వైభవ్ సూర్యవంశీ: చిన్నోడేగానీ, చిచ్చర పిడుగయ్యాడు...ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు..

ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్, వైభవ్ సూర్యవంశీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సామ్ డ్రూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడటమంటే అదే. చేసిన సెంచరీలో 11 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయంటే ఆ ఇన్నింగ్స్ ఎలా సాగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదంతా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆట గురించి.

సోమవారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్‌లో వైభవ్, జైస్వాల్‌లు పోటీ పడి సిక్సర్లు, ఫోర్లు కొడుతుంటే, సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్‌కు పండగే అయ్యింది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

పురుషుల టీ20ల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

తాను ఎదుర్కొన్న 35వ బంతిని సిక్స్‌గా మలిచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు వైభవ్.

2013లో పుణె వారియర్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున 30 బంతుల్లో సెంచరీ చేశాడు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్. ఇదే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ.

35 బంతుల్లో ఫాస్టెస్ట్ (అత్యంత వేగవంతమైన) సెంచరీని సాధించిన భారతీయ ఆటగాడిగా కూడా రికార్డ్ సృష్టించాడు సూర్యవంశీ.

ఈ టీనేజ్ ఎడమచేతి వాటం బ్యాటర్ ఏడు ఫోర్లు, 11 సిక్సర్లతో 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఔటయ్యాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైభవ్ సూర్యవంశీ,ఐపీఎల్

ఫొటో సోర్స్, BCCI/IPL

ఫొటో క్యాప్షన్, ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ.. మూడు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేశాడు.

ఈ ఏడాది మార్చికి వైభవ్‌కు 14 ఏళ్లు నిండాయి. గతేడాది వేలంలో 1.1 కోట్ల రూపాయలకు సంతకం చేసిన సూర్యవంశీ, ఏప్రిల్ ప్రారంభంలో ఐపీఎల్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తన మొదటి బంతికే సిక్స్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు.

సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం కోసం 210 పరుగుల లక్ష్యాన్ని తేలికగా సాధించడంలో అదే దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు వైభవ్.

మరో బ్యాటర్ యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు, సూర్యవంశీ, యశస్వి కలిసి 166 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా ఐదు ఓటములకు తెరపడింది. నాకౌట్ దశకు చేరుకోవాలనే ఆశలు సజీవంగా నిలుపుకుంది.

గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్ 50 బంతుల్లో 84 పరుగులు, జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ జట్టు ఓటమి పాలైంది. రన్ రేట్ పరంగా ఐపీఎల్ పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.

సెంచరీపై వైభవ్ ఏమన్నాడు.

మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ మాట్లాడాడు.

"ఐపీఎల్‌లో సెంచరీ సాధించాలన్న కల నిజమైంది. గత మూడు-నాలుగు నెలలుగా నేను పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది" అని అన్నాడు.

బ్యాటింగ్ సమయంలో ఎదురుగా ప్రపంచ స్థాయి బౌలర్లను చూసినప్పుడు మీకు ఏమనిపించింది అన్నప్పుడు...‘‘బౌలర్ ఎవరన్నది పట్టించుకోను, బంతిపైనే దృష్టి పెడతా" అని అన్నాడు.

బౌలర్లు ఇప్పుడు నిన్ను టార్గెట్ చేస్తారా అన్నప్రశ్నకు "నేను దాని గురించి ఆలోచించడం లేదు. నా ఆటపైనే దృష్టి పెడుతున్నాను" అని సమాధానం ఇచ్చాడు.

వైభవ్‌ ఆటతీరుకి సచిన్, యువరాజ్ సహా దిగ్గజాలు ఫిదా

వైభవ్ తుపాన్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీల హ్యాండిల్స్ కూడా వైభవ్ ని ప్రశంసించాయి.

వైభవ్‌ను అభినందించిన వారిలో యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నాడు. 37 బంతుల్లో సెంచరీ చేసి యూసుఫ్ రికార్డును సూర్యవంశీ అధిగమించాడు.

యూసుఫ్ పఠాన్ ఎక్స్‌లో ఇలా రాశాడు.. "ఐపీఎల్‌లో ఒక భారతీయుడి వేగవంతమైన సెంచరీగా నా రికార్డును బద్దలు కొట్టిన చిన్నారి వైభవ్ సూర్యవంశీకి అభినందనలు! నేను పని చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతూ ఇలా నా రికార్డ్ బద్దలుకొట్టడం మరింత ప్రత్యేకంగా ఉంది" అని రాశాడు.

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశాడు. "వైభవ్ నిర్భయమైన విధానం, అతని బ్యాట్ వేగం, బంతి వేగాన్ని అంచనా వేయగల సామర్థ్యం, షాట్లలోని శక్తి చాలా మంచి ఇన్నింగ్స్‌కు మ్యాజిక్ ఫార్ములా. ఫలితం: 38 బంతుల్లో 101. బాగా ఆడాడు వైభవ్" అని రాశాడు.

"ఈ రోజు వైభవ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. నేను అవతలి వైపు నుంచి అతను కొట్టే షాట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నా" అని యశస్వి జైస్వాల్ అన్నాడు.

వైభవ్

ఫొటో సోర్స్, ANI

వైభవ్ సూర్యవంశీ ఎవరు?

గత సంవత్సరం బిడ్డింగ్‌లో సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

గత అక్టోబర్‌లో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19 జట్లతో జరిగిన యూత్ టెస్ట్‌లో భారత అండర్-19 జట్ల తరపున ఆడి, 13 ఏళ్ల వయసులో 58 బంతుల్లో సెంచరీ సాధించి వార్తల్లో నిలిచాడు.

గత సంవత్సరం భారత అండర్-19 ఆసియా కప్ జట్టులో కూడా సూర్యవంశీ ఉన్నాడు. 44 సగటుతో 176 పరుగులు చేశాడు.

బిహార్ రాష్ట్రం తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. గతేడాది జనవరిలో 12 సంవత్సరాల వయసులో అరంగేట్రం చేశాడు వైభవ్.

బిహార్ తరపున ఐదు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 100 పరుగులు సాధించగా..అత్యధిక స్కోర్ 41.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)