రష్యాతో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్ అంగీకారం, మరి రష్యా సంగతేంటి?

అమెరికా యుక్రెయిన్ చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా, యుక్రెయిన్ శాంతి చర్చల సారాంశాన్ని రష్యాకు అందిస్తామని అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రుబియో ( ఎడమ వైపు ఉన్న వ్యక్తి) చెప్పారు.
    • రచయిత, మాయా డేవిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యాతో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యుక్రెయిన్ తెలిపింది. సౌదీ అరేబియాలో యుక్రెయిన్- అమెరికా చర్చల తర్వాత కీయెవ్ ఈ ప్రకటన చేసింది.

తాను ఈ అంశాన్ని రష్యాకు వివరిస్తానని ఇప్పుడు "బంతి వారి కోర్టులో ఉంది" అని అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రుబియో అన్నారు.

ఒప్పందం పట్ల సానుకూలంగా స్పందించేలా రష్యాను ఒప్పించడం ఇప్పుడు అమెరికా బాధ్యత అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నారు.

అమెరికా యుక్రెయిన్ ప్రతినిధులు మంగళవారం జెడ్డాలో సమావేశం అయ్యారు. ఓవల్ ఆఫీసులో ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వాడీవేడి సంవాదం తర్వాత ఈ రెండు దేశాల ప్రతినిధులు అధికారికంగా సమావేశం కావడం ఇదే తొలిసారి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బంతి రష్యాకోర్టులో ఉందన్న అమెరికా

ట్రంప్- జెలియన్‌స్కీ గొడవ తర్వాత యుక్రెయిన్‌కు అమెరికా నిలిపివేసిన నిఘా సమాచారాన్ని తక్షణం పునరుద్దరిస్తామని అమెరికా ప్రకటించింది.

"దీర్ఘ కాలిక శాంతి స్థాపన కోసం చర్చలు జరిపేందుకు తమ ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసుకోవడానికి రెండు దేశాల ప్రతినిధులు అంగీకరించారు" అని సంయుక్త సమావేశం ప్రకటన వెల్లడించింది.

తమ ప్రతిపాదనను రష్యా అంగీకరిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రుబియో జెడ్డాలో చెప్పారు.

"కాల్పులు ఆపేసి చర్చలు కొనసాగించేందుకు" యుక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రష్యా ఈ ప్రతిపాదన తిరస్కరిస్తే "ఇక్కడ శాంతికి అడ్డుపడుతున్నదెవరో ప్రపంచానికి తెలుస్తుంది" అని చెప్పారు.

"కాల్పుల విరమణ ప్రకటించి, తక్షణమే చర్చలు చేపట్టేందుకు యుక్రేనియన్లు అంగీకరించిన ప్రతిపాదనను మేము తీసుకొచ్చాము. ఈ ప్రతిపాదనను ఇప్పుడు రష్యా వద్దకు తీసుకెళతాము. వాళ్లు కూడా శాంతి స్థాపనకు అంగీకరిస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు వాళ్లే నిర్ణయం తీసుకోవాలి" అని రుబియో చెప్పారు.

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఉపరితల దాడులతో పాటు సముద్రం, గగనతల దాడుల్ని కూడా పాక్షికంగా నిలిపివేయాలని జెలియన్‌స్కీ కోరారు. అయితే అది 30 రోజుల కాల్పుల విరమణకే పరిమితం అయింది.

అమెరికా యుక్రెయిన్ చర్చలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాలోని జెడ్డాలో చర్చలు జరుపుతున్న అమెరికా యుక్రెయిన్ ప్రతినిధులు

జెలియన్‌స్కీకి వెల్కమ్ చెబుతా: ట్రంప్

జెడ్డాలో చర్చల తర్వాత ట్రంప్ నిర్మాణాత్మక వైఖరికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు జెలియన్‌స్కీ ప్రకటించారు.

రష్యా "యుద్ధాన్ని ఆపాలనుకుంటుందా లేక కొనసాగించాలనుకుంటుందా" అనేది ఇప్పుడు తేలుతుందని జెలియన్‌స్కీ ఒక వీడియో సందేశంలో చెప్పారు

"వాస్తవాలేంటో తేలడానికి ఇది సరైన సమయం" అని ఆయన అన్నారు.

కాల్పుల విరమణ ప్రతిపాదనపై మాస్కోఇప్పటి వరకు స్పందించలేదు. చర్చల సారాంశం గురించి అమెరికా వివరించిన తర్వాత తాము ఒక ప్రకటన విడుదల చేస్తామమని క్రెమ్లిన్ వెల్లడించింది.

సౌదీలో చర్చలపై స్పందించిన డోనల్డ్ ట్రంప్ పుతిన్ ఈ ప్రతిపాదన అంగీకరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.

