ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలో భారత్ ఎటువైపు, అరబ్ దేశాల వైఖరి ఏమిటి?

బెంజమిన్ నెతన్యాహు, డోనల్డ్ ట్రంప్, ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణ పశ్చిమాసియానే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది.

ప్రపంచ చమురు మార్కెట్లు, వాణిజ్య మార్గాలు, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపైనా దీని ప్రభావం కనిపిస్తోంది.

'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ జూన్ 13న ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.

అణ్వస్త్రాలను తయారు చేయాలన్న ఇరాన్ లక్ష్యాన్ని అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది .

ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్, టెల్ అవీవ్‌పై క్షిపణులతో దాడి చేసింది.

పశ్చిమాసియాలో ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక, రాజకీయ, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి.

భారత్‌కు ఈ రెండు దేశాలతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి.

ఇజ్రాయెల్‌తో రక్షణ బంధం.. ఇరాన్‌తో చమురు సరఫరా, బలమైన చారిత్రక సంబంధాలున్నాయి.

ఈ ఘర్షణలో అమెరికా బహిరంగంగానే ఇజ్రాయెల్‌కు మద్దతిస్తోంది.

తాజాగా ఇరాన్‌ అణు స్థావరాలను బాంబులు ప్రయోగించి ధ్వంసం చేసినట్లూ ప్రకటించింది.

పశ్చిమాసియాలోని ఈ ప్రాంతంలో చైనా, రష్యా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఈ ఘర్షణను ఆపేందుకు మధ్యవర్తిత్వం చేస్తామని ఈ రెండు దేశాలూ ముందుకొచ్చాయి.

అయితే మధ్యవర్తిత్వం కంటే ఈ ప్రాంతంలో అమెరికా అధిపత్యం పెరగకుండా చూడటమే చైనా, రష్యా ప్రధాన ఉద్దేశంగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఇజ్రాయెల్ తన సైనిక చర్యను మరింత తీవ్రం చేస్తుందా?

ఇజ్రాయెల్, ఇరాన్‌తో సంబంధాల్లో భారత్ సమతుల్యత ఎలా సాధిస్తుంది?

భారత్ స్పందన భవిష్యత్‌లో ఆయా దేశాలతో సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీబీసీ 'ది లెన్స్' కార్యక్రమంలో కలెక్టివ్ న్యూస్ రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముఖేశ్ శర్మ ఈ అంశాలపై చర్చించారు.

ఈ చర్చలో గ్రేటర్ వెస్ట్ ఆసియా ఫోరం చైర్‌పర్సన్ డాక్టర్ మీనా రాయ్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్ట్రాటజిక్ స్టడీస్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ కబీర్ తనేజా, జెరూసలేం నుంచి సీనియర్ జర్నలిస్ట్ హరీందర్ మిశ్రా పాల్గొన్నారు.

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వివిధ దేశాల స్పందన ఎలా ఉండవచ్చనే దానిపై ఈ కార్యక్రమంలో చర్చించారు.

ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా, భారత్, వైమానిక దాడులు, అణు స్థావరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్వాగతించారు.

వివాదంలో అమెరికా పాత్ర

ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణలో నేరుగా పాల్గొనాలా వద్దా అనే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయిస్తారని వైట్ హౌస్ కొద్ది రోజుల కిందట చెప్పింది.

అలా చెప్పిన తరువాత రెండు రోజుల్లోనే ఇరాన్‌లోని 3 అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది.

"అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాలలో ఇజ్రాయెల్ భద్రత చాలా ప్రధానమైనది. అందుకే అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొత్తగా ఏమీ అనిపించదు. ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికా పని చేస్తుంది" అని అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్‌లో స్ట్రాటజిక్ స్టడీస్ విభాగ డిప్యూటీ డైరెక్టర్ కబీర్ తనేజా అభిప్రాయపడ్డారు.

