విమానాలకు అరిగిపోయిన టైర్లు.. రన్ వేలపై నెమళ్లు, జింకలు, ఆవులు.. డీజీసీఏ రిపోర్ట్‌లో ఏం ఉంది? పైలట్లు ఏం చెప్తున్నారు?

ఎయిర్ ఇండియా, డీజీసీఏ, విమాన ప్రమాదం, ఎయిర్‌పోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవలి ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం ఈ దశాబ్దంలో అతిపెద్దది.
    • రచయిత, ఇషాద్రితా లాహిరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీ, ముంబయి సహా దేశంలోని అనేక ప్రధాన విమానాశ్రయాలను ఆడిట్ చేసినట్లు ఈ నెల 26న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

అహ్మదాబాద్‌లో ఈ నెల 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఈ ఆడిట్ నిర్వహించారు.

ఏ విమానయాన సంస్థ లేదా విమానాశ్రయం పేరును ఆ ప్రకటనలో డీజీసీఏ ప్రస్తావించనప్పటికీ దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో అనేక లోపాలు ఉన్నాయని, భద్రత నియమాల ఉల్లంఘన జరుగుతోందని తెలిపింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానయాన రంగంలో తనిఖీలు, దర్యాప్తులు పెరిగాయి.

ఫ్లైట్ ప్రయాణ సమయాలు, క్యాబిన్ సిబ్బంది పని గంటలకు సంబంధించిన నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఎయిర్‌ఇండియాపై కొన్నిరోజుల క్రితం డీజీసీఏ చర్య తీసుకుంది.

ముగ్గురు అధికారులను తొలగించాలని కూడా ఎయిర్‌ఇండియాను ఆదేశించింది.

దీనిపై ఎయిర్ ఇండియా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎయిర్‌లైన్ కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఐఓసీసీ) పర్యవేక్షణ బాధ్యత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే కంపెనీ సీవోవో చేతుల్లో ఉంటుందని తెలిపింది.

ఐఓసీసీ అనేది ఏ ఎయిర్‌లైన్ కంపెనీలో అయినా ఒక ముఖ్యమైన భాగం. విమానాల భద్రత, అంతరాయం లేకుండా విమానాల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం దీని బాధ్యత. ఎయిర్‌లైన్ కంపెనీ విమానాల కార్యకలాపాలకు సంబంధించిన అన్ని అంశాల రియల్ టైమ్ ప్లానింగ్, పర్యవేక్షణ, నిర్వహణకు ఐఓసీసీ జవాబుదారీగా ఉంటుంది.

విమానాలు, డ్యూటీ రోస్టర్లు(పనిగంటల షెడ్యూల్) సహా పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే ఎయిర్‌లైన్ కార్యకలాపాల విభాగం పరిధిలో ఇది ఉంటుంది.

డీజీసీఏ రిపోర్టుపై అనేక మంది ప్రొఫెషనల్ పైలట్లు, విమానయాన రంగ నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎయిర్ ఇండియా, డీజీసీఏ, విమాన ప్రమాదం, ఎయిర్‌పోర్టులు

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

ఫొటో క్యాప్షన్, విమానంలో లోపాలను లాగ్‌బుక్‌లో పొందుపర్చడం లేదని డీజీసీఏ తెలిపింది.

డీజీసీఏ ప్రకటనలో ఏముంది?

ఆడిట్ సమయంలో విమానాలకు సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను తనిఖీ చేసినట్టు డీజీసీఏ తెలిపింది.

విమాన కార్యకలాపాలు, భద్రత, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విమాన ప్రయాణానికి ముందు పైలట్‌కు వైద్య పరీక్షలు వంటి అంశాలను డీజీసీఏ పరిశీలించింది.

సరిగ్గా కనిపించని రన్‌వే లైన్లు, మూడేళ్లుగా డేటాను అప్‌డేట్ చేయకపోవడం వంటి అనేక లోపాలను డీజీసీఏ గుర్తించింది.

ఓ ఘటనలో టైర్లు అరిగిపోవడం వల్ల ఎగరడానికి ముందు విమానాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని డీజీసీఏ తెలిపింది.

గతంలో రిపోర్టు చేసిన లోపాలనే విమానాల్లో మళ్లీ మళ్లీ గుర్తించినట్లు తాజా నివేదికలో పొందుపరిచింది. పర్యవేక్షణ లేకపోవడం, లోపాలను సరిదిద్దకపోవడం వంటివాటికి ఇది నిదర్శనమని చెప్పింది.

