ఏపీ: పదోతరగతి మార్కుల్లో ఎందుకీ గందరగోళం..అసలేం జరిగింది?

టెన్త్ క్లాస్ పరీక్షలు, రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన టెన్త్ పరీక్షా ఫలితాల్లో బాపట్ల జిల్లా కొల్లూరు హైస్కూల్‌కు చెందిన తేజస్వినికి 5 సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు రాగా సాంఘిక శాస్త్రంలో 23 మార్కులే రావడంతో ఫెయిల్‌ అయ్యారు.

వెంటనే రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఆమెకు సోషల్‌ స్టడీస్‌లోనూ 96 మార్కులు వచ్చాయి.

వైఎస్సార్‌ కడప జిల్లా ఎరగ్రుంట్ల‌కు చెందిన గంగిరెడ్డి మోక్షితకు కూడా సోషల్‌ స్టడీస్‌లో 21 మార్కులే వచ్చాయి. దీనిపై ఆమె రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే 84 మార్కులు వచ్చాయి.

దీంతో ఇందుకు బాధ్యులైన ఓ చీఫ్‌ ఎగ్జామినర్‌ సహా ఐదుగురు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ప్రశ్నపత్రాల మూల్యాంకన చరిత్రలో ఉపాధ్యాయులు సస్పెండ్‌ కావడం ఇదే తొలిసారని డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎస్‌ఎస్‌సి బోర్డు) అధికారులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టెన్త్ క్లాస్ పరీక్షలు, రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోషల్‌ స్టడీస్‌లో 21 మార్కులు వచ్చిన విద్యార్థినికి రీ వెరిఫికేషన్‌లో 84 మార్కులు వచ్చాయి.

మూల్యాంకనంపై వివాదం

పదో తరగతి పరీక్షలు బాగానే రాసినా, ఫెయిల్‌ అయిన విద్యార్థులు, ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, లేదా రీ వాల్యుయేషన్‌.. లేదా రెండింటి కోసమూ దరఖాస్తు చేసుకోవడం పరిపాటి.

ఇలా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అదే ఫలితం రావడం లేదా ఒకటి నుంచి పది మార్కులు పెరగడం సాధారణమే.

కానీ ఈ ఏడాది ఏకంగా ఓ విద్యార్ధినికి సాధారణ ఫలితాల్లో 23 మార్కులు రాగా రీ వాల్యుయేషన్‌లో 96 మార్కులు, మరో విద్యార్ధికి 21 నుంచి 84 మార్కులు పెరగడం.. మొత్తంగా ఈ ఏడాది రీ వాల్యుయేషన్‌లో 11వేలమందికి పైగా విద్యార్థుల జవాబుపత్రాల్లో మార్పులు జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ విపక్ష వైసీపీ, కాంగ్రెస్‌ ఆరోపించాయి.

టెన్త్ క్లాస్ పరీక్షలు, రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో తప్పిదాలకు ఐదుగురు టీచర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

రీకౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కి 66863 దరఖాస్తులు

ఏపీలో మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏప్రిల్‌ 23వ తేదీన పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు మొత్తం 4,98,585 (81.14శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల్లో 34,709 మంది 66,363 జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

మొత్తంగా రీకౌంటింగ్‌కు 64,251 దరఖాస్తులు, రీ వెరిఫికేషన్‌కి 2,112 దరఖాస్తులు వచ్చినట్టు పదో తరగతి బోర్డు ప్రకటించింది.

టెన్త్ క్లాస్ పరీక్షలు, రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, apbe.co.in

ఫొటో క్యాప్షన్, విజయరామరాజు, పాఠశాల విద్య డైరెక్టర్

పాస్ అయింది ఎంతమందంటే...

''34,709మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా, రీ వాల్యుయేషన్‌ తర్వాత 10,159 మంది విద్యార్థులకు సంబంధించిన 11,175 జవాబుపత్రాల్లో మార్పులు జరిగాయి. ఇందులో కేవలం 389మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్టు ఎస్‌ఎస్‌సి బోర్డు అధికారులు తెలిపారు. మిగిలిన వారికి మార్కుల్లో మార్పులు వచ్చాయి ఈ క్రమంలో గతంలో పాస్‌ అయిన వారి కొందరి మార్కులు పెరిగాయి.. మరికొందరి మార్కులు పెరిగినా ఉత్తీర్ణత మార్కులు సాధించలేకపోయారు.'' అని పాఠశాల విద్య డైరెక్టర్, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వి.విజయరామరాజు బీబీసీకి తెలిపారు.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ దరఖాస్తులకు సంబంధించి 2019 లో 19% విద్యార్థుల జవాబుపత్రాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్‌ కారణంగా పరీక్షలు జరగలేదు.