"ఇరాన్ అణు కార్యక్రమాన్ని మరో పదేళ్ల వరకు పునరద్ధరించలేని విధంగా ధ్వంసం చేయాలనేది ఇజ్రాయెల్ అనుకుంది. అయితే అలాంటి దాడి చేయడానికి అవసరమైన ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద లేవు. ఇరాన్ అణు స్థావరాలు భూమి లోపల చాలా లోతైన ప్రాంతంలో ఉన్నాయి" అని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో దేశాన్ని మరోసారి యుద్ధంలోకి దించబోనంటూ ట్రంప్ తన ప్రచారం సాగించారని.. కానీ, ఇప్పుడాయన ఇరాన్‌పై దాడి చేయడం ద్వారా మిగతా అధ్యక్షుల మాదిరిగానే వ్యవహరించారని అమెరికన్లు భావిస్తారని కబీర్ తనేజా అన్నారు.

మరోవైపు ఇరాన్ తమ అణు కార్యక్రమం పౌర ప్రయోజనాలకు ఉద్దేశించిందని చెబుతోంది.

అయితే ఇరాన్ పది అణు బాంబులను తయారు చేసే సామర్థ్యాన్ని సంపాదించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తుందని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ చెప్పారు.

ఇరాన్ అణుబాంబు తయారు చేసేపనిలో ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

ఇరాన్‌తో సంఘర్షణ ఇజ్రాయెల్‌కు సంబంధించినదని, ఇందులోకి అమెరికా దిగకుండా ఉండాల్సిందని అనేకమంది భావిస్తున్నట్లు కబీర్ తనేజా చెప్పారు.

నరేంద్ర మోదీ, బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌కు ఇజ్రాయెల్, ఇరాన్‌తో బలమైన సంబంధాలున్నాయి.

భారత దేశానికి ఆందోళన ఎందుకు?

ఇలాంటి సంఘర్షణలు తలెత్తినప్పుడు ఏదో ఒక దేశం పక్షం వహించడం, ఏమీ మాట్లాడకుండా ఉండటం భారత్ వంటి దేశాలకు అంత తేలిక్కాదు.

నెల రోజుల క్రితం భారత్ పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ విషయంలో భారత్‌కు ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది.

ఇజ్రాయెల్ నుంచి ఇలాంటి నిర్ణయం రావడం సహజం.

ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించలేదు.

మరోవైపు ఇరాన్, భారత్ మధ్య కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి.

రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు.

చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్‌కు ఇరాన్ బలమైన భాగస్వామి.

రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి.

దీర్ఘకాలంలో తన ప్రయోజనాలకు హాని కలగకుండానే ఎవరి పక్షం వహించాలో నిర్ణయించుకోవడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాలు.

"చమురు దిగుమతులు, గల్ఫ్ దేశాలతో వాణిజ్యంతో పాటు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయుల ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. యుద్ధం తీవ్రమైతే గల్ఫ్ ప్రాంతాన్ని ఇరాన్ నుంచి వేరు చేసి చూడలేం" అని డాక్టర్ మీనా రాయ్ చెప్పారు.

ఇరాన్ అణు స్థావరాలపై దాడుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అణుధార్మికత బయటకు వ్యాపించే ప్రమాదం ఉంటుందని.. అలా జరిగితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని ఆమె అన్నారు.

"ఇజ్రాయెల్, ఇరాన్‌తో సంబంధాలు భారత్‌కు కీలకమైనవి. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ తీవ్రం కావడాన్ని భారత్ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అలాంటి పరిస్థితివస్తే, దాని ప్రభావం అందరిపైనా పడుతుంది" అని ఆమె అన్నారు.

"ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, ప్రతీ దేశం అది భారత్ లేదా మరొకటి కావచ్చు, అందరూ కాల్పుల విరమణను కోరుకుంటారు. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకునే బాధ్యత అమెరికాపై ఉంది" అని ఆమె చెప్పారు.

