చదువుల పడవ: 300 అడుగుల లోతు నీటిపై రెండు జిల్లాల మధ్య 12 మంది చిన్నారుల ప్రమాదకర ప్రయాణం

రైవాడ రిజర్వాయర్, సోలబొంగు, విద్యార్థులు, అల్లూరి జిల్లా, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, రోజూ పడవలో 2 కిలోమీటర్లు ప్రయాణించి పిల్లలు స్కూలుకు చేరుకుంటారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అందమైన ప్రకృతి మధ్యలో రైవాడ రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న ఒక గిరిజన గ్రామం నుంచి ప్రతి ఉదయం ఆ చిన్నారుల పోరాటం మొదలవుతుంది.

చదువు కోసం 12 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ బడి బాట ప్రారంభిస్తారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని సోలబొంగు గిరిజన గ్రామానికి చెందిన స్వాతి ఆరో తరగతి చదువుతున్నారు.

రోడ్డు, బడి వంటి ప్రాథమిక సౌకర్యాలు లేని ఈ గ్రామానికి చెందిన స్వాతికి పెద్ద లక్ష్యమే ఉంది.

డాక్టర్ కావాలన్నదే ఆ చిన్నారి కల.

ఆ కలను నిజం చేసుకునేందుకు రోజూ ఆ బాలిక చేస్తున్న ప్రయాణం సాధారణమైనది కాదు.

చిన్న పడవలో భారీ జలాశయాన్ని దాటుతారు.. పడవ దిగిన తర్వాత తుప్పలు, పొలాలు దాటి స్కూల్‌కు చేరుకుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రైవాడ రిజర్వాయర్, సోలబొంగు, విద్యార్థులు, అల్లూరి జిల్లా, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, అంజలి పుస్తకాలను చేతితో గట్టిగా పట్టుకుని భయపడుతూ పడవలో కూర్చుని పాఠశాలకు చేరుకుంటారు.

ఇది స్వాతి ఒక్కరి కథే కాదు.

సోలబొంగుకు చెందిన 12 మంది విద్యార్థుల కథ.

సోలబొంగులో 22 మంది బడి ఈడు పిల్లలుంటే అందులో 12 మంది మాత్రమే పాఠశాలకు వెళ్తున్నారు.

రైవాడ రిజర్వాయరు అనకాపల్లి జిల్లాకు ఒక వైపు ఉంటే రిజర్వాయరుకి మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సోలబొంగు గ్రామం ఉంది.

అంటే ఈ విద్యార్థులంతా చదువుకునేందుకు రోజూ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బోటుపై ప్రయాణం చేస్తుంటారు.

రైవాడ రిజర్వాయర్, సోలబొంగు, విద్యార్థులు, అల్లూరి జిల్లా, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, పడవ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ప్రమాదకరమైన ప్రయాణం.

చదువు కోసం ప్రమాదకరమైన పడవ ప్రయాణం

16 కుటుంబాలు, 72 మంది జనాభా ఉండే సోలబొంగుకు ఆనుకుని రిజర్వాయర్, ఆ పక్కనే జీడితోటలు, పంటపొలాలు ఉన్నాయి.

ప్రకృతిలో ఒదిగిపోయినట్లుగా కనిపించే సోలబొంగు గ్రామానికి రాకపోకలు సాగించేందుకు సౌకర్యం లేదు.

గ్రామస్థులు రైవాడ రిజర్వాయరులోని పడవలపైనే ప్రయాణించాల్సి ఉంటుంది.

దీంతో పడవ ఎక్కిన ప్రతిసారీ తిరిగి ఒడ్డున దిగే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిందేనంటారు ఈ ఊరి ప్రజలు.

గ్రామంలో పాఠశాల లేకపోవడంతో...గ్రామంలో ఉన్న 12 మంది చదువుకునే పిల్లలు ప్రతిరోజూ అనకాపల్లి జిల్లాలోని తామరబ్బకు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది.

చదువు కోసం అనకాపల్లి జిల్లాలోని తామరబ్బ పాఠశాలకు సోలబొంగు గ్రామం నుంచి ప్రతి రోజూ పడవ ప్రయాణం చేసే స్వాతితో మాట్లాడినప్పుడు ఈ భయం స్పష్టంగా కనిపించింది. ఆమె మాటల్లో వినిపించింది కూడా.

