చైల్డ్‌పోర్న్: చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన 15 మంది.. ఒకేసారి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాలలో అరెస్టులు

చైల్డ్‌పోర్న్, తెలంగాణ, హైదరాబాద్, అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల కేసులో 15 మందిని తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా తరచూ పిల్లల పోర్న్ వీడియోలు డౌన్ లోడ్ చేసి ఇతరులకు షేర్ చేయడం, అప్‌లోడ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

''చైల్డ్ పోర్నోగ్రఫీ బ్రౌజ్ చేయడం, అప్ లోడ్ చేయడం, చూడటం, డౌన్లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం నేరం. ఐటీ యాక్ట్ 67బీ సెక్షన్ తోపాటు పోక్సో చట్టం సెక్షన్ 15 కింద కేసులు పెట్టి వారందరినీ అరెస్టు చేశాం'' అని తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ చెప్పారు.

ఇలాంటి కేసులకు సంబంధించి తెలంగాణ పోలీసులకు 57 సైబర్ ఫిర్యాదులు రాగా, 15 మందిపై 34 కేసులు నమోదు చేశారు. ఒకే రోజులో హైదరాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో దాడులు చేసి వారందరినీ అరెస్టు చేశారు.

''అరెస్టు అయిన వారంతా తరచూ పిల్లల పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేయడం, డౌన్‌లోడ్ చేసి స్టోర్ చేసి, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తున్నారు'' అని చెప్పారు శిఖా గోయల్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చైల్డ్‌పోర్న్, తెలంగాణ, హైదరాబాద్, అరెస్ట్

ఫొటో సోర్స్, TGCyberBureau

ఎలా గుర్తించారంటే..

తెలంగాణలో పిల్లలపై జరిగే అత్యాచారాలు, అశ్లీల విషయాలపై నిఘా పెట్టి కేసులు నమోదు చేసి విచారించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో కు అనుసంధానంగా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్(సీపీయూ) ప్రారంభమైంది.

అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీమెక్) సంస్థ చిన్నారులకు సంబంధించి అత్యాచారాల నిరోధానికి కృషి చేస్తోంది.

ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌తో ఒప్పందం చేసుకుని సమాచారాన్ని పంచుకుంటుందని తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం ప్రసాద్ చెప్పారు.

''చిన్నారులకు సంబంధించి పోర్న్, రేప్, సామూహిక అత్యాచారాల వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేస్తే, వెంటనే మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్ గుర్తించేలా ఎన్‌సీ మెక్ వద్ద వ్యవస్థ ఉంది.ఇది డార్క్, డీప్ వెబ్ తోపాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటుంది'' అని కేవీఎం ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరోకు అనుసంధానంగా ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కేసులు నమోదు చేస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 4 నెలల వ్యవధిలో 294 కేసులు నమోదు చేసి 110 మందిని అరెస్టు చేశామని శిఖా గోయల్ చెప్పారు.

పోర్నోగ్రఫీ చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ఐటీ, పోక్సో చట్టాలు ఏం చెబుతున్నాయి..?

పిల్లల పోర్న్ వీడియోలు, అత్యాచారం, సామూహిక అత్యాచారం వీడియోలు అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడం, డౌన్‌లోడ్ చేయకూడదు. దీనినిఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67బీ కింద నేరంగా పరిగణిస్తారు.

పిల్లలపై జరిగే అత్యాచారాలకు సంబంధించి వీడియోలు ప్రదర్శంచడం లేదా సర్క్యులేట్ చేయడం నేరమని ఈ సెక్షన్ చెబుతోంది.

పోక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం పిల్లలకు సంబంధించి అశ్లీల వీడియోలను స్టోర్ చేయడం లేదా కలిగి ఉండటం నేరం.

ఈ చట్టాల ప్రకారం నేరం రుజువైతే జైలు శిక్ష లేదా జరిమానా.. లేదా జైలు శిక్ష, జరిమానా కలిపి విధించే అవకాశం ఉంది.

చైల్డ్‌పోర్న్, తెలంగాణ, హైదరాబాద్, అరెస్ట్

ఫొటో సోర్స్, TGCyberBureau

అరెస్ట్ అయిన వారిలో ఐఐటీ గ్రాడ్యుయేట్

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేసిన 15 మంది వయసు 19 నుంచి 50 ఏళ్ల మధ్యన ఉందని శిఖా గోయల్ వివరించారు.

''అరెస్టు అయిన వారిలో ఒకరు ఐఐటీ గ్రాడ్యుయేషన్ చేసి ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. మరొక వ్యక్తి బీటెక్ పూర్తి చేశాడు. ఎక్కువ మంది 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నారు'' అని చెప్పారు.

అయితే, వారి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించలేదు. వీరు అప్‌లోడ్ చేస్తున్న లేదా డౌన్‌లోడ్ చేసి షేర్ చేస్తున్న పిల్లల వీడియోలు 6-14 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారివిగా పోలీసులు గుర్తించారు.

పిల్లలపై వీడియోలు

ఫొటో సోర్స్, Getty Images

ఫిర్యాదు చేయడం ఎలా?

పిల్లలపై జరిగే నేరాలు, అత్యాచారాలను, అశ్లీల(పోర్న్) వీడియోలను నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని శిఖా గోయల్ కోరారు.

''అనుకోకుండా లేదా ఎలాంటి దురుద్దేశం లేకుండా అలాంటి వీడియోలు షేర్ చేసినా చట్టప్రకారం నేరమవుతుంది. ఈ తరహా మెటీరియల్, ఆన్‌లైన్ కార్యకలాపాలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి'' అన్నారు.

టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేయడం కానీ, లేదంటే www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటర్నెట్ వినియోగాన్ని పర్యవేక్షిస్తుండాలని, ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని శిఖా గోయల్ విజ్జప్తి చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)