రియాద్‌లో శాంతి చర్చలు: రష్యా మాట వింటుందా?

ఫొటో సోర్స్, Global Images Ukraine via Getty Images
- రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికా, యుక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. సోమవారం రష్యాతోనూ చర్చలు జరుగుతాయి.
యుక్రెయిన్‌లో సమగ్ర శాంతి ఒప్పందానికి ముందు, తక్షణ పాక్షిక కాల్పుల విరమణ అమల్లోకి తేవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
అందుకే రియాద్ చర్చల్లో ఈ అంశం ఏదైనా ఓ కొలిక్కి వస్తుందా లేదా అని అనేక మంది ఎదురు చూస్తున్నారు
అయితే అది ఎవరు ఎవరి మాట వింటారనే దానిపై ఆధారపడి ఉంది.
"పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని భావిస్తున్నాను " అని అమెరికా అధ్యక్షుడి తరపు దూత స్టీవ్ విట్‌కాఫ్ అన్నారు. "మీరు సోమవారం రియాద్‌లో జరిగే చర్చల్లో అసలైన పురోగతి చూస్తారు" అని ఆయన అన్నారు.
అయితే రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ అంచనాలను కొట్టి పారేశారు. "మనం ఈ మార్గంలోకి ఇప్పుడే అడుగు పెట్టాం" అని ఆయన రష్యా అధికార టెలివిజన్ చానల్‌తో చెప్పారు.
శనివారం రాత్రి రష్యా కీయెవ్ మీద డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు చనిపోయారు.
"దాడులు ఆపాలని పుతిన్ నిజమైన ఆదేశాలు జారీ చేసేలా ఆయనపై మేం ఒత్తిడి తేవాల్సి ఉంది. యుద్ధాన్ని ప్రారంభించిన వ్యక్తే దాన్ని ఆపాలి" అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆదివారం రాత్రి వీడియో సందేశంలో చెప్పారు.


ఫొటో సోర్స్, Genya Savilov/AFP
క్రెమ్లిన్ ఆలోచన మరోలా ఉంది. కాల్పుల విరమణ విషయంలో పరుగులు తీయాల్సిన అవసరం లేదని రష్యా భావిస్తోంది. యుక్రెయిన్ ఆమోదించిన అమెరికా ప్రతిపాదిత 30 రోజుల కాల్పుల విరమణపై పుతిన్ ఇప్పటికే అనేక సార్లు ప్రశ్నలు సంధించడం, షరతులు విధించడం వంటివి చేశారు.
ఆదివారం రాత్రి రియాద్‌లో అమెరికా యుక్రెయిన్ ప్రతినిధుల చర్చలు తిరిగి ప్రారంభం అయ్యాయి. యుక్రెయిన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ రక్షణమంత్రి రుస్తెమ్ యుమిరోవ్ నాయకత్వం వహిస్తున్నారు.
"ఇవి సాంకేతిక పరమైన చర్చలు. కీలకమైన మౌలిక వసతులు, విద్యుదుత్పత్తి కేంద్రాల సంరక్షణపై దృష్టి పెట్టాం" అని యుమిరోవ్ చెప్పారు.
రష్యా మీద ఆంక్షలను సడలిస్తే, యుక్రెయిన్ పోర్టుల నుంచి నల్ల సముద్రం మీదుగా ఎగుమతి అయ్యే గోధుమ నౌకలపై రష్యా దాడులు చేయకుండా ఉండే ఒప్పందాన్ని పునరుద్దరించవచ్చని భావిస్తున్నారు.
యుద్ధంలో భాగంగా రష్యా, యుక్రెయిన్ తమ ప్రత్యర్థుల మౌలిక వసతుల మీద దాడులు చేశాయి.
యుక్రెయిన్ విద్యుదుత్పత్తి కేంద్రాల మీద దాడులు చేయడం ద్వారా ఆ దేశ ప్రజలు చీకటి, చలితో బాధ పడేలా రష్యా దాడులు చేసింది.
యుక్రెయిన్ కూడా డ్రోన్ల సాయంతో రష్యాలోని చమురు కేంద్రాల మీద దాడులు చేసింది.
1945 తర్వాత యూరప్‌లో అత్యంత వినాశకరమైన, ఇరువైపులా వేల మంది చనిపోయిన, బందీలుగా చిక్కిన, గాయపడిన యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరాట పడుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














