అందమైన హిమాలయాలు ఎందుకు కనిపించకుండా పోతున్నాయి?

- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నేను హిమాలయాలను చూస్తూనే నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో పెరిగాను. భూమి మీద అత్యంత ఎత్తైన ఆ పర్వతాల అందమైన దృశ్యాలను ఇప్పుడు చూడలేకపోతున్నాను. కాఠ్‌మాండు వెళ్లిన ప్రతిసారీ ఆ పర్వత శ్రేణులను ఎలాగైనా చూడాలనుకుంటాను. కానీ ఈ రోజుల్లో ఆ అదృష్టం లేదు'' అని నేపాల్ పర్యటక ప్రాంతమైన నగర్కోట్‌లో 1996 నుంచి హోటల్ నిర్వహిస్తున్న యోగేంద్ర శాక్య చెప్పారు.
శాక్య ఆవేదనకు ప్రధాన కారణం వాయుకాలుష్యమే. దీని ప్రభావంతో హిమాలయ శ్రేణులపై దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. చివరకు ఒకప్పుడు నిర్మలమైన ఆకాశంతో అందంగా సాత్కారించే వసంత రుతువు, శరదృతువు కాలంలోనూ అదే పరిస్థితి ఉంటోంది.
''గత ఏప్రిల్ నెలలో నేను ప్రయాణిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాఠ్‌మాండులో దిగడానికి ముందు ఇరవైసార్లు ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. పొగమంచు కమ్మేయడం వల్ల విమానాశ్రయం కనిపించలేదు. పగలు ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు హిమాలయాలను చూడాలని కాస్త ఎత్తైన ప్రదేశంలోని హోటల్ లో ఉన్నాను. రెండు వారాలు అక్కడే గడిపినా అలాంటి రోజు రానేలేదు'' అని శాక్య చెప్పారు.


ఫొటో సోర్స్, Yogendra Shakya
సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబరు వరకూ ఈ ప్రాంతంలో వర్షాకాలం. ఆ సమయంలో పొగమంచు కన్నా రుతుపవనాల మేఘాలే హిమాలయాలను కమ్మేస్తాయి. మార్చి నుంచి మే నెల వరకూ, అలాగే అక్టోబరు, నవంబరు నెలల్లో ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల హిమాలయాలు చక్కగా కనిపిస్తుంటాయి.
కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనావృష్టి పరిస్థితులు, తీవ్రమవుతున్న వాయుకాలుష్యం, గాడి తప్పుతున్న వసంతకాలం తదితర కారణాల వల్ల ఇప్పుడు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. ఈ పరిస్థితులు డిసెంబరు నెల తొలినాళ్ల నుంచే మొదలవుతున్నాయి.

కాఠ్‌మాండుకు కాస్త దూరంలోనున్న నగర్కోట్ ప్రధాన వాంటేజ్ పాయింట్ వద్ద కూడా పొగమంచే కనిపిస్తోంది. హిమాలయాలు కనిపించట్లేదు. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో హిమాలయాల అందాలను ఆస్వాదించవచ్చనే పేరు ఉంది.
హిమాలయాల సమీప ప్రాంతంలో క్రమేపీ పెరుగుతున్న పొగమంచు తీవ్రత, దాని కాలవ్యవధి కారణంగా వాటి దృశ్యమానత (విజిబిలిటీ) తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దుమ్ము, అడవుల్లో కార్చిచ్చు లాంటి వాటి నుంచి వెలువడుతున్న పొగ తదితర కాలుష్య కారకాల సమ్మేళనంతో పొగమంచు ఏర్పడుతోంది. దీంతో దృశ్యమానత 5వేల మీటర్లు (16,400 అడుగులు) కన్నా తక్కువకు పడిపోయింది.

