వైభవ్ సూర్యవంశీ: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ కుర్రాడెవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాథ్యూ హెన్రీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 180-5(20 ఓవర్లు): మార్క్‌రమ్ 66 (45), బదోని 50(34), హసరంగ 2-31
రాజస్థాన్ రాయల్స్ 178-5(20ఓవర్లు): జైశ్వాల్ 74(52), అవేష్ 3-27
రెండు పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ గెలుపు
14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్‌గా మలచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతి చిన్నవయసు ఆటగాడిగా అవతరించాడు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చేతిలో రెండు పరుగుల తేడాతో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ, తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు.
మొత్తం 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
గత నెలలోనే సూర్యవంశీకి 14 ఏళ్లు వచ్చాయి. గత ఐపీఎల్ వేలంలో అతన్ని 1.1కోట్లరూపాయలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. బంతిని బలంగా బాదగల సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం అందించాడు.
తొమ్మిదో ఓవర్లో వైభవ్ స్టంప్డ్‌అవుట్‌గా వెనుదిరిగాడు.


ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్‌లో అతి చిన్న వయసు ఆటగాడిగా...
ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ద్వారా స్పిన్నర్ ప్రయాస్ రాయ్ బుర్మన్ పేరుతో ఉన్న రికార్డును తన పేరుకు మార్చుకున్నాడు వైభవ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 2019లో ప్రయాస్ రాయ్ ఓ మ్యాచ్ ఆడాడు. అప్పుడు అతని వయసు 16 ఏళ్ల 154రోజులు. ఐపీఎల్‌లో అతి చిన్న వయసు ఆటగాడిగా ఇప్పటిదాకా అతనే ఉన్నాడు. ఇప్పుడా రికార్డు సూర్యవంశీ సొంతమయింది.
జైశ్వాల్‌తో కలిసి సూర్యవంశీ చేసిన బ్యాటింగ్‌తో రాజస్థాన్ 181 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. యశస్వి జైశ్వాల్ 74 పరుగులు చేశాడు.
అయితే 18వ ఓవర్ ప్రారంభంలో జైశ్వాల్ అవుటవ్వడంతో కథ మారిపోయింది. మ్యాచ్‌లో గెలవాలంటే చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా లఖ్‌నవూ బౌలర్ అవేశ్, రాజస్థాన్ జట్టు ఆశలను అడ్డుకున్నాడు.
గెలవాలంటే చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా, 178 పరుగులు వద్ద చివరి బంతికి వికెట్ కోల్పోయి ఓటమి పాలయింది రాజస్థాన్.

ఫొటో సోర్స్, Getty Images
వైభవ్ సూర్యవంశీ ఎవరు?
గత ఏడాది వేలానికి సంతకం చేయడం ద్వారా ఐపీఎల్‌లో అతి చిన్న వయసు ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు.
13 ఏళ్ల వయసులో భారత అండర్ -19 జట్టు తరఫున చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా గత అక్టోబరులోనే సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. ఆ మ్యాచ్‌లో 58 బంతుల్లో సెంచరీ చేశాడు.
గత ఏడాది ఆసియా కప్ సాధించిన అండర్ -19 జట్టులో కూడా సూర్యవంశీ ఉన్నాడు. ఆసియా కప్‌లో అతను 44 సగటుతో 176 పరుగులు చేశాడు.
బిహార్‌కు చెందిన సూర్యవంశీ ఆ రాష్ట్రం తరఫునే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. గత జనవరిలో 12 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడాడు.
బిహార్ తరఫున ఐదు రంజీ ట్రోఫీల్లో ఆడిన సూర్యవంశీ 100 పరుగులు చేశాడు. రంజీల్లో అతని అత్యుత్తమ స్కోరు 41.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














