‘షాక్‌లో ఎవరికీ నోట మాట కూడా రాలేదు’: బాంబు దాడికి గురైన బస్సులో ప్రజలను కాపాడిన 13 ఏళ్ల బాలుడి అనుభవాలు

ఫొటో సోర్స్, Getty Images
రష్యాకు చెందిన రెండు క్షిపణులు యుక్రెయిన్‌లోని సుమీ నగరం మీదికి దూసుకొచ్చినప్పుడు 13 ఏళ్ల కిరిలో ఇల్యాషెంకో తల్లితో కలిసి ఒక బస్సులో ఉన్నాడు.
మొదట ఏదో విజిల్ శబ్దం వచ్చి కింద పడిపోయిన ధ్వని వినిపించిందని, తర్వాత అరుపులు, అద్దాలు పగిలిన శబ్దాలు విన్నానని స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అబ్బాయి చెప్పాడు.
ఈ ఘటనతో షాకయ్యానని, అయితే వెంటనే తేరుకొని బస్సు తలుపు లాక్ అయినట్లు గ్రహించానని కిరిలో వెల్లడించాడు.
కిటికి నుంచి బయటకు దూకి, తలుపు గడియ తీసి బస్సులోని వాళ్లు బయటకు వచ్చే అవకాశం కల్పించానని కిరిలో వివరించాడు.
‘‘వాళ్లంతా షాక్‌లో ఉండి అరవడం కూడా మర్చిపోయారు. మా అమ్మ ముఖమంతా రక్తంతో కనిపించింది. నాకు చాలా భయమేసింది.'' అని కిరిలో చెప్పాడు.
ఈ రెండు క్షిపణి దాడుల్లో 35 మంది చనిపోయినట్లు యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు. క్రైస్తవులకు సెలవు రోజైన పామ్ సండే వేడుకలు చేసుకునేందుకు ప్రజలు బయటకు వచ్చిన సమయంలో, నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు దాడులు జరిగాయి.


ఫొటో సోర్స్, Reuters
బస్సులో ఉన్న వారిని కాపాడటానికి కిరిలో ప్రయత్నించినప్పటికీ, డ్రైవర్ సహా అందులోని చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు రవాణ కంపెనీ ఎలక్ట్రో అవటోట్రాన్స్ వెల్లడించింది.
గాయపడిన కిరిలోను ఆసుపత్రికి తరలించగా, ఆయన తలలో గుచ్చుకున్న ఒక వస్తువును వైద్యులు తీసేశారని, మరో రెండింటిని తొలగించలేకపోయారని పట్టణ తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కోబ్జర్ తెలిపారు.
2022లో యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి సుమీ నగరంపై జరిగిన అత్యంత భయంకర దాడి ఇదే.
ఈ దాడి తర్వాత నగర ప్రజలు మరింత భయభ్రాంతులకు లోనవుతున్నారు. మృతుల్లో ఒక ఆర్టిస్టు, లాయర్లు, వైద్య విద్యార్థులు, సంగీత కళాకారుడు, స్కూల్ టీచర్ ఉన్నారు.
సుమీ సెకండరీ స్కూల్ టీచర్లలో ఒకరైన మరీనా చుడేసా కూడా చనిపోయిన వారిలో ఉన్నారు.
మొదటి క్షిపణి దాడి తర్వాత ఇతరులకు సహాయం చేస్తున్న సమయంలో జరిగిన రెండో క్షిపణి దాడిలో మరీనా, ఆమె తల్లి చనిపోయినట్లు చెబుతున్నారు.
చర్చికి వెళ్లేందుకు బయల్దేరిన తమ స్కూలు ఆరో తరగతి విద్యార్థి మాక్సీమ్ మార్టినెంకో, అతని తల్లిదండ్రులు కూడా చనిపోయినట్లు స్టారోసిల్‌స్కీ లిసెమ్ పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
సుమీ స్టేట్ యూనివర్సిటీ, దాని కాంగ్రెస్ సెంటర్ ఈ దాడిలో బాగా దెబ్బతింది. పిల్లలకు క్లాసులు, అధికారిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ సెంటర్‌లో జరుగుతుంటాయి.
దాడి జరగడానికి ముందు, ఇక్కడ పిల్లల నాటకం కోసం స్టేజీని సిద్ధం చేశారు.
తొలి క్షిపణి దాడిలో సెంటర్ పైకప్పు ధ్వంసమైంది. దాని నేల మొత్తం శిథిలాలతో నిండిపోయినట్లు ఫోటోల్లో కనిపిస్తుంది.
రష్యా సరిహద్దుకు సమీపాన ఉండే ఈ నగరంపై ఆదివారం నాటి దాడిపట్ల అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
‘‘ఎంతో వికృతమైన చర్య మాత్రమే ఇంతటి వినాశనాన్ని సృష్టించగలదు.’’ అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అన్నారు.
సుమీలో యుక్రెయిన్ మిలిటరీ అధికారుల సమావేశ స్థలంపైనే క్షిపణి దాడి జరిగిందని, అయితే, పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ దాడి వల్ల కలిగిన భయంతో నగరవాసులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని స్థానికుడైన ఒలెక్సీ సాఖ్నో బీబీసీతో చెప్పారు.
యుద్ధంతో ప్రభావితులైన స్థానికులకు సహాయం చేసే ఒక సంస్థకు ఈయన అధిపతి.
నగరంలోని 50 ఇళ్లు దెబ్బతిన్నాయని సహాయ సిబ్బంది తెలిపారు. పరిహారం కోరుతున్న ప్రజలకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ఒలెక్సీ చెప్పారు.
సుమీ రీజియన్‌తో పాటు తూర్పు యుక్రెయిన్ ప్రాంతాల్లో రష్యా కొత్త దాడులు చేయవచ్చంటూ అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
ఈ సమయంలో నగరం విడిచి వెళ్లొచ్చా లేదా అనే విషయం గురించి సోషల్ మీడియాలో స్థానికులు చర్చిస్తున్నారు.
కొందరు స్థానికులు సరిహద్దు గ్రామాల నుంచి తరలిపోతున్నారని కొన్ని రిపోర్టులు సూచిస్తున్నాయి.
ఏ తరుణంలోనైనా నగరాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందనే ఆలోచనతో సుమీ ప్రాంత ప్రజలు గత మూడేళ్లుగా సామాన్లు సర్దుకుని సిద్ధంగా ఉన్నారని ఒలెక్సీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














