బ్లేజ్ మెట్రివెలి: సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 116 ఏళ్ల చరిత్రలో మొదటి మహిళా చీఫ్, ఎవరీమె?

బ్లేజ్ మెట్రివెలి, ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్, MI6

ఫొటో సోర్స్, UK Foreign Office/AP

ఫొటో క్యాప్షన్, సర్ రిచర్డ్ మూరె నుంచి బ్లేజ్ బాధ్యతలు స్వీకరిస్తారు.
    • రచయిత, క్రిస్ మాసన్, ఫ్రాంక్ గార్డ్‌నర్, రిచ్ ప్రెస్టన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

MI6కు మొదటిసారి ఓ మహిళ నేతృత్వం వహించనున్నారు. విదేశీ నిఘా సంస్థ(ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్) 116 ఏళ్ల చరిత్రలో ఓ మహిళా అధిపతి ఉండడం ఇదే తొలిసారి. ఆమె పేరు బ్లేజ్ మెట్రివెలి.

బ్లేజ్ మెట్రివెలి 1999లో బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ MI6లో చేరారు. MI6కు ఆమె 18వ అధ్యక్షురాలు. ఈ ఏడాది తర్వాత సర్ రిచర్డ్ మూరె నుంచి ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు.

ప్రస్తుతం ఆమె సంస్థలో సాంకేతికత, ఆవిష్కరణల విభాగం బాధ్యతలు చూస్తున్నారు. తనకు నాయకత్వ అవకాశం రావడం గర్వంగా అనిపించిందని బ్లేజ్ చెప్పారు.

''మా నిఘా సేవలు గతంలో ఎన్నడూ లేనంత కీలకంగా ఉన్న సమయంలో'' ఈ నియామకం 'చరిత్రాత్మకమైనది' అని ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ అభివర్ణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

MI6 ఏం చేస్తుంది?

యూకే భద్రత కోసం విదేశాల్లో రహస్యంగా సమాచారాన్ని సేకరించడం MI6 లక్ష్యం. ఉగ్రవాదాన్ని అంతమొందించడం, శత్రుదేశాల కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడం దీని ప్రధాన విధులు.

ఈ సంస్థ చీఫ్‌ను ''సి''గా పిలుస్తారు. సర్వీస్‌లో అందరికీ తెలిసిన ఏకైక వ్యక్తి ఈ 'సి' ఒక్కరే.

47 ఏళ్ల బ్లేజ్ ప్రస్తుతం కీలకమైన సాంకేతికత, ఆవిష్కరణల విభాగం ''క్యూ'' డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. సీక్రెట్ ఏజెంట్ల గుర్తింపును రహస్యంగా ఉంచడం, చైనా బయోమెట్రిక్ నిఘా వంటి వాటికి చిక్కకుండా కొత్త మార్గాలను గుర్తించడం ఈ విభాగం లక్ష్యం.

''బ్రిటిష్ ప్రజలను సురక్షితంగా ఉంచడం, విదేశాల్లో యూకేకు ప్రయోజనకరంగా వ్యవహరించడంలో MI5, జీసీహెచ్‌క్యూతో కలిసి MI6 కీలక పాత్ర పోషిస్తోంది'' అని బ్లేజ్ చెప్పారు.

''MI6 ధైర్యవంతులైన అధికారులు, ఏజెంట్లు, అనేక మంది అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా'' అని ఆమె తెలిపారు.

బ్లేజ్ మెట్రివెలి , ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్, MI6

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్‌లోని MI6 భవనం

బ్లేజ్ ఇంతకుముందు ఏం చేసేవారు?

కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ చదివిన బ్లేజ్ ఇంతకుముందు M15లో డైరెక్టర్ స్థాయి బాధ్యతలు నిర్వహించారు. M15 అనేది MI6కు సోదరసంస్థ అయిన దేశీయ భద్రతా సంస్థ. కెరీర్‌లో ఎక్కువ భాగం బ్లేజ్ పశ్చిమాసియా, యూరప్‌లో గడిపారు.

బ్రిటిష్ విదేశాంగ విధానానికి చేసిన సేవలకుగానూ, 2024లో రాజు పుట్టినరోజు సందర్భంగా విదేశీ, అంతర్జాతీయ గౌరవనీయుల జాబితాలో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ (సీఎంజీని)ని బ్లేజ్ అందుకున్నారు.

'డైరెక్టర్ కె' అనే మారుపేరుతో MI5లో ఉన్నప్పుడు 2021 డిసెంబర్‌లో టెలిగ్రాఫ్‌తో ఆమె మాట్లాడారు. యూకే జాతీయ భద్రతకు ఉన్న సవాళ్లు వైవిధ్యంగా ఉంటాయని అప్పుడామె చెప్పారు.

"ప్రభుత్వాన్ని రక్షించడం, రహస్యాలను జాగ్రత్తపరచడం, ప్రజల రక్షణ, ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడం, సెన్సిటివ్ టెక్నాలజీని రక్షించడం, ముప్పు నివారణ చర్యలు చేపట్టడం మా ప్రధాన విధి" అని ఆమె చెప్పారు.

రష్యా ప్రభుత్వ కార్యకలాపాలు ముప్పుగా ఉన్నాయని, చైనా ప్రపంచాన్ని మారుస్తున్న విధానం యూకేకి అద్భుతమైన అవకాశాలను, ప్రమాదాలను కల్పిస్తోందని బ్లేజ్ వివరించారు.

