భారత్ - పాకిస్తాన్: కాల్పుల విరమణ గురించి అంతర్జాతీయ మీడియా ఎలా రిపోర్ట్ చేసింది?

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యటకులపై దాడి జరిగిన తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
రెండు దేశాలూ శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటనలు చేసినప్పటికీ.. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఇరుదేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు కుదిరిన ఒప్పందం, దాని ఉల్లంఘనల గురించి విదేశీ మీడియా కూడా చర్చించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వార్తా పత్రికలు, న్యూస్ ఔట్‌లెట్లలో భారత్ - పాకిస్తాన్‌కు సంబంధించిన వార్తలు ప్రచురితమయ్యాయి.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మీడియాలో ఏం వచ్చింది?
''నాలుగు రోజుల డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, భారత్ - పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి'' అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
''కానీ, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతున్నట్లు వార్తలొచ్చాయి'' అని రాసింది.
''అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. భారత్-పాకిస్తాన్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, పాకిస్తాన్ మాత్రమే ఇందులో అమెరికా పాత్రను ప్రస్తావించింది'' అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
''కాల్పుల విరమణ అనేది రెండు దేశాల మధ్య ఘర్షణలను ఆపివేసే ప్రయత్నం. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో బుధవారం భారత్ వైమానిక దాడులు చేయడంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి'' అని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
''ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు భారత్ చెప్పింది. ఆ తర్వాత మూడు రోజులపాటు ఇరుదేశాలు పరస్పర దాడులకు దిగాయి. '' అని రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ మీడియా ఏం రాసింది?
''2016, 2019ల్లో భారత్ - పాకిస్తాన్‌ల మధ్య జరిగిన దాడులు కశ్మీర్‌తో పాటు ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాలకే పరిమితమయ్యాయి'' అని ఫైనాన్షియల్ టైమ్స్ రాసింది.
''కానీ, ఈసారి రెండు దేశాల మధ్య మరింత తీవ్రమైన ఘర్షణ కనిపించింది. రెండుదేశాలూ పరస్పరం వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్లను ప్రయోగించాయి'' అని పేర్కొంది.
భారత్ - పాకిస్తాన్‌లు యుద్ధానికి దగ్గరగా వచ్చినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది.
''ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు చివరిసారిగా 1971 యుద్ధ సమయంలో జరిగాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడంతో ఆ యుద్ధం ముగిసింది'' అని రాసింది.
''1971కి, ఇప్పటికీ ఉన్న ప్రధాన తేడా ఏంటంటే.. అప్పట్లో రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు లేవు. కానీ, ఇప్పుడున్నాయి'' అని టెలిగ్రాఫ్ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా మీడియా ఏమంది?
''కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నట్లు భారత్ - పాకిస్తాన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొద్దిగంటలకే ఈ ఆరోపణలు చేసుకున్నాయి'' అని అరబ్ న్యూస్ డాట్ కామ్ తెలిపింది.
''నాలుగు రోజుల పాటు డ్రోన్లు, క్షిపణులు, జెట్ ఫైటర్లతో దాడుల అనంతరం ఇరుదేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఈ దాడుల్లో కనీసం 60 మంది చనిపోయారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లాల్సి వచ్చింది. డోనల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది'' అని అరబ్ న్యూస్ డాట్ కామ్ రాసింది.
''భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు వార్తలు రాగానే, గుండెలపై బరువు తగ్గినట్లు ఉందని దుబయ్‌లో నివసిస్తున్న ఫైనాన్స్ ప్రొఫెషనల్ సిద్ధార్థ్ గుప్తా చెప్పారు. ఈ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న భయం ఇక తొలగిపోతుందని సిద్ధార్థ్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు'' అని ఖలీజ్ టైమ్స్ రాసింది.
''ఇక తాను, తన కుటుంబం షెల్లింగ్ శబ్దాలను వినాల్సిన అవసరం లేదని పాక్ పాలిత కశ్మీర్‌లో ఉంటోన్న మంజూర్ ఖాన్ అన్నారు'' అని ఖలీజ్ టైమ్స్ రాసింది.
భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను తగ్గించేందుకు సౌదీ అరేబియా కూడా దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సౌదీగజెట్ డాట్ కామ్ రాసింది.
''సౌదీ విదేశాంగ మంత్రి, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో శనివారం ఫోన్‌లో మాట్లాడారు'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్, నేపాల్‌లో..
బంగ్లాదేశ్‌కు చెందిన ఇంగ్లిష్ న్యూస్‌పేపర్ 'ది డైలీ స్టార్' ఇలా రాసింది, ''గత మూడు దశాబ్దాల్లో రెండు దక్షిణాసియా దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన పోరాటమిది. పూర్తిస్థాయి యుద్ధంగా మారేంత ప్రమాదకరంగా ఉంది'' అని రాసింది.
''అణ్వాయుధాలపై తమ అత్యున్నత విభాగం సమావేశం కానున్నట్లు పాక్ సైన్యం చెప్పడం అణ్వాయుధ దాడి ప్రమాదాన్ని పెంచింది'' అని పేర్కొంది.
కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్, పాకిస్తాన్ ప్రధాన మంత్రులను చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రశంసించారని డైలీ స్టార్ మరో కథనంలో తెలిపింది.
''భారత్, పాకిస్తాన్‌కు మధ్యవర్తిత్వం వహించడంపై డోనల్డ్ ట్రంప్‌కు యూనస్ ధన్యవాదాలు తెలిపారు.''
మరోవైపు, ''రాబోయే రోజుల్లో సింధు జలాల ఒప్పందం గురించి విస్తృత చర్చ జరుగుతుందని సౌత్ ఏషియా సెంటర్‌లోని అట్లాంటిక్ కౌన్సిల్‌లో ఫెలో షుజా నవాజ్ అన్నారు. ఇది ఎవరికి వారు క్రెడిట్ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది'' అని నేపాల్ వార్తాపత్రిక కఠ్మాండూ పోస్ట్ రాసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














