HCU: ఇందిరా గాంధీ చొరవతో, సరోజినీ నాయుడు ఇంట్లో ఈ యూనివర్సిటీ ఎలా ప్రారంభమైందంటే..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, uohyd.ac.in

ఫొటో క్యాప్షన్, 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ యూనివర్సిటీ స్థాపన వెనుక ఉద్యమ చరిత్ర ఉందని చెప్పాలి.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భూముల వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది.

భూములను అభివృద్ధి చేసి వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆ భూములు యూనివర్సిటీకే ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

భూముల వివాదంతో వార్తల్లోకెక్కిన ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడు, ఎలా ఏర్పాటైంది? ఎందుకు ఏర్పాటు చేశారు? దీని పేరు మార్పు ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చాయి? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'సిక్స్ పాయింట్ ఫార్ములా' నుంచి పుట్టి..

'విద్యతోనే విముక్తి'' - ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్‌సైట్లో కనిపించే నినాదం.

50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ యూనివర్సిటీ స్థాపన వెనుక ఉద్యమ చరిత్ర ఉందని చెప్పాలి.

1972-73లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం యూనివర్సిటీ ఏర్పాటుకు పునాది వేసింది.

జై ఆంధ్ర ఉద్యమాన్ని శాంతింపజేసే ఉద్దేశంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల ప్రణాళిక (సిక్స్ పాయింట్ ఫార్ములా)ను తీసుకొచ్చారు.

ఈ ఆరుసూత్రాల ప్రణాళికలో రెండో పాయింట్ విద్యాపరమైన అవకాశాలకు సంబంధించిందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యుడు ఇ.వెంకటేశు బీబీసీతో చెప్పారు.

''ఉన్నత విద్యాసంస్థల్లో స్థానికులకు ప్రవేశాల విషయంలో ప్రాధాన్యం కల్పించాలి. రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి'' అని రెండో పాయింట్‌గా చేర్చారని ఆయన చెప్పారు.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం
ఫొటో క్యాప్షన్, సిక్స్ పాయింట్ ఫార్ములాను తీసుకొచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించారని మాజీ ఆచార్యులు హరగోపాల్ చెప్పారు.

1973 డిసెంబర్ 23న రాజ్యాంగానికి 32వ సవరణ ద్వారా ఆర్టికల్ 371(ఇ)ను చేర్చుతూ అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. యూనివర్సిటీని హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించింది.

1974 సెప్టెంబర్ 3న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చట్టం తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.

ఇందిరా గాంధీ వ్యక్తిగతంగా శ్రద్ధ, చొరవ తీసుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగేలా చూశారని హెచ్‌సీయూ మాజీ ఆచార్యులు జి.హరగోపాల్ బీబీసీకి చెప్పారు.

సిక్స్ పాయింట్ ఫార్ములాను తీసుకొచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించారని ఆయనన్నారు.

అయితే, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుతో తొలినాళ్లలో పెద్దగా ప్రయోజనం దక్కకపోయినా, రానురాను తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సీట్ల విషయంలో ప్రాధాన్యం లభించిందని మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ న్యాయవాది రాంచందర్ రావు బీబీసీతో చెప్పారు.

''హెచ్‌సీయూలో కోర్సుల సంఖ్య పెరిగే కొద్దీ ఇక్కడి విద్యార్థులకు కొంతమేర ప్రయోజనం కలుగుతోంది. అడ్మిషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా జరిగేది కావడంతో అన్ని రాష్ట్రాల విద్యార్థులు వస్తున్నారు'' అని చెప్పారు.

యూనివర్శిటీ

ఫొటో సోర్స్, uohyd.ac.in

ఫొటో క్యాప్షన్, గచ్చిబౌలి ప్రాంతంలో 2,324 ఎకరాలను యూనివర్సిటీ కోసం కేటాయించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.

సరోజినీ నాయుడు ఇంటి నుంచి ప్రస్థానం ప్రారంభం ..

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌‌నే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా పిలుస్తుంటారు.

1974 అక్టోబర్ 2న, ఆబిడ్స్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్ భవనంలో హ్యుమానిటీస్ సబ్జెక్టులతో యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి.

ఈ భవనం ప్రముఖ స్వాత్రంత్య సమరయోధురాలు సరోజినీ నాయుడి ఒకప్పటి నివాసం.

