డబ్ల్యూపీఎల్: మహిళా క్రికెట్ ప్రపంచ కప్‌పై టీమిండియా ఆశలను పెంచిన సీజన్

హర్లీన్ డియోల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హర్లీన్ డియోల్ ఈ సీజన్‌లో ఆకట్టుకుంది.
    • రచయిత, ప్రవీణ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఇది మాకు మరో మంచి సీజన్ కానీ, మేం ఆ లైన్ దాటలేకపోయాం"...మహిళల ప్రీమియర్ లీగ్‌ ఫైనల్ అనంతరం దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ వ్యాఖ్యలివి.

డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో సీజన్‌లోనూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది కానీ, ఫైనల్‌లో ఓడింది. ముంబయి ఇండియన్స్ రెండోసారి కప్ కైవసం చేసుకుంది.

ఈ సీజన్ డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన 10 మందిలో భారత ప్లేయర్లు నలుగురు ఉన్నారు. ఇది భారత మహిళా క్రికెట్ జట్టుకు శుభపరిణామం. ఈ ఏడాది చివర్లో ఇండియాలో మహిళల వన్డే ప్రపంచ కప్ ఉంది.

అంతేకాదు, షెఫాలీ వర్మ ఫామ్‌లోకి తిరిగి రావడంతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెప్టెన్సీ‌తో, బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. రిచా ఘోష్, హర్లీన్ డియోల్ స్థిరమైన ఆట తీరు కూడా భారత మహిళా క్రికెట్‌కు బలాన్నిచ్చింది. అంతేకాదు, కాశ్వి గౌతమ్, ప్రియా మిశ్రాల రూపంలో భారత జట్టుకు కొత్త స్టార్లు దొరికారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హర్మన్‌ప్రీత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హర్మత్ ప్రీత్ కౌర్ కీలక ఇన్నింగ్స్ ఆడారు.

హర్మన్‌ప్రీత్ ఫామ్

ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి, ముంబయి ఇండియన్స్ 6 ఓవర్లలో 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

కానీ, హర్మన్‌ప్రీత్ వేగంగా పరుగులు చేసి, జట్టుపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించింది. 44 బంతుల్లో 66 పరుగులు చేయడంతో ముంబయి జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది.

ముంబయి ఇండియన్స్‌ జట్టును రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ కీలకం. అంతేకాదు, ఈ సీజన్ అంతా హర్మన్‌ప్రీత్ మంచి ఫామ్‌లో ఉంది. 10 మ్యాచ్‌ల్లో 33 సగటు, 155 స్ట్రైక్ రేట్‌తో 302 పరుగులు చేసిందామె.

షెఫాలి వర్మ

ఫొటో సోర్స్, Getty Images

షెఫాలీ పునరాగమనం

ఫామ్ కోల్పోవడంతో షెఫాలి వర్మ గత ఏడాది నవంబర్‌లో భారత జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆమె భారత జట్టుకు ఆడిన చివరి 10 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు.

అయితే, జట్టు నుంచి తొలగించిన తర్వాత ఆమె దేశీయ క్రికెట్‌లో పాల్గొని, రాణించింది. సీనియర్ మహిళల వన్డే చాలెంజర్ ట్రోఫీలో 97 సగటుతో 388 పరుగులు చేసింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ షెఫాలీనే.

ఇక మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ ఆమె ఆకట్టుకుంది. 9 మ్యాచ్‌ల్లో 153 స్ట్రైక్ రేట్‌తో 304 పరుగులు చేసింది.

షెఫాలి స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రతీకా రావల్ భారత్ తరఫున ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో ప్రత్యేక ముద్ర వేసింది. అదే సమయంలో షెఫాలి ఫామ్‌లోకి తిరిగి రావడం భారత మహిళా క్రికెట్ జట్టుకు మంచి సంకేతం.

కాశ్వి గౌతమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాశ్వి గౌతమ్ 9 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టింది.

కాశ్వి, ప్రియా మిశ్రా

ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆందోళన కలిగించే విషయం. దీనితో పాటు, ఆల్ రౌండర్ అరుంధతి రెడ్డి కూడా ఫామ్‌లో లేదు.

కానీ, ఈ సీజన్‌లో భారత జట్టుకు మరో కొత్త ప్లేయర్ దొరికారు. ఆమె పేరు కాశ్వి గౌతమ్. బౌలింగ్‌లో రాణించడమే కాదు, బ్యాట్‌తోనూ తనదైన ముద్ర వేసింది కాశ్వి గౌతమ్. 9 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె ఎకానమీ రేటు 6.45. ఈ సీజన్‌లో ఎకానమీ రేటులో రెండో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచింది కాశ్వి.

ఇక, 20 ఏళ్ల ప్రియా మిశ్రా ఈ సీజన్‌లో లెగ్ స్పిన్‌తో ఆకట్టుకుంది. ఆమె 9 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీసింది. ప్రియా మిశ్రా గూగ్లీ కూడా ఈ సీజన్‌లో చర్చకు వచ్చింది.

రాబోయే రోజుల్లో భారత క్రికెట్ జట్టు తరపున ఆడే సామర్థ్యం తనకు ఉందని ఆమె చూపించింది.

దీప్తి శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దీప్తి శర్మ ఈ సీజన్‌లో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఉన్నారు.

ఆందోళనలూ ఉన్నాయి..

గత కొన్ని సంవత్సరాలుగా హర్లీన్ డియోల్ భారత క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్. అయితే, ఆమె ఆటలో స్థిరత్వం లేదు. కానీ ఈ సీజన్‌లో, హర్లీన్ దాదాపు 39 సగటుతో 232 పరుగులు చేసింది. ఇది భారత మహిళా క్రికెట్ జట్టుకు ఉపశమనం కలిగించే విషయం. మరోవైపు, రిచా ఘోష్ 8 మ్యాచ్‌ల్లో 38 సగటు, దాదాపు 175 స్ట్రైక్ రేట్‌తో 230 పరుగులు చేసింది.

అయితే, ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఆందోళన నెలకొంది. శిఖా పాండే 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు, రేణుకా ఠాకూర్ 7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టారు. ఇంకా, ఫాస్ట్ బౌలింగ్‌లో భారత జట్టు మ్యాచ్ విన్నర్ల కోసం వెతకాల్సి ఉంది. దీనితో పాటు, భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కూడా తన జట్టును ఎక్కువగా విజయతీరాలకు చేర్చలేకపోయింది. ఆమె 8 మ్యాచ్‌ల్లో కేవలం 24.62 సగటుతో 197 పరుగులు మాత్రమే చేసింది.

భారత మహిళా క్రికెట్ జట్టులో నంబర్ వన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ, గత సంవత్సరం మహిళల ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన ఆల్ రౌండర్. దీంతో ఈ సీజన్‌లో ఆమెను యూపీ వారియర్స్ కెప్టెన్‌గా నియమించింది ఫ్రాంచైజీ. కానీ, దీప్తి తన కెప్టెన్సీతో ప్రభావం చూపలేకపోయింది. ఆమె జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 15 బ్యాటర్లలో లేదా అత్యధిక వికెట్లు తీసిన టాప్ 15 బౌలర్లలో దీప్తి పేరు లేకపోవడం భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)