టెస్టు క్రికెట్‌కు విరాట్ గుడ్‌బై, ఇటీవలి కాలంలో కోహ్లీని తీవ్రంగా బాధించిన అంశం ఏంటంటే...

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్ ద్వారా కోహ్లీ ప్రకటించాడు.

కోహ్లీ సహచరుడు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇటీవలే టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే 'టెస్ట్ క్రికెట్ రారాజు'గా అభిమానులు పిలుచుకునే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు.

36 ఏళ్ల కోహ్లీ తన కెరీర్‌లో 123 టెస్టులాడి 46.85 సగటుతో 9230 పరుగులు సాధించాడు.

టెస్టులకు దూరమవుతున్నట్లు ప్రకటిస్తూ, ఇన్‌స్టాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విరాట్ కోహ్లీ, టెస్టు క్రికెట్

#269 సైనింగ్ ఆఫ్

''నేను బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లు అవుతోంది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్‌లో ఇంత దూరం ప్రయాణిస్తానని నేను ఊహించలేదు. టెస్ట్ ఫార్మాట్ నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది. ఇది జీవితాంతం గుర్తుంచుకునే పాఠాలు నేర్పింది.

ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం నాకు అంత సులభం కాదు. కానీ, ఇప్పుడిలా చేయడమే సరైనది. ఈ ఆట కోసం నేను చేయగలిగింది అంతా చేశాను. నేను ఆశించిన దాని కంటే చాలా ఎక్కువగా ఈ ఆట నుంచి నేను పొందాను.

ఇప్పుడు ఈ ఆటకు, ఈ ప్రయాణంలో నా వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికి, మైదానంలో నాతో ఆడిన సహచరులకు కృతజ్ఞతలు తెలుపుతూ వెళ్లిపోతున్నా.

నా టెస్టు క్రికెట్ కెరీర్ పట్ల గర్విస్తున్నా. #269 సైనింగ్ ఆఫ్'' అని కోహ్లీ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

టెస్టు కెరీర్ మొదలైన మూడేళ్లకే కెప్టెన్సీ

విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌పై టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. తర్వాత మూడేళ్లకే టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.

భారత్ తరఫున 68 టెస్టులకు కెప్టెన్సీ వహించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యహరించిన భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు.

కోహ్లీ కెప్టెన్సీలో భారత్ కేవలం 17 టెస్టుల్లోనే ఓటమి పాలైంది. 40 టెస్టుల్లో గెలుపొంది, 11 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

కెప్టెన్‌గా టెస్టుల్లో కోహ్లీ విజయాల శాతం 58.82. ఈ గణాంకాలతో కోహ్లీ అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు.

అంతర్జాతీయ స్థాయిలో స్టీవ్ వా (41), రికీ పాంటింగ్ (48), గ్రేమ్ స్మిత్ (53) టెస్టు కెప్టెన్లుగా అత్యధిక విజయాలు సాధించారు.

కోహ్లీ రికార్డులు

కోహ్లీ సారథ్యంలో దూకుడు

కోహ్లీ కెప్టెన్‌గా భారత్ టెస్టుల్లో దూకుడు కనబరిచింది.

కోహ్లీ నాయకత్వంలోనే భారత్ తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుపొంది చరిత్ర సృష్టించింది. టీమిండియా 2019లో ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలను ఓడించి సత్తా చాటింది.

కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై భారత్ 11 టెస్టు సిరీస్‌లు ఆడింది. అన్నింటిలోనూ విజయాలు సాధించింది.

టెస్టు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు మోస్తూనే, బ్యాట్స్‌మన్‌గా కూడా కోహ్లీ సత్తా చాటాడు. కెప్టెన్‌గా కోహ్లీ 54.80 సగటుతో 5864 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే పుణెలో దక్షిణాఫ్రికాపై కోహ్లీ అజేయంగా 254 పరుగుల భారీ స్కోరు చేశాడు.

కోహ్లీ ఆడిన చివరి టెస్టు కూడా ఆస్ట్రేలియాపైనే.

ఈ ఏడాది మొదట్లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చివరగా టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో గెలిచింది. సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఆ నలుగురిలో ఒకడు

కోహ్లీ 14 ఏళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.

కోహ్లీ కంటే ముందు సచిన్ తెందూల్కర్ (15921), రాహుల్ ద్రావిడ్ (13265), సునీల్ గావస్కర్ (10122) ఉన్నారు.

సమకాలీన క్రికెట్‌లో నలుగురు బ్యాటింగ్ దిగ్గజాల్లో ఒకరిగా కోహ్లీకి పేరుంది. ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్, న్యూజీలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్‌, కోహ్లీని ఈ కాలపు బ్యాటింగ్ దిగ్గజాలుగా పరిగణిస్తారు.

అయితే, కెరీర్ చివరిలో కోహ్లీ టెస్టుల్లో నిలకడగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కోహ్లీ తడబాటు కనిపించింది. ఆ సిరీస్‌లో కోహ్లీ ఆడిన 9 ఇన్నింగ్స్‌లో కేవలం 190 పరుగులే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.

నవంబర్‌లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కోహ్లీ ఈ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు 16 నెలల్లో కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రాలేదు. ఆ కాలంలో కోహ్లీ 15 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడాడు.

2020 జనవరి నుంచి కోహ్లీ ఆడిన 39 టెస్టుల్లో మూడు సెంచరీలు మాత్రమే కొట్టాడు. ఆ సమయంలో కోహ్లీ సగటు 30.72గా ఉంది.

ఆస్ట్రేలియా పర్యటనలో తన ప్రదర్శన ఎంతో బాధించిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సమ్మిట్‌లో కోహ్లీ పేర్కొన్నట్లు స్పోర్ట్స్‌స్టార్ వెబ్‌సైట్ పేర్కొంది.

''నేను బాగా నిరాశ చెందిన సందర్భం గురించి చెప్పాలంటే, ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన గురించి చెబుతాను. ఈ మధ్యే ఆ సిరీస్ జరిగినందున నా జ్ఞాపకాల్లో ఇంకా తాజాగా ఉంది. చాలా నిరాశగా అనిపిస్తుంది. గతంలో 2014 నాటి ఇంగ్లండ్ టూర్ నన్ను చాలా బాధించింది. వచ్చే నాలుగేళ్లలో నేను మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లి ఆడతానో లేదో, ఏం జరుగుతుందో చెప్పలేను'' అని కోహ్లీ అన్నాడు.

భారత్ టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

టెస్టుల్లో కోహ్లీ రికార్డులు

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్: 2012, 2015, 2016, 2018, 2023

భారత కెప్టెన్‌గా అత్యధిక సంచరీలు: 20

భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు: 5864

భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు: 7

కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు: 6

టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక విజయాలు: 40

వరుస సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు: 4

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్ (2018-19)

కెప్టెన్‌గా వరుస టెస్ట్ సిరీస్ విజయాలు: 9

ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్: 7

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)