''గోల్డెన్ త్రెషోల్డ్ భవనాన్ని సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ కాలంలో నిర్మించారు. సరోజినీ నాయుడుకు గుర్తుగా ఆమె కుమార్తె పద్మజానాయుడు ఈ భవనాన్ని యూనివర్సిటీ కోసం ఇచ్చారు'' అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చ్యువల్ లెర్నింగ్ (సీడీవీఎల్) డైరెక్టర్ డాక్టర్ ప్రొ.ఎస్.జిలానీ బీబీసీతో చెప్పారు.

సీడీవీఎల్ ఇప్పటికీ గోల్డెన్ త్రెషోల్డ్ భవనం ఆవరణలోనే కొనసాగుతోంది.

సరోజినీ నాయుడు, నివాసం

ఫొటో సోర్స్, FB/gtuoh

ఫొటో క్యాప్షన్, గోల్డెన్ త్రెషోల్డ్ అనేది ఒకప్పటి సరోజినీ నాయుడు నివాసం

భవిష్యత్ దృష్ట్యా 2 వేలకు పైగా ఎకరాలు..

1975లో గచ్చిబౌలి ప్రాంతంలో 2,324 ఎకరాలను యూనివర్సిటీ కోసం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ భవనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీని గచ్చిబౌలికి తరలించారు.

''మొదట మెహిదీపట్నం వద్ద డిఫెన్స్ పరిధిలో ఉన్న భూములు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. కానీ, యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ విస్తీర్ణం ఉండాలని అప్పటి ఉపకులపతి గురుభక్ష్ సింగ్ అడిగారు.

ఆయన గట్టిగా పట్టుబట్టడంతో గచ్చిబౌలిలో భూములు ఇచ్చేందుకు ప్రభుత్వాలు అంగీకరించాయి'' అని బీబీసీతో చెప్పారు ప్రొఫెసర్ హరగోపాల్.

ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా గుర్తింపు దక్కాలంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండాలని నాటి అధికారులు భావించారని ఆయన వివరించారు.

మరోవైపు, యూనివర్సిటీని ప్రారంభించిన గోల్డెన్ త్రెషోల్డ్ భవనాన్ని సరోజినీ నాయుడు గుర్తుగా రూ.3 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని ప్రొఫెసర్.ఎస్.జిలానీ చెప్పారు.

హైదరాబాద్, యూనివర్సిటీ
ఫొటో క్యాప్షన్, క్యాంపస్‌లో పెద్దసంఖ్యలో చెట్లు, పచ్చదనం కనిపిస్తుంది.

జాతీయ స్థాయి ప్రాభవం.. జీవ వైవిధ్యం..

యాభై ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 5వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

సుమారు 400 మందికిపైగా బోధన సిబ్బంది, దాదాపు 1200 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు.

విశాలమైన ప్రాంగణం కావడంతో క్యాంపస్‌లో పెద్దసంఖ్యలో చెట్లు, పచ్చదనం కనిపిస్తుంది.

ఇక్కడ జింకలు, నెమళ్ల వంటి వన్యప్రాణులతోపాటు పది రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు, 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు కనిపిస్తుంటాయని యూనివర్సిటీ ప్లాంట్, యానిమల్ సైన్సెస్ విభాగం చెబుతోంది.

యూనివర్సిటీకి 2019లో కేంద్ర ప్రభుత్వం ఎమినెన్స్ హోదాను ఇచ్చింది. భారత్‌లో ఎమినెన్స్ హోదా దక్కించుకున్న అతికొద్ది ఉన్నత విద్యాసంస్థల్లో హెచ్‌సీయూ ఒకటి.

దీనివల్ల వర్సిటీ అభివృద్ధికి కేంద్రం నుంచి అదనపు నిధులు అందుతున్నాయి.

పోస్టుగ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోందీ యూనివర్సిటీ.

ప్రస్తుతం యూనివర్సిటీ ఎంతో వైవిధ్యంతో నిండి ఉందని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇ.వెంకటేశు బీబీసీకి చెప్పారు.

''కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు.. అన్ని ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.

జాతీయ స్థాయి గుర్తింపు సాధించడంతో అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడ చేరడానికి పోటీపడుతున్నారు'' అని ఆయన అన్నారు.

అయితే, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ వంటి ప్రపంచస్థాయి గుర్తింపు విషయంలో హెచ్‌సీయూ ఇంకా వెనుకబడి ఉంటోందని విద్యార్థులు చెబుతున్నారు.

''మా యూనివర్సిటీ ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీపడే విషయంలో వెనుకబడి ఉందని చెప్పాలి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఇంకా 801-850 శ్రేణిలోనే ఉంది'' అని హెచ్‌సీయూ విద్యార్థి సంఘం నాయకుడొకరు బీబీసీతో అన్నారు.