"రోజూ పడవ మీద భయపడుతూనే స్కూల్ కి వెళ్తున్నాం. మేం ఇంటికి వచ్చే వరకు మా అమ్మ, నాన్న కూడా చాలా భయపడతారు. స్కూల్‌కు బయలుదేరే ముందు పడవపై జాగ్రత్త అని చెబుతారు" అని స్వాతి బీబీసీతో చెప్పారు.

సోలబొంగు గ్రామానికి వెళ్లిన బీబీసీ బృందానికి చదువు కోసం తామెలాంటి ప్రమాదకరమైన బోటు ప్రయాణం చేస్తున్నామో ఆరో తరతగతి చదువుతున్న స్వాతి చూపించారు.

రైవాడ రిజర్వాయర్, సోలబొంగు, విద్యార్థులు, అల్లూరి జిల్లా, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, గ్రామంలో ఉన్న 12 మంది పిల్లలు రోజూ అనకాపల్లి జిల్లాలోని తామరబ్బ పాఠశాలకు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది.

చదువుకోోవాలంటే పడవెక్కాల్సిందే

నాలుగు పడవలపై 12 మంది విద్యార్థులతో కలిసి బీబీసీ బృందం రైవాడ రిజర్వాయరులో సోలబొంగు నుంచి తామరబ్బ పాఠశాలకు బయలుదేరింది.

రిపోర్టర్: భయమేస్తుందా స్వాతి, ఈ పడవలో వెళ్తున్నప్పుడు...?

స్వాతి: వేస్తుంది సర్...

రిపోర్టర్: ఎందుకు?

స్వాతి: రిజర్వాయరులో పడవ అటుఇటు కదులుతున్నప్పుడు, ఎక్కడైనా తిరగబడుతుందేమోనని (పడవను గట్టిగా పట్టుకుని)

రిపోర్టర్: ఎన్నాళ్ల నుంచి స్కూల్ కి వెళ్తున్నావమ్మా...?

స్వాతి: ఆరేళ్లుగా...నేను స్కూల్ కి వెళ్లినప్పడల్లా మా అమ్మ, నాన్న కూడా చాలా భయపడతారు.

రిపోర్టర్: మరి మీ భయం పోవాలంటే ఏం చేయాలి..?.

స్వాతి: మా ఊరిలో స్కూల్ కావాలి, లేదంటే మా ఊరికి రోడ్డు వేయాలి.

రిపోర్టర్: మరి నువ్వు చదువుకుని ఏమవుతావ్..?

స్వాతి: డాక్టర్.

రైవాడ రిజర్వాయర్, సోలబొంగు, విద్యార్థులు, అల్లూరి జిల్లా, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, పిల్లలు స్కూలు నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు భయంగానే ఉంటుందని అంజలి తల్లి మంగమ్మ చెప్పారు.

అంజలిది మరో కథ

మూడో తరగతి చదువుతున్న అంజలిది మరో కథ.

చదువంటే ఇష్టం. పడవపై ప్రయాణం చేయాలంటే కష్టం.

పుస్తకాలను చేతితో గట్టిగా పట్టుకుని భయపడుతూ పడవలో కూర్చుని పాఠశాలకు చేరుకుంటుంది అంజలి.

అంజలి తల్లి మంగమ్మ బిడ్డకు ధైర్యం చెప్పి పంపించినా.. అంజలి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంటి గుమ్మం వద్ద బితుకుబితుకుమంటూ ఎదురు చూస్తుంది.

అంజలి బడి నుంచి రావడంతోనే తల్లిని చుట్టేసుకుంటుంది. అప్పడు కానీ మంగమ్మ ప్రాణం స్థిమితపడదు.

"మా ఊరిలో పాఠశాల లేదు. మాకు చదువు లేదు. అందుకే ప్రమాదమని తెలిసినా చదువు కోసం మా పిల్లలను ఆ పడవ మీద పంపిస్తున్నామండి. పాపను పంపినప్పటి నుంచి భయంగా ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ బెంగతోనే ఉంటాం" అని సోలబొంగు గ్రామానికి చెందిన మంగమ్మ బీబీసీతో చెప్పారు.

సోలబొంగు గ్రామం నుంచి తామరబ్బ పాఠశాలకు వెళ్తున్న 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులది ఇదే ఆవేదన.

