పిఠాపురం సభ: పవన్ కల్యాణ్ తన రూట్‌మ్యాప్ ఏంటో చెప్పేశారా?

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రాజకీయాలలో మార్పు సహజమని పవన్ కల్యాణ్ అన్నారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"చే గువేరా నుంచి సనాతన ధర్మం వైపు వెళ్లారంటూ నాకెవ్వరు సర్టిఫికేట్లు ఇవ్వనవసరం లేదు. మార్పు అనేక రకాలుగా ఉంటుంది. సనాతన ధర్మమంటే అందరికి మేలు జరగాలని కోరుకోవడమే." అని పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

రాజకీయ ప్రయాణంలో ఈ 11 ఏళ్లలో తాము నిలదొక్కుకున్నామనీ, అలాగే నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామంటూ పవన్ కల్యాణ్ తాను ఎంత బలమైన వ్యక్తినో చెప్పుకునే ప్రయత్నం చేశారు.

జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా టాక్ ఆఫ్ ది పిఠాపురంగా మారిన వారిలో ఒకరు పవన్ కల్యాణ్ కాగా, మరొకరు టీడీపీ నాయకుడు ఎస్పీఎస్‌ఎన్ వర్మ.

అలాగే సభలో ‘పవన్ విజయానికి కారణం తామేనని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ’ అంటూ జనసేన నాయకుడు నాగబాబు చేసిన కామెంట్‌తో పాటు, వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పీచ్ కూడా వైరల్ అయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరండ
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బీజేపీని వ్యతిరేకించే జర్నలిస్ట్ ఎంజే అక్బర్ బీజేపీ ఎంపీ కాగా లేనిది తాను మారితే తప్పేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు

మార్పు సహజం: పవన్ కల్యాణ్

Pawan Kalyan Changed…left, right and center అంటూ అవసరాలకు తగ్గట్టుగా మారిపోయే రాజకీయ నాయకుడిగా జాతీయ పత్రికలు తనను అభివర్ణించాయని, అయితే రాజకీయాల్లో మార్పు సహజమని పవన్ కల్యాణ్ అన్నారు.

"ప్రజలకు మంచి జరుగుతుందని భావించినపుడు మార్పు ముఖ్యమే. పారే నీరు అనేక మార్పులకు గురవుతుంది. అలాగే నేను కూడా ప్రజలకు ఉపయోగపడే క్రమంలో రాజకీయాల్లో మార్పు కోసం అడుగుపెట్టాను." అని అన్నారు.

"దిల్లీలో పని చేసే ఎంజే అక్బర్ అనే జర్నలిస్టు బీజేపీ వ్యతిరేక భావజాలంతో పుస్తకాలే రాసిన వ్యక్తి. 2014లో బీజేపీ నుంచి ఎంపీ అయ్యారు. బీజేపీని వ్యతిరేకించే ఎంజే అక్బర్ మారినప్పుడు నేను మంచి కోసం మారితే తప్పేంటి..? ఎదగడానికైనా, దిగజారడానికైనా మార్పే కీలకం." అని చెప్పారు.

పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఓట్ల కోసం కుహనా లౌకికవాదులుగా మాట్లాడటం తగదని పవన్ చెప్పారు.

‘నాకు సనాతన సర్టిఫికేట్లు వద్దు’

"నేను అకస్మాత్తుగా హిందుత్వవాదినైపోయాననుకుంటున్నారు. మొదటి నుంచి సనాతన ధర్మం పాటిస్తున్నవాడినే. దీనిపై నాకు ఎవరు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరా నిరూపించుకోవాల్సిన అగత్యం నాకు లేదు."

"అందరూ బాగుండాలని కోరుకోవడమే సనాతన ధర్మ లక్ష్యం. తిరుపతి లడ్డూ కల్తీ జరిగినపుడు కూడా దోషులను పట్టుకోవాలని అన్నాను తప్ప ఇస్లాం, క్రైస్తవం గురించి మాట్లాడలేదు. ఆఖరికి కల్తీ చేసిన వారు హిందువులనే తేలింది. తప్పు జరిగినపుడు తప్పు జరిగిందని నిర్భయంగా బయటకు వచ్చి మాట్లాడతాం. దానిలో తప్పేముంది."

"ఈ దేశంలో ఓట్ల కోసం సూడో సెక్యూలరిస్టులుగా మాట్లాడటం మంచిది కాదు. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు." అని అన్నారు.