''విమానాల నిర్వహణకు సంబంధించిన విషయాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మాన్యువల్ (ఏఎంఎం) ప్రకారం అవసరమైన భద్రత జాగ్రత్తలను ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ (ఏఎంఈ) తీసుకోవడంలేదు. కొన్ని చోట్ల, మరమ్మతుల ప్రక్రియల్లో ఏఎంఈ పాల్గొనడంలేదు. విమానం వ్యవస్థలో గుర్తించిన లోపానికి సంబంధించిన సమాచారం లాగ్‌బుక్‌లో నమోదు చేయడంలేదు" అని డీజీసీఏ తెలిపింది.

ఎయిర్ ఇండియా, డీజీసీఏ, విమాన ప్రమాదం, ఎయిర్‌పోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమానం ల్యాండింగ్‌కు రన్‌ వే లోని సెంట్రల్ లైన్ కీలకం.

పైలట్లు ఏమంటున్నారు?

డీజీసీఏ నివేదికపై వివిధ విమానయాన సంస్థలకుకు చెందిన ముగ్గురు పైలట్లతో బీబీసీ మాట్లాడింది.

తాము పనిచేసే ఎయిర్‌లైన్ సంస్థ మీడియా పాలసీకి వారంతా కట్టుబడి ఉండాలి. దీంతో పేర్లు వెల్లడించకూడదనే షరతుపై వారు బీబీసీతో మాట్లాడారు.

విమాన ప్రయాణాన్ని సరైన సమయానికి పూర్తి చేయాలనే ఒత్తిడి, తక్కువ టర్న్ అరౌండ్ సమయం(ల్యాండింగ్ తర్వాత తిరిగి ఎగరడానికి వీలుగా విమానాన్నిసన్నద్ధం చేయడం) వల్ల ఏఎంఈ సూచించే సాంకేతిక సూచనలను పాటించడం కష్టతరం అవుతుందని ఒక పైలట్ అన్నారు.

"చివరి నిమిషంలో ఏఎంఈ ఏదైనా లోపాన్ని గుర్తిస్తే, విమానం ఎగరడానికి సురక్షితమేనా కాదా అన్నది నిర్ణయించడం కష్టమవుతుంది" అని ఆయన అన్నారు.

చాలా తక్కువ టర్న్‌అరౌండ్ సమయం కారణంగా, విమానం నిర్వహణకు తగినంత సమయం ఉండదని పైలట్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఏఎంఈలు చివరి క్షణంలో ఏఎంఎం నియమాలను అమలు చేస్తారని తెలిపారు.

ఏ పరికరాలు లేదా భాగాలు లేకుండా విమానం ఎగరగలదో మాన్యువల్ చెబుతుందని, దీనివల్ల విమానంపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు.

"సంక్లిష్టంగా ఉండే ఓ వ్యవస్థ చెడిపోతే, దాని పరిణామాలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, బ్యాకప్ వ్యవస్థ కూడా విఫలమైతే ఏం జరుగుతుంది? టేకాఫ్ అయ్యే ప్రాంతం, వాతావరణంపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. టైంకు సంబంధించిన ఒత్తిడి పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది. దీనివల్ల ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించలేకపోతున్నాం'' అని ఆయన బీబీసీతో అన్నారు.

ఎయిర్ ఇండియా, డీజీసీఏ, విమాన ప్రమాదం, ఎయిర్‌పోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డీజీసీఏ నిత్యం తనిఖీలు నిర్వహించాలని నిపుణులు అంటున్నారు.

‘రన్‌వేపై గుంతలున్న విమానాశ్రయాలూ ఉన్నాయి’

రన్‌వేపై అస్పష్టంగా ఉండే సెంట్రల్ లైన్ గురించి డీజీసీఏ ఆందోళన వ్యక్తంచేయడంపై మరో పైలట్ మాట్లాడారు.

తన 10 సంవత్సరాల అనుభవంలో, రన్‌వేలకు సంబంధించి, ముఖ్యంగా టైర్-2 నగరాల్లో అనేక సమస్యలను తాను చూశానని ఆయన చెప్పారు.

''ఈ విషయాలు మాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. రన్‌వే సెంట్రల్ లైన్ లైట్లు సరిగ్గా పనిచేయవు. రన్‌వే నుంచి బయటకు వెళ్లినప్పుడు గడ్డి, చెట్ల కారణంగా గుర్తులు కనిపించవు. గడ్డిని సకాలంలో కత్తిరించరు'' అని పైలట్ చెప్పారు.

'' రన్‌వేపై గుంతలు ఉన్న విమానాశ్రయాలను కూడా నేను చూశాను. అక్కడ కొన్నిసార్లు నెమళ్లు కూడా కనిపిస్తాయి. ఇంకొన్నిసార్లు జింకలు, ఆవుల వంటి జంతువులు కూడా తిరుగుతుంటాయి'' అని ఆయన అన్నారు.

పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయం దొరకడం లేదని మూడో పైలట్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఒకే రోజులో ఐదు సెక్టార్లలో విమానం నడిపించాలని అడుగుతారని ఆయన అన్నారు. ఒక సెక్టార్ అంటే విమానం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం. తిరిగి వచ్చే సమయాన్ని రెండవ సెక్టార్ అంటారు.

