వైఎస్ జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందారా? వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, facebook.com/ysjagan
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 18వ తేదీన నిర్వహించిన పల్నాడు పర్యటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ఆ రోజు వైఎస్ జగన్ ప్రయాణించిన కారు టైర్ల కింద పడి గుంటూరు జిల్లా ఏటూకూరుకి చెందిన చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్టు ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోపై గుంటూరు జిల్లా ఎస్పీని బీబీసీ సంప్రదించింది. ఆ వీడియో వాస్తవమేనని గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్ ధ్రువీకరించారు.
అయితే, వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతూ, దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.


ఫొటో సోర్స్, Facebook/Guntur district police
పోలీసులు మొదట ఏం చెప్పారు?
సింగయ్య మృతిపై ఈనెల 18న గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ''సింగయ్యను వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టలేదు, గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్లనే అతను చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది'' అని తెలిపారు.
అయితే, ఆదివారం ఉదయం నుంచి జగన్ కాన్వాయ్ కింద పడే సింగయ్య మృతి చెందారంటూ వీడియో వైరల్ కావడంపై గుంటూరు ఎస్పీని బీబీసీ సంప్రదించింది.
ఆయన మాట్లాడుతూ, ఆ వీడియో వాస్తవమేనని ధ్రువీకరించారు. వైఎస్ జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందారని ఆయన బీబీసీతో చెప్పారు.
ఆ రోజు అలా అనుకున్నామనీ, ఇవాళ వీడియో వచ్చిన తర్వాత పరిశీలించి చూస్తే జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందినట్టు స్పష్టమైందన్నారు.
ఈ ఘటనకు సంబంధించి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఫొటో సోర్స్, X/YSRCParty
ఎస్పీనే చెప్పారు : అంబటి రాంబాబు
ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య చనిపోతే జగన్ కాన్వాయ్ వాహనం వల్లే మృతి అంటూ దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ఆదివారం గుంటూరులోని పార్టీ క్యాంపు కార్యాలయంలో రాంబాబు మీడియాతో మాట్లాడారు.
కాన్వాయ్‌కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతోనే సింగయ్య ప్రమాదానికి గురైనట్టు అదేరోజు గుంటూరు జిల్లా ఎస్పీ ధ్రువీకరించారని, కానీ ఆదివారం నుంచి ఓ వీడియో కొత్తగా వైరల్ చేసి దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని అంబటి విమర్శించారు.
''ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్, మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారనుకున్నారు? ఆయన కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది.
వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 లక్షల చెక్కును పార్టీ తరఫున వారి కుటుంబానికి అందజేయడం కూడా జరిగింది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, facebook/YS Sharmila Reddy
బలప్రదర్శన చేసి మృతికి కారణమయ్యారు : షర్మిల
వైఎస్ జగన్ బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమయ్యారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
''వైఎస్ జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి? '' అని ఆ పోస్టులో ప్రశ్నించారు షర్మిల.
''బల ప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్, 100 మందికి అనుమతి ఇచ్చి, వేల మందితో వచ్చినా దగ్గరుండి మరీ చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి'' అని ఆమె డిమాండ్ చేశారు.
మొదటి నుంచీ పల్నాడు పర్యటనపై వివాదం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గతేడాది మృతి చెందారు. తమపార్టీ ఓటమికి మనస్తాపం చెంది నాగమల్లేశ్వరరావు చనిపోయారని వైసీపీ నేతలు చెప్పారు.
నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఈనెల 18న రెంటపాళ్ల గ్రామానికి వెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటి నుంచి రోడ్డు మార్గంలో జగన్ రాగా, ఆయన వెంట వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.
ఈ పర్యటనకు పోలీసుల అనుమతిలేదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆ సమయంలోనే ప్రకటించారు. కేవలం వందమంది, కాన్వాయ్‌లో మూడు వాహనాలకే అనుమతి ఉందని చెప్పినప్పటికీ జగన్ ఆ రోజున వేలాదిమంది, వందలాది వాహనశ్రేణితో తరలివచ్చారని పోలీసులు అంటున్నారు.
''అక్కడ ఇరుకురోడ్లు కావడంతో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని భావించే, భారీ వాహన ర్యాలీకి అనుమతివ్వలేదు, ఇప్పుడు మేం ఊహించిందే జరిగింది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














