ఫ్లోరెన్స్ నైటింగేల్: ఈమె జుట్టును వేలంలో పెడితే లక్షల రూపాయలు పలికింది....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్రూ బార్టన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో ఆధునిక నర్స్‌గా, లేడీ విత్ ద లాంప్‌గా గుర్తింపు పొందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జుట్టు, వేలంలో 3,606 పౌండ్లకు అమ్ముడుపోయింది. ఈ మొత్తం భారత కరెన్సీలో రూ. 3,89,849 అవుతుంది.
జుట్టుతోపాటు ఆమె సంతకం ఉన్న ఒక పేపరు ముక్కను కూడా వేలంలో పెట్టారు.
మొదట వీటి ధర 2,000 నుంచి 3,000 పౌండ్లకన్నా ఎక్కువ పలకదని అనుకున్నారు. కానీ, అంతకన్నా ఎక్కువే పలికింది.
బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తి ఈ మొత్తం వెచ్చించి నైటింగేల్ జుట్టును కొనుగోలు చేశారని టెన్నాట్స్ కు చెందిన వేలం సంస్థ హారియట్ హంటర్ -స్మార్ట్ తెలిపింది. నార్త్ యార్క్ షైర్‌లో ఈ వేలం జరిగింది.
ఇప్పటిదాకా నైటింగేల్ సోదరికి చెందిన బంధువుల దగ్గర ఆమె వెంట్రుకలు ఉన్నాయి.
నైటింగేల్ జుత్తు దొరకడం అరుదైన విషయమని ప్రముఖ ఆక్షనర్ జోడీ బీటన్ వ్యాఖ్యానించారు.


ఫొటో సోర్స్, TENNANTS AUCTIONEERS
నైటింగేల్ ఎవరు?
ఆధునిక నర్సింగ్‌కు ఆద్యురాలిగా నైటింగేల్‌ను భావిస్తారు. క్రైమియా యుద్ధ సమయంలో ఆమెకు ‘లేడీ విత్ ది ల్యాంప్’ అనే పేరు వచ్చింది.
1853లో క్రైమియా యుద్ధం జరిగింది. రష్యాకు వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ(నేటి తుర్కియే), సార్డీనియా ఓ కూటమిగా ఏర్పడ్డాయి.
ఆ యుద్ధంలో సైనికులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. వారందరినీ చికిత్స కోసం టర్కీ ఆస్పత్రికి తరలించారు. సరిపడా సిబ్బంది లేక అక్కడ వారికి సరైన వైద్యం అందలేదు.
దీంతో సైన్యానికి కావాల్సిన వైద్య సేవలందించేందుకు 38 మందితో ఓ బృందం ఏర్పాటు చేయాల్సిందిగా నైటింగేల్‌కు ఆదేశాలు వచ్చాయి.
సైన్యంలో సేవలందించడానికి మహిళలను అనుమతించడం అదే తొలిసారి. అలాగే యుద్ధరంగంలో సేవలందించిన మొట్టమొదటి నర్సు కూడా నైటింగేలే.
తన బృందంతో కలిసి టర్కీ ఆస్పత్రికి చేరుకున్ననైటింగేల్ యుద్ధప్రాతిపదికన సేవలు ప్రారంభించారు. ఆస్పత్రిని శుభ్రం చేయించి సైనికుల బాగోగులు చూసుకున్నారు.
1860లో లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో నైటింగేల్ ట్రెయినింగ్ స్కూల్ స్థాపించారు. బ్రిటన్ లో ఏర్పాటయిన తొలి నర్స్ ట్రెయినింగ్ స్కూల్ ఇది.
ఈ స్కూల్ ఏర్పాటుతో నైటింగేల్ తన ఆకాంక్షలకు అనుగుణంగా బ్రిటన్‌కు ఎంతోమంది నర్సులను అందించారు.
1910లో 90 ఏళ్ల వయసులో నైటింగేల్ కన్నుమూశారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