ఫొటో సోర్స్, Yunish Gurung
‘‘హియాలయాలు కనిపించకపోతే బిజినెస్ లేనట్లే...’’
పొగమంచు వల్ల వ్యాపారం 40 శాతం తగ్గిపోయిందని నేపాల్ లో ట్రెక్కింగ్ మహిళా గైడ్ లక్కీ ఛత్రి చెప్పారు.
''గత ఏడాది ఒక ఉదాహరణ, పొగమంచు వల్ల హిమాలయాలను చూపించలేక పోయినందుకు ఓ ట్రెక్కర్ల బృందానికి మేము పరిహారం చెల్లించాం'' అని ఆమె వెల్లడించారు.
1986 నుంచి డజనుసార్లు నేపాల్ లో పర్యటించిన జాన్ కారోల్ అనే ఆస్ట్రేలియా పర్యటకుడు ఒకరు... హిమాలయాలను చూడలేకపోవడం పెద్ద లోటు అన్నారు.
''ఇంతలా పొగమంచు కమ్మేయడం పదేళ్ల కిందటి వరకూ నేనెప్పుడూ చూడలేదు. నాలాంటి పర్యటకులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు'' అని చెప్పారు.
ట్రెక్కింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ట్రెక్కింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ పశ్చిమ గండకి రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ కేసీ చెప్పారు.
''మా సభ్యులైన ట్రెక్కింగ్ ఆపరేటర్లంతా తీవ్రమైన ఇబ్బందులు అనుభవిస్తున్నారు. సందర్శకులు రాకపోవడం వల్ల బిజినెస్ లేదు. చాలామంది వేరే వృత్తిలోకి మారిపోవాలనీ ఆలోచిస్తున్నారు'' అని బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Lucky Chhetri
భారతదేశం, పాకిస్తాన్ వైపు నుంచీ అదే పరిస్థితి...
భారతదేశం వైపు నుంచి కూడా మధ్య హిమాలయాల సమీపంలో గతంలో కన్నా దట్టంగా పొగమంచు కమ్ముకోవడం ఎక్కువైందని టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు చెబుతున్నారు.
గతంకన్నావాతావరణ పరిస్థితులు మారాయి. అకాల వర్షాలు, పొగమంచు కమ్మేయడం ఎక్కువైంది. దీనికారణంగా కుదరని పరిస్థితుల్లో, మరోసారైనా హిమాలయాలను చూడాలని చాలామంది పర్యటకులు ప్రయత్నిస్తున్నారని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టూరిజం బిజినెస్ నిర్వాహకురాలైన మాలిక విర్ది చెప్పారు.
మరోవైపు పట్టణాలకు దూరంగా ఉన్న పాకిస్తాన్‌లోని పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో పొగమంచు ప్రభావం తక్కువగా ఉంది. అయితే ఒకప్పుడు పెషావర్, గిల్గిట్ తదితర ప్రాంతాల నుంచి కూడా సులభంగా చూడగలిగిన పర్వత శ్రేణులు ఇప్పుడు కనిపించట్లదేదని స్థానికులు చెబుతున్నారు.
''పొగమంచు ఎక్కువసేపు ఉంటోంది. పర్వతాలను గతంలో మాదిరిగా చూడలేకపోతున్నాం'' అని పాకిస్తాన్‌లోని పర్యావరణ పరిరక్షణ సంస్థ మాజీ అధ్యక్షుడు అసిఫ్ షుజా అన్నారు.

కమ్మేస్తున్న పొగమంచు, దుమ్ము తుపానులు...
వాయు కాలుష్యం స్థాయిల్లో దక్షిణాసియా నగరాలే ప్రపంచంలో ముందుంటున్నాయి. ప్రజారోగ్యంపై విషవాయువుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. తరచుగా రవాణా వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడుతోంది. పాఠశాలలకూ సెలవులు ప్రకటిస్తున్నారు.
వాహనాలు, పరిశ్రమల ఉద్గారాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన నిర్మాణాల నుంచి ధూళి, డ్రై గ్రావెల్ రోడ్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త తగులబెట్టడం...ఇవన్నీ వాయుకాలుష్యానికి ప్రధాన కారణాలే.
అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చులతో పాటు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ లో రైతులు పంట అవశేషాలను పొలాల్లోనే తగులబెట్టడం కూడా సుదీర్ఘకాలం వర్షాభావ పరిస్థితులు ఏర్పడటానికి కారణమవుతున్నాయి.
''దక్షిణాసియాలో పొగమంచు, ధూళి తుపానులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, ఇతరత్రా కారణాల వల్ల అవి కొనసాగుతున్నాయి'' అని సౌత్ ఆసియా మెట్రలాజికల్ అసోసియేషన్ కు చెందిన డాక్టర్ సోమేశ్వర్ దాస్ బీబీసీకి చెప్పారు.
నేపాల్ పశ్చిమ ప్రాంతంలో ప్రధాన పర్యాటక కేంద్రం పోఖారాలోని విమానాశ్రయంలో 2024లో రికార్డు స్థాయిలో పొగమంచు కురిసింది. నేపాల్ వాతావరణం, జల విభాగం గణాంకాల ప్రకారం 2020లో 23 రోజులు, 2021లో 84 రోజుల పాటు పొగమంచు పడగా అది 2024 సంవత్సరంలో 168 రోజులకు చేరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