"పిల్లలు బడికి వెళ్లిన తర్వాత వర్షం వస్తే గుండెలు హడలిపోతాయి. ఇంట్లో మాకు తిండి, తిప్పలు ఏదీ ఒంటబట్టదు. మేం వెంటనే పడవలు వేసుకుని ఒడ్డుకు వెళ్లిపోతాం" అని సోలబొంగు గ్రామానికి చెందిన సన్యాసిరావు బీబీసీతో చెప్పారు.

పడవలో వెళ్లే తల్లిదండ్రులు కొందరు... పిల్లలను ఒంటరిగా వదల్లేక రెండు, మూడేళ్లు వయసున్న తమ చిన్నపిల్లలను కూడా తామరబ్బ పాఠశాలకు పడవలపై తీసుకెళ్లి, మళ్లీ ఇంటికి తీసుకుని వస్తుంటారు.

రైవాడ రిజర్వాయర్, సోలబొంగు, విద్యార్థులు, అల్లూరి జిల్లా, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, డాక్టర్ కావడమే తన లక్ష్యమని ఆరో తరగతి చదువుతున్న స్వాతి చెప్పారు.

బడి లేదా రోడ్డు, ఏదో ఒకటి కావాలి: గ్రామస్థులు

సోలబొంగు నుంచి సమీపంలో ఉన్న బలిపురం మీదుగా దాదాపు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే తామరబ్బ చేరుకోవచ్చు.

కానీ ఆ మార్గం సరిగా లేదు.

దీంతో పిల్లలను రైవాడ రిజర్వాయరులో పడవపై పంపడం తప్పనిసరిగా మారింది.

రైవాడ రిజర్వాయర్ లోతు సుమారు 300 అడుగుల వరకు ఉంటుంది. పడవ ప్రయాణం రెండు కిలోమీటర్లు ఉంటుంది.

"మాకు రోడ్డు వేస్తే 6 కిలోమీటర్లు దూరమండి. కానీ రోడ్డు లేదు. అక్కడక్కడ గ్రావెల్ రోడ్డు ఉంది. అందుకే స్కూల్ కి పంపాలంటే రోజూ ఇలాగే పడవ మీద దిగబెట్టాలి. ప్రతి రోజూ గ్రామం నుంచి పాఠశాలకి పడవలపై పిల్లలను తీసుకుని వెళ్లిరావడం కష్టంగా ఉందండి. కానీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పడవలపై వంతుల వారిగా గ్రామస్థులం తీసుకుని వెళ్తున్నాం" అని గ్రామానికి చెందిన ఈశ్వరరావు చెప్పారు.

"సోలబొంగు వంటి గ్రామాలపై అధికారులు దృష్టి పెట్టాలి. విద్యార్థుల సమస్యతో పాటు ఊరి ప్రజలు వైద్యం, రేషన్ అవసరాలకు కూడా 20, 30 కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్య, వైద్యం అన్ని అందుబాటులోకి వస్తాయి. చదువు కోసం ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్న చిన్నారుల కోసమైనా ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి." అని గిరిజన సంఘం నాయకులు కె. గోవందరావు బీబీసీకి చెప్పారు.

రైవాడ రిజర్వాయర్, సోలబొంగు, విద్యార్థులు, అల్లూరి జిల్లా, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, సోలబొంగు గ్రామం రోడ్డు వేస్తే తమ సమస్య తీరుతుందని గ్రామస్తులు చెప్పారు.

స్కూలా, హాస్టలా.. ఏదో ఒకటి చేస్తాం: జిల్లా విద్యాశాఖాధికారి

చదువు కోసం చిన్నారులు ప్రాణాలను రిస్క్ తీసుకుని చేసే ప్రయాణాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మజీరావు దృష్టికి బీబీసీ తీసుకుని వెళ్లింది.

"అక్కడ స్కూల్ పెట్టేందుకు అవకాశం ఉందా? లేదంటే పిల్లలను ఏదైనా సమీప హాస్టల్‌లో చేర్పించాలా అనేది పరిశీలిస్తాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఆ పిల్లలు చదువు కోసం పడుతున్న కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తాం" అని అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖధికారి పి. బ్రహ్మజీరావు బీబీసీతో అన్నారు.

ప్రస్తుతానికైతే పాఠశాలకు వెళ్లడం మానలేం, అలాగే ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేయడం కష్టం అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అంటున్నారు.

ఈ సమస్యకి ప్రభుత్వం చూపించే పరిష్కారం పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)