2022లో 20%, 2023లో 18%, 2024లో 17% జవాబు పత్రాల మార్కుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

2025లో మొత్తంగా వచ్చిన దరఖాస్తుల్లో 17% మార్పులు జరగగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 38మంది విద్యార్థులకు 51 నుంచి 80మార్కులు పెరిగాయి.

సహజంగా రీవాల్యుయేషన్‌లో ఒకటి నుంచి పది వరకు మార్కులు పెరుగుతాయి. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షల మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో 38 మంది విద్యార్థులకు అదనంగా 51 నుంచి 80 మార్కులు పెరిగాయి. 1నుంచి 5 మార్కులు పెరిగిన వారు 8,863 మంది ఉన్నారు. 1,506 మందికి 6 నుంచి 10 మార్కులు పెరిగాయి.

టెన్త్ క్లాస్ పరీక్షలు, రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏపీలో మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు.

తప్పులు ఎక్కడ జరిగాయంటే..

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో ఒక్కో పేపర్‌ను మూడు దశల్లో పర్యవేక్షిస్తారు. ముందుగా సహాయ ఎగ్జామినర్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన తర్వాత స్పెషల్‌ అసిస్టెంట్‌ మార్కుల లెక్కింపు, పరిశీలన చేస్తారు.

అనంతరం ఆ కేంద్రానికి చీఫ్‌ ఎగ్జామినర్‌గా ఉండే సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ లేదా ప్రధానోపాధ్యాయుడు వీటిని మరోసారి పరిశీలిస్తారు. ప్రతి జవాబు పత్రంపైనా ఈ ముగ్గురు సంతకం చేస్తారు.

అయితే మార్కులు లెక్కించేటప్పుడు ఓఎంఆర్‌ షీట్‌లో ఒకటి, లేదా అంతకంటే ఎక్కువ కాలమ్స్‌ను లెక్కించకుండా వదిలేశారు. జవాబు పత్రాల్లో వచ్చిన మార్కులను ఓఎంఆర్‌ షీట్‌లో వేసేటప్పుడు చాలా మంది తప్పుగా నమోదు చేశారు.

జవాబు పత్రాల్లోని కొన్ని సమాధానాలకు ఎలాంటి మార్కులు ఇవ్వకుండా వదిలేయడం, మరికొన్నింటికి సున్నా మార్కులు ఇవ్వడం లాంటివి చోటుచేసుకున్నాయని రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌ ప్రక్రియ సందర్భంగా అధికారులు గుర్తించారు.

టెన్త్ క్లాస్ పరీక్షలు, రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Srinivasa reddy

ఫొటో క్యాప్షన్, శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌

‘‘రెండు చోట్ల మాత్రమే పొరపాట్లు జరిగాయి’’

"కేవలం రెండు చోట్ల మాత్రమే పొరపాటున అలా జరిగింది. ఇందుకు సంబంధించి ఐదుగురు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అన్నమయ్య జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు సస్పెండ్‌ అయ్యారు. ఇంకెక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.. కానీ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ఎక్కువ తప్పులు జరిగినట్టు తప్పుడు ప్రచారం జరిగింది. 99.76శాతం మూల్యాంకనం కచ్చితంగా సాగింది. కేవలం 0.24పర్సంట్‌ మాత్రమే తేడా వచ్చింది. ఇప్పుడు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌తో అది కూడా క్లియర్‌ అయింది" అని ఏపీ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.వి శ్రీనివాసరెడ్డి బీబీసీకి తెలిపారు.

మొత్తంగా ఏ విద్యార్ధికీ నష్టం జరగలేదనీ, వాళ్లు ఇచ్చిన జవాబుల మేరకే మార్కులు వచ్చాయని ఆయన చెప్పారు.

