జిన్నా టవర్: గుంటూరులోపాకిస్తాన్ జాతిపిత పేరుతో స్తూపం ఎందుకుంది? చరిత్రలో ఏం జరిగింది?

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
(ఈ కథనం తొలిసారి 2021 నవంబర్ 11న బీబీసీ తెలుగులో ప్రచురితమైంది)
గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖ వ్యాపార కూడలిలో పాకిస్తాన్ జాతిపిత పేరుతో స్తూపం ఉందంటే చాలామంది ఆశ్చర్యపోతారు. మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించిన ఈ టవర్ ఒక సెంటర్‌గా గుంటూరు నగరంలో విశేషంగా కనిపిస్తుంది.
ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ జిన్నా టవర్ సెంటర్ ఆ నగరంలో మత సామరస్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది.
అదే నగరంలో మాయా బజార్ గా పిలుచుకునే ముస్లింల వ్యాపార సముదాయానికి లాల్ బహుదూర్ శాస్త్రి పేరు ఉండగా, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జిన్నా టవర్ ఉండటమే గుంటూరు ప్రత్యేకత అని కొందరు అంటారు.
ఇంతకీ జిన్నా పేరుతో ఇక్కడ టవర్ ఎందుకు కట్టారు? దాని నేపథ్యం ఏంటి?


స్వతంత్రానికి పూర్వమే....
భారత స్వతంత్ర ఉద్యమంలో మొహమ్మద్ ఆలీ జిన్నా పాత్ర గురించి అందరికీ తెలిసిందే. వృత్తిరీత్యా అడ్వొకేట్ అయిన జిన్నా, జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో తొలుత ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ముస్లింలీగ్ స్థాపించారు.
కొంతకాలం లండన్ వెళ్లి న్యాయవాదవృత్తిలో గడిపిన జిన్నా 1934లో తిరిగి ఇండియాకు వచ్చారు. ముస్లింలీగ్ నేతృత్వంలో ప్రత్యేక దేశం కోసం ప్రయత్నించారు.
1942 నాటికి గుంటూరు నుంచి ఎస్.ఎం.లాల్ జాన్ బాషా( కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం నేత లాల్ బాషా తాత) ఎమ్మెల్యేగా పని చేశారు. ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఆయన రెండుమార్లు ప్రాతినిధ్యం వహించారు.
లాల్ జాన్ బాషా పేరుతోనే ప్రస్తుతం గుంటూరులో లాలాపేట ఉంది. స్వతంత్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మొహమ్మద్ ఆలీ జిన్నాతో గుంటూరులో భారీ సభ నిర్వహించాలని లాల్ జాన్ బాషా ప్రయత్నం చేశారు.
స్వయంగా జిన్నాను ఆహ్వానించేందుకు గుంటూరుకి చెందిన కొందరు ప్రతినిధులు బొంబాయి వెళ్లారు. ఆయన అంగీకరించడంతో గుంటూరులో జిన్నా రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం జిన్నా టవర్ సెంటర్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారితో సభ నిర్వహణకు సిద్ధమయ్యారు. అయితే తాను రాలేకపోతున్నానంటూ చివరి నిమిషంలో జిన్నా సమాచారం అందించారు.
ఆయన స్థానంలో జిన్నా సన్నిహితుడు జుదా లియాఖత్ అలీఖాన్ ఈ సభకు హాజరయ్యారు. సభలో స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకటప్పయ్య పంతులు, కాశీనాథుని నాగేశ్వర రావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, కల్లూరి చంద్రమౌళి సహా పలువురు పాల్గొన్నట్టు రికార్డులు చెబుతున్నాయి.

