రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ దిల్లీ క్యాపిట్సల్ : సూపర్ ఓవర్‌లో స్టార్క్ చేసిన మాయాజాలం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభిజిత్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ కోసం
రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌తో తేల్చాల్సి వచ్చింది.
నిర్ణీత 20ఓవర్లు ముగిసే సరికి రెండు జట్ల స్కోరు సమం కావడంతో సూపర్ ఓవర్‌తో మ్యాచ్ ఫలితాన్ని నిర్థరించారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ 188 పరుగులు చేసింది.
189 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేసింది.
ఇక చివరి ఓవర్‌లో 9 పరుగులు చేస్తే విజయం రాజస్థాన్ ఖాతాలో పడుతుంది. ఇంకా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఆరు బంతులు, 9 పరుగులు అనే సమీకరణ ఐపీఎల్‌లో పెద్ద లెక్కే కాదు.
దీంతో రాజస్థాన్ విజయం లాంఛనమే అనుకున్నారు అంతా. అందుకే రాజస్థాన్ రాయల్స్ కోచ్, డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్ల ముఖాల నవ్వుల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది.
ఇక్కడే దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఐపీఎల్ చరిత్రలో అద్భుతమే చేశాడు.


ఫొటో సోర్స్, Getty Images
చివరి ఓవర్‌లో ఏమైంది?
చివరి ఓవర్ బౌలింగ్ బాధ్యతను అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్ మిచెల్ స్టార్క్‌కు అప్పగించాడు అక్షర్ పటేల్.
టీ20ల్లో 902 డెత్ ఓవర్లు వేసి 94వికెట్లు తీసిన అనుభవమున్న స్టార్క్ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ 20వ ఓవర్‌ను యార్కర్‌తో మొదలుపెట్టాడు.
20వ ఓవర్ తొలి బంతిని ఎదుర్కొంటోంది విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టిందిపేరైన షిమ్రన్ హెట్మెయర్. కానీ స్టార్క్ యార్కర్‌కు అతను ఒకే ఒక్క పరుగు చేయగలిగాడు.
రెండో బంతి ధ్రువ్ జురేల్ ఎదుర్కొన్నాడు. అతను కూడా కేవలం ఒక్క పరుగే చేశాడు.
స్టార్క్ వేసిన మూడో బంతిని హెట్మెయర్ డీప్ కవర్‌లోకి నెట్టి స్కోరు బోర్డుపై రెండు పరుగులు పెంచాడు.
నాలుగో బంతికి రెండు పరుగులు, ఐదో బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చాయి.
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలవాలంటే చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి.
స్టార్క్ మళ్లీ యార్కర్ సంధించాడు. ధ్రువ్ జురేల్ దాన్ని డీప్ మిడ్‌వికెట్ మీదకు ఆడాడు.
ఒక్క పరుగు తేలిగ్గా పూర్తయింది. రెండో పరుగుకు ప్రయత్నిస్తూ అతను రనౌట్ అయ్యాడు.
దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి.
దీంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ ఓవర్ ఉత్కంఠ...
సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
దిల్లీ క్యాపిటల్స్ తరఫున మళ్లీ బౌలింగ్ బాధ్యత స్టార్క్ తీసుకున్నాడు.
హెట్మెయర్, రియాన్ పరాగ్‌ను రాజస్థాన్ బ్యాటింగ్‌కు పంపింది.
గంటకు 142కిలోమీటర్ల వేగంతో స్టార్క్ మొదటి బంతి సంధించాడు.
ఈ బంతికి హెట్మెయర్ పరుగు చేయలేకపోయాడు.
కానీ తర్వాతి బంతికి అతను డీప్ మిడ్ వికెట్, లాంగాన్ మీదగా అద్భుతమైన ఫోర్ కొట్టాడు.
మూడో బంతికి హెట్మెయర్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు.
నాలుగో బంతికి రియాన్ పరాగ్ నాలుగు పరుగులు చేశాడు.
తర్వాత బంతి నో బాల్
రాజస్థాన్‌కు ఫ్రీ హిట్ లభించింది కానీ అది ఉపయోగపడలేదు.
ఆ బంతికి రియాన్ పరాగ్ రనవుట్ అయ్యాడు.
తర్వాత యశస్వి జైశ్వాల్ క్రీజులోకి వచ్చాడు.
ఐదో బంతిని హెట్మెయర్ డీప్ మిడ్ వికెట్ మీదగా మళ్లించి రెండు పరుగులు రాబట్టాడు.
కానీ యశస్వి జైశ్వాల్ తిరిగి క్రీజులోకి రాలేకపోయాడు..స్టార్క్ స్టంప్స్ గిరాటేశాడు.
సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐదు బంతులు మాత్రమే ఆడి రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది.
నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఔటయితే ఇన్నింగ్స్ ముగుస్తుంది.
తర్వాత దిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. కేఎల్ రాహుల్‌ని, ట్రిస్టన్ స్టబ్స్‌ని అక్షర్ పటేల్ క్రీజులోకి పంపాడు.
సూపర్ ఓవర్ బౌలింగ్ బాధ్యతను రాజస్థాన్ సందీప్ శర్మకు అప్పగించింది.
తొలి బంతికి కేఎల్ రాహుల్ రెండు పరుగులు చేశాడు. రెండో బంతికి నాలుగు, మూడో బంతికి ఒక పరుగు చేశాడు. అప్పటికి ఏడు పరుగులొచ్చాయి. మ్యాచ్ గెలవాలంటే ఇంకో ఐదు పరుగులు మాత్రమే కావాలి.
నాలుగో బంతి ఆడడానికి స్టబ్స్ క్రీజులో ఉన్నాడు. సందీప్ శర్మ షార్ట్ బాల్ సంధించాడు. మిడ్ వికెట్ మీదగా స్టబ్స్ బలంగా సిక్సర్ కొట్టాడు.
కేవలం నాలుగు బంతుల్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ కలిసి సూపర్ ఓవర్‌లో విజయానికి కావాల్సిన పరుగులు అందించారు.
తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా జట్టును అనేక మ్యాచ్‌ల్లో గెలిపించిన మిచెల్ స్టార్క్ బుధవారం రాత్రి(ఏప్రిల్ 16) అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించాడు.
లాస్ట్ ఓవర్, సూపర్ ఓవర్ బౌలింగ్‌కు ముందు అతను మ్యాచ్ మొత్తంలో యార్కర్‌తో నితిశ్ రానా వికెట్ ఒక్కటే తీశాడు. కానీ సూపర్ ఓవర్‌తో మ్యాచ్‌ను దిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో వేశాడు.
మ్యాచ్‌ను మలుపుతిప్పిన స్టార్క్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది.
స్టార్క్ ఏం చెప్పాడు?
''నేను నా ప్రణాళిక ప్రకారం ఆడా. మనసులో ఏం పెట్టుకోకుండా ప్రణాళిక ప్రకారం ఆడాలని నిర్ణయించుకున్నా. అన్ని సార్లు మన ప్లాన్స్ వర్కవుట్ కావు. కానీ ఇవాళ టైం నాకు అనుకూలంగా ఉంది'' అని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటూ స్టార్క్ చెప్పాడు.
''నేను చాలా ఏళ్లగా ఆడుతున్నా. తర్వాత నేనేం చేయబోతున్నానన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. అదే పరిస్థితిని పదిసార్లు పునరావృతం చేసినా...ప్రతిసారీ భిన్నమైన ఫలితం రావడమే ఈ ఆటలో ఉన్న అద్భుతం. నిజాయితీగా చెప్పాలంటే ఇవాళ కొంచెం అదృష్టం కూడా కలిసొచ్చింది. నో బాల్ తర్వాత ఫ్రీ హిట్ నాకు అనుకూలించింది'' అని స్టార్క్ అన్నాడు.
స్టార్క్ చెప్పింది అక్షర సత్యం. కొన్నిరోజుల క్రితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతను ఒక్క ఓవర్‌లో 30 పరుగులిచ్చాడు. అంతేకాదు..ఈ మ్యాచ్ తొలి ఓవర్లలోనూ యశస్వి అతని బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ ఓవర్ల చాంపియన్ దిల్లీ
ఐపీఎల్ సూపర్ ఓవర్ల మ్యాచ్‌ల్లో ఎక్కువసార్లు గెలుపొందిన జట్టుగా దిల్లీ క్యాపిటల్స్‌కు రికార్డు ఉంది.
ఐపీఎల్‌లో దిల్లీ జట్టు ఐదు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు ఆడింది.
వాటిలో నాలుగుసార్లు గెలుపొందింది.
2009 ఐపీఎల్‌లో తొలిసారి సూపర్ ఓవర్ ఆడించారు. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది.
2020లో రికార్డు స్థాయిలో నాలుగు మ్యాచ్‌ల ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చాల్సి వచ్చింది.
2021 వరకు ఐపీఎల్‌లో 14 సూపర్ ఓవర్లు నమోదయ్యాయి. కానీ గత మూడు సీజన్లగా సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి రాలేదు.
నాలుగేళ్ల తర్వాత ఉత్కంఠ భరితంగా సాగిన దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వేదికైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














