పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ కారణంగానే విద్యార్థులు జేఈఈ పరీక్ష రాయలేక పోయారా, విశాఖలో ఏం జరిగింది?

జేఈఈ మెయిన్స్ పరీక్షకు ఆలస్యమైన విద్యార్థులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కుమారుడు పరీక్ష రాయలేకపోయినందుకు తల్లి రోదన
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణంగా జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయలేకపోయామని కొందరు అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న వీడియోలు సోమవారం (ఏప్రిల్ 7) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పెందుర్తిలోని చినముషిడివాడ ప్రాంతంలో ఉన్న అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోవడానికి పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలే కారణమని కొందరు తల్లిదండ్రులు ఆక్రోశం వెలిబుచ్చారు.

మంగళవారం జేఈఈ పరీక్ష చివరి రోజు. సోమవారం పరీక్ష రాయలేకపోయినవారికి మంగళవారమైనా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌లను కోరుతున్నారు.

అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో రెండు రోజులు పర్యటన కోసం పవన్ కల్యాణ్ సోమవారం ఉదయం విశాఖ వచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ వల్ల పరీక్ష రాయలేకపోయామని దాదాపు 30 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ కారణంగా కొందరు జేఈఈ మెయిన్స్ అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారని వస్తున్న వార్తల్లోని నిజానిజాలను తేల్చేందుకు విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్‌ ఆదేశించినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

మరి విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడానికి పవన్ కల్యాణ్ కాన్వాయే కారణమా? జేఈఈ పరీక్ష కేంద్రం వైపే పవన్ కల్యాణ్ కాన్వాయ్ వెళ్తుందని తెలిసిన పోలీసులు అటు పరీక్ష రాసే విద్యార్థులు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయలేకపోయారా? ఈ విషయంలో తల్లిదండ్రులు, పోలీసులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేసి బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌‌లో చేరండి
పెందుర్తిలో ట్రాఫిక్ ఆంక్షలు

ఫొటో సోర్స్, UGC

''ట్రాఫిక్ దాటుకొని వచ్చేసరికి 2 నిమిషాలు ఆలస్యమైంది''

ట్రాఫిక్ నిబంధనల కారణంగా తమకు 2 నిమిషాలు ఆలస్యమైందని, దీంతో తన కూతుర్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదని బీబీసీతో పేరెంట్ అనిల్ చెప్పారు.

జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థి హాసిని తండ్రి అనిల్. టూవీలర్‌పై హాసినిని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారాయన.

"పరీక్షా కేంద్రానికి ఉదయం 8:30 గంటల్లోపే చేరుకునేలా మేం బయల్దేరాం. కానీ, సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టూర్ ఉందని, పెందుర్తి మీదుగా ఆయన కాన్వాయ్ వెళ్తుందంటూ ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వచ్చే మార్గం అంతా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాటిని దాటుకుంటూ వచ్చేసరికి రెండు నిముషాలు ఆలస్యమైంది. దీంతో మా అమ్మాయిని పరీక్ష రాయనివ్వలేదు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోతే ముందుగానే చేరుకునేవాళ్లం." అని బీబీసీతో అనిల్ అన్నారు.

పరీక్షా కేంద్రం అయాన్ డిజిటల్

ఫొటో సోర్స్, UGC

కష్టం అంతా వృథా అంటూ రోదనలు

పరీక్ష రాయనివ్వకపోవడంతో తన కుమారుడు నష్టపోవాల్సి వస్తుందంటూ యశ్వంత్ అనే అభ్యర్థి తల్లి ఏడుస్తున్న వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

"పవన్ కల్యాణ్ కాన్వాయ్ వల్ల ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం. అయినా రెండు నిమిషాలే ఆలస్యంగా వచ్చాం. ఈ విషయం ఎంత చెప్పినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు" అని యశ్వంత్ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ మీడియాతో మాట్లాడారు.

దూరప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు ఉదయం 3 గంటలకు బయలుదేరామని, ఎన్ఏడీ కొత్తరోడ్డు వరకు బాగానే చేరుకున్నప్పటికీ తర్వాత ట్రాఫిక్ ఆంక్షల కారణంగా పరీక్ష కేంద్రానికి రెండు నుంచి ఆరు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నామని కొందరు తల్లిదండ్రులు చెప్పారు.

విలేఖరుల సమావేశంలో పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు ఏమన్నారంటే..

పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ కారణంగా చాలామంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారంటూ వచ్చిన వార్తలపై విశాఖ పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

"పరీక్ష కేంద్రం వద్ద ఉదయం 7 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ 8.30 గంటల తర్వాత రావడం వల్ల మాత్రమే వారు పరీక్షలు రాయలేకపోయారు. 8:30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించరు. ఉదయం 8:28 నిమిషాలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెందుర్తికి వచ్చేసరికి 8.40 దాటింది. ఎన్‌ఏడీ కొత్తరోడ్డు జంక్షన్ నుంచి పెందుర్తి వచ్చేంతవరకు బీఆర్టీఎస్ మధ్యలో ఉన్న రోడ్డు తప్ప మిగతా రెండు సర్వీస్ రోడ్లను ఎక్కడా ఆపలేదు. ట్రాఫిక్ నియంత్రణ వల్లే ఎగ్జామ్‌కు ఆలస్యమైందని విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పడం అవాస్తవం." అని ఏసీపీ పృథ్వీతేజ్ వివరణ ఇచ్చారు.

అయితే, ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలన్న విషయంలో పోలీసులు చెబుతున్న ప్రకటనలకు, వాస్తవానికి తేడా కనిపిస్తోంది. హాల్ టికెట్ మీద రాసిన ప్రకారం 7 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉందని పోలీసులు చెబుతుండగా, వాస్తవంలో మాత్రం 7 గంటల నుంచి 8.30 గంటల మధ్యలో రిపోర్టు చేయవచ్చు. అంతకు ముందుగానీ, ఆ తర్వాతగానీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

పోలీసులు మాత్రం 7 గంటలకు రిపోర్ట్ చేయాలని దీనికి భాష్యం చెబుతున్నారు.

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజు వివిధ కారణాలతో అభ్యర్థులు ఆలస్యంగా వస్తున్నారని, 7వ తేదీన ఇలా 61 మంది అభ్యర్థులు సకాలంలో రాలేకపోయారని పృథ్వీతేజ్ చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోలీసులు షేర్ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, UGC

పవన్ కల్యాణ్ దృష్టికి...

ఈ సంఘటనపై పవన్ కల్యాణ్ కార్యాలయం స్పందించి, ఒక ప్రకటన విడుదల చేసింది.

ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ కారణంగా కొందరు జేఈఈ మెయిన్స్ అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారని వస్తున్న వార్తల్లోని వాస్తవాలను అన్వేషించి విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఎంతసేపు నిలిపారు? పరీక్ష కేంద్రానికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ నియంత్రించారా? లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులను ఆదేశించినట్లు ఆ ప్రకటనలో చెప్పారు.

పవన్ కల్యాణ్ పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పార్టీ శ్రేణులు, నాయకులు కూడా క్రేన్ దండలు, ఇతర కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని ఈ ప్రకటనలో గుర్తు చేశారు.

విశాఖపట్నం పోలీసులు జారీ చేసిన ప్రకటన

ఫొటో సోర్స్, UGC

పరీక్షా సమయం ఏంటి? పరీక్షా కేంద్రం ఎక్కడ?

జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం గం. 9.30 నుంచి 12.00 వరకు ఉంటుంది. గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అంటే 8.30 గంటలు దాటితే పరీక్షా కేంద్రం లోపలకు అనుమతించరని హాల్ టిక్కెట్లపై ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పరీక్షకు 2 గంటలకు పరీక్ష కేంద్రంలో రిపోర్ట్ చేయాలి.

ఎయిర్‌పోర్టు నుంచి పెందుర్తి అయాన్ డిజిటల్ జోన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సోమవారం పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు పరీక్షలకు చివరి రోజైన మంగళవారం పరీక్ష రాసే అవకాశం కల్పించాలని విశాఖ జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు. నాగరాజు డిమాండ్ చేశారు.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, UGC

జేఈఈ పరీక్ష కేంద్రం వైపు పవన్ ఎందుకు వెళ్లారు?

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిశిఖర గ్రామాలను కలిపే రోడ్లకు శంకుస్థాపనతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, డుంబ్రిగూడ ఆశ్రమ పాఠశాలలో బహిరంగ సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

అయితే, ఎయిర్ పోర్టు నుంచి అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు పెందుర్తి మీదుగానే వెళ్లాలి. విశాఖ నగరం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. అంటే ఎన్ఏడీ కొత్తరోడ్డు నుంచి గోపాలపట్నం, వేపగుంట జంక్షన్, చినముషిడివాడ, పెందుర్తి, కొత్తవలస మీదుగా ఏజెన్సీలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతం వైపు వీఐపీలు, వీవీఐపీలు వెళ్లాల్సి వస్తే, పైన పేర్కొన్న దారంతా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు కూడా ఇదే దారిలో ఆయన కాన్వాయ్ వెళ్లింది.

బాధిత అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)