బ్లేజ్ మెట్రెవెలి, ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్, MI6

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా, చైనాతో అంతర్జాతీయ సమాజానికి ముప్పు ఉందని యూకే నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

''సి'' అంటే ఏంటి?

''సి'' రహస్య నిఘా సంస్థ MI6కి హెడ్. వారు విదేశాంగ కార్యదర్శికి జవాబుదారీగా ఉంటారు. ఇతర విభాగాల అధిపతులు, ప్రభుత్వ సీనియర్ అధికారులతో కలిసి ''సి'' సంయుక్త నిఘా కమిటీలో కూడా భాగంగా ఉంటారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులను, పరిణామాలను విశ్లేషించి, ప్రధానమంత్రికి సలహాలు అందిస్తుంటారు.

సాధారణంగా ''సి'' అంటే చీఫ్ అనుకుంటాం. కానీ అది కాదు. బ్రిటన్ తొట్ట తొలి నిఘా సంస్థను సీక్రెట్ సర్వీస్ బ్యూరోగా పిలిచేవారు. 1900వ సంవత్సరంలో దీన్ని నెలకొల్పారు. దీనికి రాయల్ నేవీ అధికారి కెప్టెన్ మ్యాన్స్‌ఫీల్డ్ కమ్మింగ్ నాయకత్వం వహించారు. ఆయన తన సంతకాన్ని''సి'' అని చేసేవారు. అలా ఆ కోడ్‌నేమ్ ఏర్పడింది.

కెప్టెన్ కమ్మిన్ ఆకుపచ్చ సిరాతో రాసేవారు. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా వైట్‌హాల్‌లో ఆకుపచ్చసిరాతో రాసే ఏకైక వ్యక్తి MI6 అధిపతి మాత్రమే.

''సి'' తన ఏజెంట్లకు చంపడానికి అనుమతి ఇస్తారా అంటే లేదు అన్నది సమాధానం. అయితే, విదేశాంగ కార్యదర్శి మాత్రం ఈ అనుమతి ఇవ్వొచ్చు. ఇంటెలిజెన్స్ సర్వీస్ యాక్ట్ 1994లోని సెక్షన్ 7 ప్రకారం MI6 ఏజెంట్‌కు సాధారణంగా చట్టవిరుద్ధంగా భావించే కొన్ని ప్రాణాంతకమైన చర్యలను చేపట్టే అధికారం ఉంటుంది. అయితే. అది సుదీర్ఘంగా సాగే క్లిష్టమైన న్యాయప్రక్రియ.

బ్లేజ్ మెట్రెవెలి, ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్, MI6

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్‌లోని M15 కార్యాలయం

భౌగోళిక, సాంకేతిక సవాళ్లు

ఆమె నిర్వహించబోయే పదవిలో ఊహించలేని అనేక సవాళ్లుంటాయి.

భౌగోళికంగా చూసుకుంటే ఈ సవాళ్లు ప్రధానంగా రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి ఉన్నాయి. ఈ నాలుగు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా యూకే, పాశ్చాత్య దేశాల ప్రయోజనాలకు గండికొట్టడానికి సన్నిహితంగా సహకరించుకుంటాయి.

సాంకేతిక సవాళ్లు కూడా ఉన్నాయి.

శత్రు దేశాలతో పాటు అల్ ఖైదా వంటి బ్రిటన్ ప్రత్యర్థుల నుంచి రహస్యాలను సేకరించడానికి ఏజెంట్లను నియమించుకోవడం వంటివి MI6 చేస్తుంది.

ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ సమాజం ముప్పు ఎదుర్కొంటోందని గత ఏడాది సెప్టెంబరులో MI6 ప్రస్తుత చీఫ్ సర్ రిచర్డ్.. సీఐఏ చీఫ్ విలియం బర్న్స్‌తో కలిసి వ్యాఖ్యానించారు.

యుక్రెయిన్‌లో యుద్ధానికి మించి, "రష్యన్ నిఘా సంస్థ యూరప్ అంతటా చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకునేందుకు" రెండు విదేశీ నిఘా విభాగాలు కలిసి పనిచేస్తున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్‌లో రాసిన కాలమ్‌లో సర్ రిచర్డ్, విలయం బర్న్స్ చెప్పారు.

చైనా పెరుగుదలను ఈ శతాబ్దంలో తాము ప్రధాన నిఘా, భౌగోళిక రాజకీయ సవాలుగా చూస్తున్నామని వారు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడం కోసం తాము గట్టిగా ఒత్తిడి తెచ్చామని కూడా వారు చెప్పారు.

సర్ రిచర్డ్ ఐదు సంవత్సరాలుగా ఆ పదవిలో ఉన్నారు. మరికొన్ని నెలల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అధినేత్రిగా బ్లేజ్ చరిత్రాత్మక నియామకంపై పూర్తి సంతోషంగా ఉన్నానని ఆయన చెప్పారు.

MI6 అధిపతిగా బ్లేజ్ నియామకం ఆదర్శప్రాయమైందని విదేశాంగశాఖ కార్యదర్శి డేవిడ్ లామి చెప్పారు. ఆమె నేతృత్వంలో, అంతర్జాతీయ అస్థిరత, భద్రతాపరమైన సవాళ్లను యూకే సమర్థవంతంగా ఎదుర్కొంటుందని లామి విశ్వాసం వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)