జిన్నా రాకకు గౌరవార్థమే..
మొహమ్మద్ అలీ జిన్నా గుంటూరు రాక సందర్భంగా ఆయన గౌరవార్థం ఈ టవర్ నిర్మాణం జరిగిందని లాల్ జాన్ బాషా కుటుంబీకులు చెప్పారు.
''జిన్నాతో మా తాతగారికి స్నేహం ఉండేది. 1941 ప్రాంతంలో సత్తెనపల్లి సమీపంలోని కొన్ని గ్రామాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న మా తాతగారు మత సామరస్యం కోసం ప్రయత్నించడంతో పాటుగా కేసుల్లో ఉన్న వారి పక్షాన నిలిచారు. న్యాయవాది అయిన జిన్నా సహాయం తీసుకున్నారు. 14 మందికి జీవిత ఖైదు శిక్షగా స్థానిక కోర్టు విధిస్తే, బొంబాయి హైకోర్టులో దానిని రద్దు చేయించారు. దాంతో జిన్నా గుంటూరు వస్తున్నారనే సమయంలో గౌరవార్థం టవర్ నిర్మించాలని నిర్ణయించారు. ఉద్యమ పని ఒత్తిళ్లతో జిన్నా రాలేకపోయినప్పటికీ ఆయన పేరుతో టవర్‌ని అప్పుడే ప్రారంభించారు'' అని గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ వెల్లడించారు.
జియావుద్దీన్ దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే లాల్‌జాన్ బాషాకు సోదరుడు.
''1942 నుంచి 45 మధ్యలో ఈ టవర్ పనులు జరిగాయి. 1945 నుంచి ఈ టవర్ నిర్మాణంతో అది జిన్నా టవర్ సెంటర్ గా మారింది'' అని జియవుద్దీన్ బీబీసీకి తెలిపారు. తన తాత లాల్ జాన్ బాషా చొరవతోనే జిన్నా టవర్ నిర్మించారని ఆయన వివరించారు

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ జాతిపిత పేరుతో ఉన్న ఈ సెంటర్ పేరు మార్చాలనే డిమాండ్..
గుంటూరు ప్రధాన వ్యాపార కూడలిగా ఉన్న జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలనే డిమాండ్ గతంలో వినిపించాయి. దేశ విభజనకు మూలమైన పాకిస్తానీ నేత పేరును కొనసాగించకూడదని కొందరు డిమాండ్ చేసినట్లు స్థానికులు వెల్లడించారు.
"గుంటూరులో ముస్లిం జనాభా ఎక్కువ. అయినా హిందూ, ముస్లింల ఐక్యతకు ఎన్నడూ సమస్య రాలేదు. నగరంలో ముస్లిం ప్రముఖుల పేర్లతో వీధులు, రోడ్లు చాలా ఉంటాయి. అందులో భాగంగానే జిన్నా టవర్ సెంటర్ కూడా ఉంది. కార్గిల్ యుద్ధం వంటి కొన్ని సందర్భాల్లో కొందరు భావోద్వేగాలతో జిన్నా టవర్ విషయంలో కొందరు అభ్యంతరాలు పెట్టారు. కానీ ఆ ప్రయత్నాలకు ఆమోదం లభించలేదు. నేటికీ మత సామరస్యానికి నిలయంగా జిన్నా టవర్ కొనసాగుతోంది'' అని స్థానికంగా లెక్చరర్ గా పని చేస్తున్న ఎం.సురేశ్ బాబు తెలిపారు.

పాకిస్తానీలు కూడా ఆశ్చర్యపోయారు.
జిన్నాకు ఇండియాలో ఎక్కడా లేని విధంగా గుంటూరులో టవర్ నిర్మించి గౌరవించడం పాకిస్తానీలను కూడా ఆశ్చర్యపరిచిందని ముస్లిం జేఏసీ నేత మహమద్ కలీం తెలిపారు.
"ముషారఫ్ హయంలో ఓసారి గుంటూరు జిన్నా టవర్ గురించి ఆరా తీశారు. అప్పట్లో ఎంపీగా ఉన్న లాల్ జాన్ బాషా ఈ టవర్ ఫొటోలను పాకిస్తాన్ హైకమిషనర్ కి అందించారు. వాటిని చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు. లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంలో మత సామరస్యానికి తార్కాణంగా ఉన్న జిన్నా టవర్ ఘనతను వారు కూడా గుర్తించారు'' అన్నారు కలీం.
''జిన్నా కూడా దేశ విభజనకు ముందు స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రముఖుడు కాబట్టే ఆయన పేరు నేటికీ నిలుస్తోంది" అన్నారాయన.

కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
జిన్నా టవర్ సెంటర్ లో ఇటీవల గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటర్ ఫౌంటెయిన్, గార్డెన్, లైటింగ్ వంటివి నిర్వహిస్తున్నారు.
సుమారు 7లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో 20 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ నగరంలో మొహమ్మద్ ఆలీ జిన్నా పేరుతో టవర్ ఉండడమే కాకుండా ప్రస్తుతం ఆ సెంటర్ నగరంలో ఓ పెద్ద వ్యాపార కేంద్రంగా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