హైదరాబాద్
ఫొటో క్యాప్షన్, యూనివర్సిటీకి కేటాయించిన భూములన్నీ ప్రభుత్వ భూములుగానే ఇప్పటికీ ఉన్నాయి.

భూముల వివాదమేంటి?

గచ్చిబౌలిలో యూనివర్సిటీ కోసం భూములు కేటాయించి 50 ఏళ్లవుతున్నా.. నేటికీ అవి యూనివర్సిటీ పేరు మీద లేవు.

అప్పట్లో భూములు కేటాయిస్తూ వాటిని విద్య, పరిశోధన అవసరాల కోసం కేటాయించాలని ప్రభుత్వం నిబంధన విధించింది.

అయితే, భూ రికార్డుల్లో మ్యుటేషన్ (బదలాయిపు) జరగలేదని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.

రెవెన్యూ రికార్డుల ప్రకారం, యూనివర్సిటీకి కేటాయించిన భూములన్నీ ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి.

యూనివర్సిటీ పేరుతో భూములు లేకపోవడంతో ప్రభుత్వం దఫదఫాలుగా భూములు వెనక్కి తీసుకుందని అధికారులు చెబుతున్నారు.

''ట్రిపుల్ ఐటీ, గచ్చిబౌలి స్టేడియం, ఆర్టీసీ డిపో, షూటింగ్ రేంజ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, టీఐఎఫ్ఆర్, ఎన్ఐఏబీ.. ఇలా వివిధ సంస్థలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనివల్ల హెచ్‌సీయూ భూములు తరిగిపోతున్నాయి'' అని ప్రొఫెసర్లు చెబుతున్నారు.

''హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూములు యూనివర్సిటీకే ఉంచాలి. మిగిలిన భూములన్నీ యూనివర్సిటీ పేరుతో బదలాయించాలి'' అని కోరారు సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి.

హెచ్‌సీయూ పేరుతో భూముల టైటిల్ మార్చాలని గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ ముందుకు సాగలేదని చెప్పారు ఫ్రొఫెసర్ హరగోపాల్.

''ప్రభుత్వం, యూనివర్సిటీ – ఈ రెండూ వేర్వేరు కాదని అనుకున్నారు. అమ్మ తన బిడ్డలకు ఇచ్చిన వస్తువులను వెనక్కి తీసుకుంటుందని ఎవరైనా అనుకుంటారా? అలాగే ప్రభుత్వం ఇచ్చిన భూములు మళ్లీ తీసుకుంటుందని ముందుగా అనుకోలేదు. అందుకే యూనివర్సిటీకి భూములు బదలాయించే విషయంలో వర్సిటీ అధికారులు గట్టిగా పట్టుదల ప్రదర్శించలేదు'' అన్నారాయన.

ఇప్పటికైనా భూములకు హెచ్‌సీయూ పేరుతో టైటిల్ మార్చాలని ఆయన సూచిస్తున్నారు.

400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ భూమి గతంలో ఇచ్చిన హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో తమకే చెందుతుందనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ప్రస్తుతం ఈ 400 ఎకరాల భూములకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

గెజిట్

ఫొటో సోర్స్, UoH

ఫొటో క్యాప్షన్, యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని 2020లో, అప్పటి సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు.

పీవీ పేరు పెట్టాలనే ప్రతిపాదన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది.

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా 2020 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

'పీవీ నరసింహారావు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్' అని పేరు మార్చాలని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హెచ్‌సీయూ, తెలంగాణ

ఫొటో సోర్స్, uohyd.ac.in

ఇదీ విభాగాల వారీగా ప్రస్థానం

1974 – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చట్టం

1975 – గచ్చిబౌలిలో భూముల కేటాయింపు

1976 – స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రారంభం

1977 – స్కూల్ ఆఫ్ కెమిస్ర్టీ, ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్ విభాగాల ఏర్పాటు

1978 – స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, సోషల్ సైన్సెస్ విభాగాల ఏర్పాటు

1988 – సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రారంభం

1999- స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్

2007 - స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

2008 – స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ విభాగం

2012 – స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్

2013 - స్కూల్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ విభాగం ఆరంభం

ఇవి కాకుండా నానో టెక్నాలజీ, కాగ్నిటివ్ సైన్సెస్, సైకాలజీ, జానపద కళల అధ్యయనం సహా 17 పరిశోధన కేంద్రాలు పనిచేస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)