‘‘ఎక్కడో ఓ రెండు చోట్ల పొరపాటున జరిగిన తప్పిదాలకు ఉపాధ్యాయులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు. మల్టిపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌కి ఎక్కడా ఎవరికీ తేడా రాదు. ఎవరు దిద్దినా ఒకేలా మార్కులు వస్తాయి.. వ్యాసరూపంలో ఉండే ప్రశ్నల వద్దే తేడా వస్తుంది. అందరూ ఒకేలా మార్కులు వేయకపోవచ్చు.. ఇప్పుడు రీ వాల్యుయేషన్‌లో దిద్దే మాస్టారు ఒక మార్కు అటు ఇటుగా వేయవచ్చు.. ఈ ఏడాది టెన్త్‌ వాల్యుయేషన్‌ వివాదాస్పదంగా మారడం బాధాకరం.. ఉపాధ్యాయుల నైతికతను దెబ్బతీయకుండా ప్రభుత్వం వ్యవహరించాలి’’ అని స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. సాయి శ్రీనివాస్‌ బీబీసీతో చెప్పారు.

టెన్త్ క్లాస్ పరీక్షలు, రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, facebook.com/BotchaBSN

ఫొటో క్యాప్షన్, గతంలో ఎన్నడూ ఇంత అధ్వాన్నంగా మూల్యాంకనం జరగలేదని విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఎప్పుడైనా ఇలా జరిగిందా?: బొత్స

పదో తరగతి మూల్యాంకనం ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ జరగలేదని విద్యాశాఖ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.

బీబీసీతో మాట్లాడుతూ కేవలం రికార్డ్‌ టైంలో ఫలితాలు ఇవ్వాలనే తొందరలోనే మూల్యాంకనం గందరగోళంగా చేశారని ఆరోపించారు.

వాల్యుయేషన్‌కి సంబంధించి ఐదుగురు ఉపాధ్యాయులు సస్పెండ్‌ కావడం ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఓ విద్యార్ధినికి వాల్యుయేషన్‌లో 23 మార్కులు, రీ వాల్యుయేషన్‌లో 96మార్కులు రావడం ఎక్కడైనా జరిగి ఉంటుందా.. రీ వాల్యుయేషన్‌ ఫలితం రాకముందు ఆ విద్యార్ధిని ఎంత మనో వేదనకు గురై ఉంటుందని ఆయన అన్నారు.

టెన్త్ క్లాస్ పరీక్షలు, రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్, ఏపీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Sai Srinivas

ఫొటో క్యాప్షన్, సాయి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు

ఎప్పటిలానే ఇప్పుడు కూడా..

విద్యాశాఖపై రాజకీయ విమర్శలు చేయడం దారుణం. రికార్డు టైంలో ఫలితాలు విడుదల చేశారనడం సరికాదు. గతేడాది 2024లో ఏప్రిల్‌ 22న ఫలితాలు విడుదల చేస్తే ఈ ఏడాది ఒక రోజు ఆలస్యంగానే ఏప్రిల్‌ 23వ తేదీన ఫలితాలు విడుదల చేశాం. గతేడాది ఒక్కో ఎగ్జామినర్‌ రోజుకు 43 పేపర్లు దిద్దితే ఈ ఏడాది కేవలం 40పేపర్లు మాత్రమే దిద్దారు. అలానే 2024లో 13వేల742మంది ఎగ్జామినర్లు పేపర్‌ వాల్యుయేషన్‌ చేయగా, ఈ ఏడాది 16వేల మంది వాల్యుయేషన్‌ చేశారు'' అని ఏపీ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.వి శ్రీనివాసరెడ్డి బీబీసీకి చెప్పారు.

‘‘2019లో 23వేలమంది రీవాల్యుయేషన్‌కి అప్లయ్‌ చేసుకుంటే 4495మంది మార్కుల్లో మార్పులు వచ్చాయి. 2022లో 41 వేల దరఖాస్తులకు గానూ 8వేల మంది మార్కుల్లో మార్పులు చేశారు. 2023లో 61వేలకి గానూ 10వేల మందికి, 2024లో 55 వేలకి గానూ 9వేల మంది మార్కుల్లో మార్పులు చేశారు. ఈ ఏడాది 66వేల దరఖాస్తులకుగానూ 11వేల జవాబు పత్రాల్లో మార్పులు వచ్చాయి.’’

‘‘ ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా దరఖాస్తులు వచ్చాయి’’ అని చెప్పారు.

‘‘రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్‌ తుది ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచామని, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో మార్కులు పెరిగిన విద్యార్థులు జూన్‌ 5 నుంచి 10 వరకు ట్రిపుల్‌ ఐటీలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారనీ అదేవిధంగా ఏపీ మోడల్‌ స్కూల్‌ మోడల్‌ కళాశాలలకు అప్లయ్‌ చేసుకోవచ్చని’’ శ్రీనివాసరెడ్డి సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)