీగ్‌లో ముంబయి ఆడుతున్న అయిదో మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ (18) పెద్దగా పరుగులు చేయలేదు. పవర్ ప్లేలో ముంబయి స్కోరు 59/1.
రికిల్టన్ (41), సూర్యకుమార్ (40) జోడీ రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించింది.
తర్వాత తిలక్ వర్మతో కలిసి సూర్యకుమార్ మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించారు.
ఆరు బంతుల వ్యవధిలో హార్దిక్ పాండ్యా (2), సూర్యకుమార్ వికెట్లు కోల్పోవడంతో ముంబయి తడబడింది.
తిలక్ వర్మ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి జట్టును ఆదుకోగా, నమన్ ధిర్ (38 నాటౌట్) కూడా కీలక పరుగులు జోడించాడు. దీంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది.
తిలక్ వర్మకు వరుసగా రెండో అర్ధసెంచరీ ఇది. దిల్లీ బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, విప్‌రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏడేళ్ల తర్వాత అర్ధసెంచరీ
కరుణ్ నాయర్ మూడేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ముంబయితో మ్యాచ్‌లో దిల్లీ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కరుణ్, ఫుల్ ఇంపాక్ట్ చూపించాడు.
40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 పరుగులు చేసి దిల్లీ తరఫున టాప్ స్కోరర్ అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 50 పరుగులు సాధించిన కరుణ్ నాయర్ దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అర్ధసెంచరీ కొట్టాడు.
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి మంచి ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్, ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. అతనిలా ఆడతాడని ఎవరూ ఊహించలేదు.
బుమ్రా, హార్దిక్, శాంట్నర్...ఇలా ఏ బౌలర్‌ను వదలకుండా కరుణ్ చెలరేగాడు.
కరుణ్ క్రీజులో ఉన్నంతవరకు దిల్లీ రన్‌రేట్ రాకెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్లింది.
పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. ఒక దశలో 119/1తో పటిష్టంగా నిలిచింది. విజయానికి 59 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉండగా దిల్లీ చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.
అయితే 26 పరుగుల వ్యవధిలో అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, స్టబ్స్ వికెట్లు కోల్పోయి 145/5తో నిలిచింది. ముంబయి రేసులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆటను మార్చిన 3 బంతులు
18వ ఓవర్ ముగిసేసరికి దిల్లీ స్కోరు 183/7. విజయానికి చివరి 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన స్థితిలో దిల్లీ నిలిచింది. క్రీజులో అశుతోష్ శర్మ, స్టార్క్ ఉన్నారు. గతంలో అశుతోష్ చాలా సార్లు మ్యాచ్‌ల్ని గెలిపించాడు. 19వ ఓవర్ బుమ్రా బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతికి పరుగులు రాలేదు. వరుసగా రెండు, మూడు బంతుల్లో అశుతోష్ బౌండరీలు బాదాడు. ఇంకా 9 బంతుల్లో విజయానికి 15 పరుగులు అవసరం.
నాలుగో బంతికి అశుతోష్ (17)ను జేక్స్ రనౌట్ చేశాడు. తర్వాతి బంతిని డీప్ మికెట్ దిశగా ఆడిన కుల్దీప్ యాదవ్, రాజ్‌బవా చేతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.
చివరి వికెట్‌గా బరిలోకి దిగిన మోహిత్ శర్మను మరుసటి బంతికే శాంట్నర్ రనౌట్ చేయడంతో ముంబయి ఒక థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది.
ఒక మ్యాజిక్ తరహాలో మూడు బంతుల్లోనే దిల్లీ చేతిలో ఉన్న ఆటను ముంబయి లాగేసుకుంది. మరో ఓవర్ మిగిలి ఉండగానే 12 పరుగులతో గెలిచింది.
ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో వరుసగా 3 బంతుల్లో 3 రనౌట్లు జరుగడం (రనౌట్ హ్యాట్రిక్) ఇదే తొలిసారి.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ఓటమికి కారణం
ఈ సీజన్‌లో ఐపీఎల్ ఒక కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఒకవేళ 11వ ఓవర్ తర్వాత మంచు ప్రభావం ఉంటే బంతిని మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మ్యాచ్‌లో ఇదే పెద్ద మలుపు.
దిల్లీ ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్ తర్వాత, అంపైర్లు మంచు ప్రభావం కారణంగా కొత్త బంతిని బౌలర్‌కు అందించారు.
కొత్త బంతి తీసుకున్న తర్వాత ముంబయి మ్యాచ్‌పై పట్టు సాధించింది. తర్వాతి 4 ఓవర్లలో 4 వికెట్లు తీసింది. అదే జోరులో మ్యాచ్‌ను వశం చేసుకుంది.
ఈ సీజన్‌లో రెండో గెలుపుతో ముంబయి ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి ఎగబాకింది.
దిల్లీ మొదటి పరాజయాన్ని ఎదుర్కొని 8 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
ఆట ఎలా ముగిసిందో, తామెలా ఎలా ఓడిపోయామో అర్థం కాలేదని దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ నవ్వుతూ అన్నాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














