‘ఆపరేషన్‌ సిందూర్’ అనే పేరు ఎవరు పెట్టారు? దాడులపై భారత ఆర్మీ ఏం చెప్పింది?

ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ దాడుల అనంతరం మురీద్కే ప్రాంతాన్ని పాకిస్తాన్ సైనికులు పరిశీలించారు.

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌‌పై భారత్ క్షిపణి దాడులు చేసింది.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.44 గంటలకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పత్రిక ప్రకటన విడుదల చేసింది.

‘‘పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఈ ఆపరేషన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ స్థావరాల నుంచే భారత్‌పై ఉగ్రవాద దాడులకు ప్రణాళిక వేసి అమలు చేశారు. మొత్తం తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాం'' అని ఆ ప్రకటనలో తెలిపింది.

అర్ధరాత్రి ఒంటి గంట 51 నిమిషాలకు ‘న్యాయం జరిగింది. జై హింద్’ అని భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ఫోటోను 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.

భారత విదేశాంగమంత్రి ఎస్.జయశంకర్ తెల్లవారిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌పై ప్రకటన చేశారు.

‘సరైన సమయంలో సరైన విధంగా స్పందించాం. ఉగ్రవాదాన్ని సహించబోం. భారత్ మాతా కి జై’ అని ఆపరేషన్ సిందూర్ ఫోటోను పోస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, PIB/Video Grab

ఫొటో క్యాప్షన్, కల్నల్ సోఫియా ఖురేషి

అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 మధ్య భారత్ దాడులు

పాకిస్తాన్‌పై దాడుల వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు.

సీమాంతర దాడులపై స్పందించే హక్కు భారత్‌కు ఉందని, అందుకు అనుగుణంగా భారత్ దాడులు చేసిందని విక్రమ్ మిస్రీ తెలిపారు.

ఇది రెచ్చగొట్టే చర్య కాదని ఆయన అన్నారు. పహల్గాం దాడి అత్యంత క్రూరమైనదని ఆయన అన్నారు.

జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను దెబ్బతీయడమే పహల్గాం దాడి లక్ష్యమని, అభివృద్ధిని దెబ్బతీసి ఈ ప్రాంతం వెనుకబడేలా చేయాలన్నది వారి లక్ష్యమని మిస్రీ ఆరోపించారు.

భారత్‌లో మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరిగిందని తెలిపారు.

''పహల్గాం దాడి దర్యాప్తులో ఉగ్రవాదులకు పాకిస్తాన్‌తో సంబంధాలు బయటపడ్డాయి. ఉగ్రవాద స్థావరాలను తొలగించేందుకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు'' అని విక్రమ్ మిస్రీ చెప్పారు.

మరిన్నిదాడులు జరగబోతున్నాయని భారత్‌కు సమాచారం ఉందన్నారు.

భారత ఆర్మీ అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.

‘‘ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రవాదదాడిలో బాధితులుగా ఉన్న సాధారణ పౌరుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించాం. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, వాటిని పూర్తిగా ధ్వంసం చేశాం’’ అని సోఫియా తెలిపారు.

ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Reuters

ఆపరేషన్ సిందూర్ అంటే ఏంటి?

నల్లని బ్యాక్‌గ్రౌండ్‌పై తెల్లని అక్షరాలతో ''ఆపరేషన్ సిందూర్'' అని రాసి ఉంది.

ఇంగ్లిష్‌లో రాసిన అక్షరాల్లో ''SINDOOR''లో ఒక 'O'లో కుంకుమతో నిండిన గిన్నె ఉంది. మరో 'O' చుట్టూ చెల్లాచెదురుగా కుంకుమ పడిఉంది. భారత్‌లో మహిళలు సిందూరంను పవిత్రంగా భావిస్తారు. పెళ్లయిన మహిళలు పాపిట్లో సిందూరం పెట్టుకుంటారు.

ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్ సిందూర్ పేరును ప్రధాని స్వయంగా పెట్టారని పీటీఐ తెలిపింది.

ఆపరేషన్ సిందూర్ పేరు పెట్టిన ప్రధాని

పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గౌరవంగా ఆపరేషన్ సిందూర్ అన్న పేరును స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పెట్టారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

భారత్‌లోని మగవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని, కాల్పుల్లో భర్తలు చనిపోవడంతో భార్యలు వితంతువులయ్యారని, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని గత వారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు ఇండియా టుడే తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)