ఇరాన్‌పై దాడి చేసి డోనల్డ్ ట్రంప్ పెద్ద రిస్క్ చేశారా, ఇకపై ఏం జరగబోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథోనీ జర్చర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, నార్త్ అమెరికా
తనను తాను 'శాంతిదూత'గా చెప్పుకుంటూ, ఈ ఏడాది జనవరిలో మరోసారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన డోనల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ - ఇజ్రాయెల్ సంక్లిష్ట సంక్షోభంలో అమెరికా కూడా భాగస్వామి అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు.
ఇరాన్‌లో మూడు అణు స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసిందని సోషల్ మీడియాలో ప్రకటించిన రెండు గంటల్లోనే శ్వేతసౌధం నుంచి జాతినుద్దేశించి టెలివిజన్ ప్రసంగం చేశారు ట్రంప్.
ఈ ఆపరేషన్ అద్భుతమైన విజయం సాధించిందని పేర్కొన్నారు.
''ఇరాన్ కీలక అణు శుద్ధి స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం. ఈ చర్య ద్వారా ఇరాన్ ఇక అణుశక్తిగా మారే అవకాశం లేకపోవడంతో, ఇప్పుడు శాంతిని నెలకొల్పేందుకు మార్గం సుగమం అయింది'' అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ దేశంలో అమెరికా దాడులు జరిపినట్టు ఇరాన్ అంగీకరించింది.

అమెరికా దాడులతో తమ అత్యంత కట్టుదిట్టమైన ఫోర్దో అణు స్థావరానికి స్వల్ప నష్టమే జరిగిందని ఇరాన్ తెలిపింది. ఏది సరైనదో కాలమే నిర్ణయిస్తుందని పేర్కొంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేథ్‌లతో కలిసి ఈ ప్రసంగం చేసిన ట్రంప్... ఇరాన్ ఒకవేళ తమ అణు కార్యక్రమాన్ని విరమించకపోతే, భవిష్యత్‌లో మరింత దారుణమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
చాలా లక్ష్యాలను తాము వదిలిపెట్టామని ట్రంప్ చెప్పారు. వేగం, కచ్చితత్వం, నైపుణ్యంతో అమెరికా వాటిపై విరుచుకుపడుతుందని అన్నారు.
ఈ యుద్ధంలో జోక్యం చేసుకున్న అధ్యక్షుడి ధైర్యసాహసాలు ఎలా ఉన్నప్పటికీ, ఇరాన్‌లో అమెరికా సైన్యం దాడులను కొనసాగించడం అమెరికాకు, ఆ ప్రాంతానికి, ప్రపంచానికి అత్యంత దారుణమైన పరిస్థితిని తీసుకురావొచ్చు.
మిడిల్ ఈస్ట్ ఇప్పటికే ప్రమాదపుటంచుల్లో ఉందన్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్.. ఈ సంక్షోభాన్ని మరింత పెంచేలా అమెరికా నిర్ణయం తీసుకోవడం మరింత గందరగోళ పరిస్థితులు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు.
అమెరికా దాడి చేస్తే ప్రతిస్పందన ఉంటుందని అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించినట్లుగా, ఇరాన్ ప్రతీకారానికి దిగితే అమెరికా వైపు నుంచి కూడా ప్రతిస్పందన ఉండొచ్చు.