"ఇరు పక్షాలు సమానంగా స్పందిస్తేనే ఇది సాధ్యమవుతుంది" అని ట్రంప్ అన్నారు. కొన్ని రోజుల్లోనే కాల్పుల విరమణ అమలు కావచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు.

"రష్యాతో గురువారం జరగనున్న సమావేశంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నానని" ట్రంప్ వెల్లడించారు.

జెలియన్‌స్కీని తిరిగి వాషింగ్టన్ ఆహ్వానించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.

యుక్రెయిన్ ఖనిజాలు, అమెరికా భద్రత హామీలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా యుక్రెయిన్ ఖనిజ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రెండు దేశాలు అంగీకరించాయి.

యూరప్‌ భాగస్వామ్యంపై యుక్రెయిన్ పట్టు

అమెరికాతో చర్చల విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ తిరస్కరించలేదని రష్యా అధికారిక పత్రిక టాస్ ప్రకటించింది.

జెలియన్‌స్కీతో సంబంధాలు తిరిగి పట్టాలపైకి ఎక్కాయా అని అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రుబియోను ప్రశ్నించినప్పుడు ఆయన "శాంతి చర్చలు పట్టాలకెక్కాయి" అని అన్నారు.

జెడ్డాలో అమెరికా – యుక్రెయిన్ బృందాలు భేటీ కావడానికి ముందు మాస్కోపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దౌత్యం ద్వారా యుద్ధాన్ని ముగించేందుకు యుక్రెయిన్ సిద్ధంగా లేదని రష్యా ఆరోపించింది.

యుక్రెయిన్ అమెరికా మధ్య కీలకమైన ఖనిజాల ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ట్రంప్, జెలియన్‌స్కీ అంగీకరించారని సంయుక్త ప్రకటన వెల్లడించింది.

అమెరికా భద్రతాపరమైన హామీలు ఇస్తే, తమ దేశంలో ఖనిజాలు తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి ఇస్తామని యుక్రెయిన్ ప్రతిపాదించింది. అయితే వైట్‌హౌస్‌లో రెండు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన గొడవ తర్వాత ఈ ఒప్పందం పట్టాలు తప్పింది.

మంగళవారం చర్చల్లో ఖనిజాల ఒప్పందం ప్రస్తావనకు రాలేదని, అయితే యుక్రెయిన్ అధికారులతో అమెరికా అధికారులు మాట్లాడారని రుబియో చెప్పారు.

జెడ్డాలో చర్చల్లో పాల్గొన్నవారిలో అమెరికా జాతీయ భద్రత సలహదారు మైక్ వాల్జ్, మిడిల్ ఈస్ట్ దూత స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు.

విట్కాఫ్ త్వరలోనే రష్యాలో పర్యటించనున్నారు. శాంతి చర్చల్లో యూరప్ కూడా పాల్గొనాలని కీయెవ్ మరోసారి ప్రస్తావించినట్లు సంయుక్త ప్రకటన తెలిపింది.

యుక్రెయిన్ విషయంలో అమెరికా- రష్యా మధ్య చర్చల్లో యూరోపియన్ యూనియన్‌ను పక్కన పెట్టడంతో యూరోపియన్ దేశాల నాయకులు అనేక అత్యవసర సమావేశాలు నిర్వహించారు.

తాము సానుకూల పరిణామాన్ని స్వాగతిస్తున్నామని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండర్లయిన్ చెప్పారు.

మాస్కోపై డ్రోన్ దాడి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మాస్కోపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు చనిపోయారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.

మాస్కోపై డ్రోన్ దాడి

రష్యాపై మరికొన్ని ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్చరించారు. అమెరికా ఇప్పటికే రష్యా మీద అనేక ఆంక్షల్ని అమలు చేస్తోంది.

ఓ వైపు చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా రాజధాని నగరం మీద జరిగిన భారీ డ్రోన్ దాడిలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. 18 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని రష్యా ఆరోగ్య విభాగం అధికారులు చెప్పారు.

రష్యా మీదకు ప్రయోగించిన 337 డ్రోన్లను కూల్చి వేశామని, అందులో 91 మాస్కో ప్రాంతంలో నేల కూల్చామని రష్యన్ రక్షణ శాఖ తెలిపింది.

రష్యన్ డ్రోన్లు కీయెవ్‌తో పాటు అనేక ప్రాంతాలపై దాడులు చేసినట్లు యుక్రెయిన్ ఆరోపించింది.

రష్యా ప్రయోగించిన 126 డ్రోన్లలో 79 డ్రోన్లను, ఇస్కాండర్ బాలిస్టిక్ మిసైల్‌ను కూల్చివేశామని యుక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)