'టార్గెట్ 2047'

"ఏదైనా రాష్ట్రానికి సమస్య వస్తే మేం దేశం నుంచి విడిపోతామని ఆ రాష్ట్రం వాళ్లు మాట్లాడటం తరచూ చూస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. చర్చించుకోవాలి. అంతేగానీ దేశం ఏమైనా కేకు ముక్కా? ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడతారేంటి..? మీలాంటి వాళ్లు విడిపోతే కలపడానికి నాలాంటి వాళ్లు కోట్లమంది వస్తారు." అన్న పవన్ కల్యాణ్...తన రాజకీయ ప్రయాణంలో ఒక లక్ష్యం ఉందని, దానిని 2047 నాటికి చేరుతాననే నమ్మకం ఉందని చెప్పారు.

"బలమైన నాయకత్వం ఉంటే బలమైన దేశం తయారవుతుంది. ఆ బలం ఒక దేశ భవితను నిర్దేశించే యువతే కావాలి. అందుకే 2047 నాటికి ఏపీ, తెలంగాణాల్లోని ప్రతి ఊరు నుంచి 100 మంది చొప్పున దేశానికి నాయకత్వం వహించే లక్షణాలున్న యువతను తయారు చేయాలి. అదే నా లక్ష్యం" అని పవన్ కల్యాణ్‌ అన్నారు.

పవన్ కల్యాణ్ సభ

ఫొటో సోర్స్, UGC

‘తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి’

దేశంలోని అన్నీ రాష్ట్రాలపైనా బీజేపీ హిందీని బలవంతంగా రుద్దుతోందనే చర్చ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ బహుభాషా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.

"త్రిభాషా సిద్ధాంతం వద్దు.. హిందీ మాకొద్దు అనే తమిళులు వారి తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు ? అలా చేయకండి. అలాగే ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురాకండి. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి. వారి భాష మాత్రం మాకొద్దు అంటే ఎలా ? తమిళనాడు సహా భారత దేశానికి కావాల్సింది బహుభాషా విధానమే. ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోడానికి." అన్నారు పవన్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పవన్ తమిళనాడు హిందీని వ్యతిరేకించడంపై చేసిన కామెంట్లపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, " స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని ట్వీట్ చేశారు.

జగన్ పై పెద్దగా విమర్శలు చేయని పవన్

ఇక పవన్ స్పీచ్ ఎక్కువ భాగం సనాతన ధర్మం, హిందుత్వం, బహుభాషా విధానం, టార్గెట్ 2047 అంటూ దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలపైనే ఎక్కువగా సాగింది.

వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్‌పై ఎక్కువగా విమర్శలు చేయకుండా...అంటే ప్రాంతీయ అంశాలకు కాకుండా జాతీయ అంశాలకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించింది. అయితే స్టేజీపై ప్రసంగించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దాదాపు వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

పిఠాపురం జనసేన సభలో అభిమానుల సంబరం

ఫొటో సోర్స్, UGC

జగన్‌పై ఏమన్నారు?

"తన పదేళ్ల కష్టమే ఈ జయకేతనం సభ అని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశాం. అది కూడా జనసేన పార్టీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో." అని పవన్ అన్నారు.

"రాజకీయాలు చేయాలంటే ముఖ్యమంత్రి కొడుకే కావాల్సిన అవసరం లేదు. కేంద్రమంత్రి మేనమామ కావాల్సిన అవసరం లేదు. బాబాయ్‌ని చంపాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను సైద్ధాంతిక రాజకీయాలను ఎంచుకున్నాను. సమాజంలో అందరిలో చైతన్యం రగిలించాలనే తపనతోనే జనసేన ముందుకు వెళుతోంది. రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా ఎదిగింది." అని పవన్ కల్యాణ్ అన్నారు.

"అసెంబ్లీ గేటును కూడా తాకలేనని నాతో చాలెంజ్ చేశారు. ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం. 100 శాతం స్ట్రయిక్‌ రేటుతో పుట్టిన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుందాం. భవిష్యత్తు మనదే." అంటూ క్యాడర్ కు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.