"అంతర్జాతీయ సంబంధాల గురించి మాట్లాడుకుంటే, మన వ్యూహాత్మక భాగస్వామ్యం ఎవరితో ఎంత బలంగా ఉందో చూసుకోవడం ముఖ్యం" అని మీనారాయ్ అన్నారు.

"ఇజ్రాయెల్, ఇరాన్‌తో విదేశీ సంబంధాల్లో భారత్ ఇప్పటి వరకు సమతుల్యత పాటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఏదో ఒక దేశానికి మద్దతు ప్రకటించాల్సి వస్తే, భారత దేశానికి ఏది ప్రయోజనకరంగా ఉంటుందో పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుంది. రెండు దేశాలలో ఏదో ఒక దేశాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో ఏ దేశం విషయంలో పైచేయి ఉందో పరిశీలిస్తుంది" అని ఆమె అన్నారు.

ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా, భారత్, వైమానిక దాడులు, అణు స్థావరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ముస్లిం దేశాలు ఖండించాయి.

ఇస్లామిక్ దేశాల వైఖరేంటి?

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించాయి.

ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం అని ఖతార్ హెచ్చరించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు నిదర్శనం అని సౌదీ అరేబియా ప్రకటించింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైతే, దాని ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి.

ఈ వివాదం మీద అరబ్ దేశాల తాజా ప్రకటనలు చూస్తుంటే, ఈ ఘర్షణ మరింత పెద్దది కావడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోందని డాక్టర్ మీనారాయ్ చెప్పారు

"అమెరికా ఇందులో అడుగు పెట్టాలని, ఇది మరింత తీవ్ర రూపు దాల్చాలని వారు కోరుకోవడం లేదు" అని ఆమె అన్నారు.

ఈ ప్రాంత విషయానికొస్తే మూడు అంశాలు ముఖ్యమైనవని ఆమె చెప్పారు.

  • మొదటిది - భౌగోళిక అంశాలు
  • రెండోది- నాయకత్వం
  • మూడోది- అధికారం, దాన్ని ఎలా ఉపయోగిస్తారు?

"మొదటి అంశానికొస్తే ఇరాన్, ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు ఇరాన్‌కు ఎవరూ మద్దతివ్వలేదు. ఇప్పటికీ ఇరాన్ ఒంటరిగానే పోరాడుతోంది. అయితే ఈసారి అరబ్ దేశాల నుంచి, ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి ప్రకటన వచ్చింది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంత పరిస్థితులు మారాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం" అని డాక్టర్ రాయ్ అన్నారు.

"మధ్య ఆసియా దేశాలకు ప్రస్తుతం అమెరికాను ఎదుర్కొనేంత బలం లేదు. కానీ సమస్య పరిష్కారం కావాలని వాళ్లు కోరుకుంటున్నారు. ఇరాన్ అణు శక్తిగా మారకుండా నిరోధించాలి, కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం తీవ్రం కాకూడదనేది వారి కోరిక" అని ఆమె చెప్పారు.

పుతిన్, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంఘర్షణలో మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా, రష్యా ప్రతిపాదించాయి.

రష్యా, చైనా ఎవరితో ఉన్నాయి?

ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ 'రెడ్ లైన్ దాటిందని' చెప్పింది.

ఇజ్రాయెల్ చర్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజింగ్ వ్యాఖ్యానించింది.

మరోవైపు రష్యా ఇజ్రాయెల్ దాడులను విమర్శించినప్పటికీ ఇరాన్‌కు మాస్కో ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు.

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

ఈ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడం, ఆ తర్వాత ఇది మరింత తీవ్రమైతే చైనా, రష్యా ఇరాన్‌కు సైనిక సాయం అందిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

"రష్యా, చైనా ఇరాన్‌కు దౌత్యపరమైన మద్దతిస్తాయి. కానీ అవి సైనికంగా ఎలాంటి సాయం చేయవు. ఇరాన్ కోసం ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగవు" అని కబీర్ తనేజా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)