"మీరు సాయంత్రం 4 గంటలకు టేకాఫ్ అవుతారు. కానీ మీ పైలట్, క్యాబిన్ సిబ్బంది ఉదయం 4 గంటల నుంచి విధుల్లో ఉండవచ్చు. సిబ్బంది ఎందుకు నవ్వడం లేదని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ వారు చాలా అలసిపోయి ఉండవచ్చు" అని ఆ పైలట్ వివరించారు.

ఎయిర్ ఇండియా, డీజీసీఏ, విమాన ప్రమాదం, ఎయిర్‌పోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

‘తనిఖీలు నిత్యం జరుగుతుండాలి’

డీజీసీఏ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని విమానయాన రంగ నిపుణులు అంటున్నారు.

ప్రతి ఎయిర్‌పోర్టు చుట్టూ ఒక పరిధి ఉంటుంది. ఈ పరిధిలోపు ఏ రకమైన నిర్మాణానికైనా, ఇతర పనులకైనా అనుమతి తీసుకోవాలి.

ఇది విమానాశ్రయాలు, నావిగేషన్లకు చుట్టూ ఉండే ప్రాంతం. సురక్షితంగా టేకాఫ్ అయ్యేలా, ల్యాండింగ్ అయ్యేలా విమానాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి ఈ ప్రాంతాన్ని స్పష్టంగా ఉంచాలి.

మూడేళ్లుగా కొన్ని విమానాశ్రయాలలో ఈ పరిధి డేటాను అప్‌డేట్ చేయలేదని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌పోర్టుల చుట్టూ అనేక కొత్త భవనాలు నిర్మిస్తున్నప్పటికీ ఎలాంటి సర్వే జరగలేదని వెల్లడించింది.

"ఇది ఒక్క రోజులో జరగదు. తనిఖీలు క్రమం తప్పకుండా జరగాలి. విమానాశ్రయం పక్కన ఒక్క వారంలో భవనం నిర్మించారా....లేదు కదా.... అప్పుడంతా డీజీసీఏ ఎక్కడ ఉంది?" అని విమానయాన రంగ నిపుణులు సంజయ్ లాజర్ ప్రశ్నించారు.

రన్‌వే చుట్టూ ఉన్న భవనాల గురించి పైలట్లు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారని మాజీ పైలట్, విమానయాన రంగ నిపుణులు కెప్టెన్ ఎంఆర్ వాడియా చెప్పారు.

"విమానాలు ముఖ్యంగా జంబో జెట్‌ల వంటి పెద్దవి టేకాఫ్ అవుతున్నప్పుడు, రన్‌వే సెంట్రల్ లైన్ స్పష్టంగా కనిపించాలి. ఈ గుర్తులు అనుసరించి తీర్సాలిన గైడింగ్‌లైన్స్" అని ఆయన అన్నారు.

రన్‌వే గుర్తులు చెడిపోవడం, అరిగిపోయిన టైర్ల కంటే తీవ్రమైన లోపాలను నివేదికలో ప్రస్తావించారని మరో పైలట్ మోహన్ రంగనాథన్ చెప్పారు.

కొన్ని విమానాల పైలట్లకు సిమ్యులేటర్‌లో శిక్షణ ఇస్తున్నారని, పైలట్లు సాధారణంగా నడిపే విమానాల్లో ఇది ఉండడం లేదని డీజీసీఏ తన నివేదికలో పేర్కొంది.

"విమాన రకానికి సరిపోని సిమ్యులేటర్‌ను ఉపయోగించడం అత్యంత తీవ్రమైన తప్పు. దీనివల్ల సిమ్యులేటర్‌పై నిర్వహించిన సెషన్‌లు పనికిరానివిగా అయిపోతాయి. మీరు నడిపే విమానానికి సంబంధించిన సిమ్యులేటర్‌పై శిక్షణ పొందనప్పుడు, దానికి సంబంధించిన నైపుణ్యం తెలియనప్పుడు ఇతర సిమ్యులేటర్‌పై సెషన్ చేసిన ప్రతి పైలట్ లైసెన్స్ సాంకేతికంగా చెల్లదు'' అని వాడియా అంటున్నారు.

ఎయిర్ ఇండియా, డీజీసీఏ, విమాన ప్రమాదం, ఎయిర్‌పోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది.

ఏఐ-171 ప్రమాదం

ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ-171 ప్రమాదానికి గురైంది.

సిబ్బంది, ప్రయాణికులు సహా 242 మందితో బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఓ భవనంపై కూలిపోయింది. విమానంలో ఉన్నవారిలో ఒక్కరే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. భవనంలో ఉన్నవారు కొందరు చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)