‘పిఠాపురానికి ఇచ్చిన హామీలపై మాట్లాడితే బాగుండేది’

"పవన్‌ను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో ఇంత భారీ సభ పెట్టి , ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను ప్రస్తావించకపోవడం సరైన పద్ధతి కాదు. పిఠాపురం వాసులమంతా హామీల గురించి ఏం చెబుతారోనని, కొత్తగా ఎలాంటి వరాలు ఇస్తారోనని ఎదురు చూశాం. కానీ అది జరగలేదు. ఈ సభలో ప్రస్తావించకూడదనుకున్నారేమో. పిఠాపురం అభివృద్ధిపై ఏదైనా మాట్లాడి ఉంటే బాగుండేది." అని ఈ నియోజకవర్గానికి చెందిన కె.సతీశ్ బీబీసీతో అన్నారు.

"బీజేపీ వ్యూహాన్ని ఏపీలో పవన్ అమలు చేస్తారేమో"

పార్టీ సాధించిన విజయాలు, వైసీపీపై విమర్శలకు పార్టీ ఆవిర్భావ సభలో ఎక్కువ సమయం కేటాయించని పవన్ కల్యాణ్, బీజేపీకి ఉపయోపడే అంశాలనే ఎక్కువగా మాట్లాడారని సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎన్. భగవాన్ బీబీసీతో అన్నారు.

" సనాతన ధర్మాన్ని పదే పదే ప్రస్తావించడం, బహుభాషా విధానం గురించి చర్చ తేవడం, దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటూ మాట్లాడటం..అలాగే స్టేజీ‌పై నుంచి పవన్ కల్యాణ్‌ని దక్షిణ భారత మోదీ అంటూ కీర్తించడం...ఇలాంటివి చూస్తుంటే...బీజేపీ తన దక్షిణాది వ్యూహాన్ని పవన్ ద్వారా అమల చేస్తోందని అనుకోవచ్చు." అని భగవాన్ అభిప్రాయపడ్డారు.

పార్టీ ఆవిర్భావ సభలో తాను ఏం మాట్లాడారో తనకే తెలియనట్లుగా ఉందని పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఎక్స్‌లో విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

పిఠాపురంలో 14.03.2025న పార్టీ పెట్టి 11ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న బాలినేని శ్రీనివాస రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జగన్ తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులు లాక్కున్నారని బాలినేని చెప్పారు

జగన్ నా ఆస్తులు కాజేశాడు: బాలినేని

పవన్ కల్యాణ్ ప్రసంగానికి ముందు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి...తర్వాత ఆ పార్టీతో విభేదించి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

"పిఠాపురం సాక్షిగా నేను అన్నీ నిజాలే చెబుతా. నా మంత్రి పదవిని జగన్ తీసేశారు. నేనేమీ బాధపడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్నవారిని అరెస్టు చేస్తున్నారు. స్కాములు చేసి కోట్లు సంపాదించిన వారిని అరెస్ట్ చేయడం లేదు." అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

"వై.ఎస్‌.ను అడ్డం పెట్టుకుని జగన్ సీఎం అయ్యాడు. మా నాయకుడు పవన్ స్వశక్తితో పైకి వచ్చారు. జగన్ నాకు చేసిన అన్యాయాన్ని మరోసారి చెబుతా. నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను జగన్ కాజేశారు." అని బాలినేని సభా వేదికపై నుంచి చెప్పారు.

2024 సెప్టెంబర్ 18న వైసీపీకి రాజీనామా చేసినప్పుడు బీబీసీతో ఇదే విషయంపై బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

"మూడేళ్లుగా పార్టీ (వైసీపీ) విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నా. రాజకీయంగా నష్టం చేస్తున్నా భరిస్తూ వచ్చా. చివరికి నా ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే ప్రయత్నం జరిగింది." అని జగన్‌పై బాలినేని అప్పట్లో ఆరోపణలు చేశారు.

జనసేన 12వ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న నాగబాబు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పిఠాపురం సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మనుద్దేశించినవే అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అలా అనుకుంటే అది వారి ఖర్మ: నాగబాబు

జగన్ ఒక హాస్యనటుడిలా తయారయ్యారని, నోటి దురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్‌లా గొప్ప వ్యక్తి అయినా కావాలి...అది సాధ్యం కాకపోతే, ఆయనకు అనుచరుడిగానైనా ఉండాలన్న నాగబాబు...‘‘ పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ విజయానికి తానే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ.’’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కామెంట్లు పిఠాపురం టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మని ఉద్దేశించి చేసినవేనంటూ అనేక పోస్టులు కనిపించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)