'రెండు వారాల గడువు' రెండు రోజులుగా మారింది
''ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని'' ఈ వారం ప్రారంభంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. ఈ విషయంలో అధ్యక్షుడు వెనక్కి తగ్గే పరిస్థితిని కష్టతరం చేశాయి.
ఇరాన్ సైతం సొంత బెదిరింపులతో తనని తాను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసుకుంది.
యుద్ధాలు తొలుత ఇలానే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అవి తమ నియంత్రణను కోల్పోయి, అంచనాలకు మించి విస్తృతమవుతుంటాయి.
డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గురువారం రెండు వారాల డెడ్‌లైన్ విధించారు.
కానీ, ఈ సమయాన్ని అంచనా వేసిన దానికంటే చాలా తక్కువకు కుదించి కేవలం రెండు రోజులకే పరిమితం చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో తాను రంగంలోకి దిగినట్లు శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు.
చర్చల కోసం రెండు వారాల గడువు మోసమా? లేదా ట్రంప్ శాంతిదూత స్టీవ్ విట్‌కాఫ్ నేతృత్వంలో తెరవెనుక చర్చలు విఫలమయ్యాయా?
ఈ దాడులు జరిగినా, దాని గురించి పెద్దగా సమాచారం లేదు.
కానీ, ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో, టెలివిజన్ ప్రసంగంలో మాత్రం.. శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఇది ఆశావహ దృక్పథం కావొచ్చు. కానీ, ఇరాన్ సైనిక సామర్థ్యాలను తగ్గించడానికి ఇజ్రాయెలీలు గణనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, అయతొల్లా వద్ద ఇంకా ఆయుధాలు ఉన్నాయి.
పరిస్థితులు చాలా వేగంగా దారుణంగా మారొచ్చు.
ప్రస్తుతం వేచిచూసే ఆట మొదలైంది. ఫోర్దోతో సహా మూడు అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడులపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి? ఫోర్దోను తన అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన స్థావరంగా ఇరాన్ చూస్తోంది.
ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడులతో చర్చల సమయంలో ఆ దేశాన్ని మరింత తలొగ్గేలా చేస్తాయని ట్రంప్ భావిస్తున్నారు.
కానీ, ఇజ్రాయెల్ దాడులు జరుగుతోన్న నేపథ్యంలో చర్చలకు సిద్ధంగా లేని ఈ దేశం, ప్రస్తుతం అమెరికా బాంబు దాడులతో మరింత వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
అమెరికా దాడి అద్వితీయంగా, అద్భుతమైన విజయంగా ట్రంప్ చెబుతున్నప్పటికీ, అలా జరగకపోతే.. మళ్లీ దాడులు చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది.
లేదంటే కనీసం సైన్యం లాభం కోసమైనా అధ్యక్షుడు తీవ్రమైన రాజకీయ సాహసం ప్రదర్శించాలి.

ఫొటో సోర్స్, Getty Images
'శాంతిస్థాపక' అధ్యక్షునికి రాజకీయంగా ప్రమాదం
అంతర్జాతీయ భద్రతకు చెందిన ప్రశ్నలతో పాటు దేశీయంగా కూడా రాజకీయ ఆందోళనలు పెరిగే ప్రమాదం ఉంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేయడంపై ఇప్పటికే డెమొక్రాట్ల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో పాటు, ట్రంప్ సొంతంగా ప్రారంభించిన 'అమెరికా ఫస్ట్' ఉద్యమం నుంచి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అధ్యక్షుడు అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత తన సన్నిహిత ముగ్గురు అడ్వయిజర్లతో కలిసి జాతినుద్దేశించి ప్రసంగించడం ద్వారా పార్టీలో ఐక్యత ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నించారు.
ఒకవేళ ఈ దాడి ఒక్కసారితో ఆగిపోతే, ట్రంప్ తన స్థావరంలో నెలకొనే విభేదాలను తేలికగా చక్కదిద్దే అవకాశం ఉండొచ్చు.
కానీ, అతిపెద్ద సంక్షోభంలో అమెరికా కూరుకుపోతే, అధ్యక్షుడికి తన సొంత శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు.
తన తొలి పదవీ కాలంలో ఎలాంటి కొత్త యుద్ధాలను ప్రారంభించలేదని చెప్పుకుంటూ వచ్చిన అధ్యక్షుడికి, శనివారం దాడి ఒక దూకుడు చర్య.
అంతకుముందు పాలకులు తమ దేశాన్ని విదేశీ సంక్షోభాల్లోకి నెట్టేశారని గత ఏడాది జరిగిన ప్రచార కార్యక్రమంలో తరచూ విమర్శించారు ట్రంప్.
ట్రంప్ ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి అది ఎటు వెళ్తోందో పూర్తిగా ఆయన నియంత్రణలో ఉండదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














