గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా విమాన ప్రమాదంలో మరణించిన కొందరి వివరాలు...

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. ఈ విషయాన్ని ఎయిర్‌ ఇండియా ధ్రువీకరించింది.

విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషు , ఒకరు కెనడా , ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు. స్థానికులు కూడా కొందరు చనిపోయి ఉండొచ్చని అధికారులు చెప్పారు. అహ్మదాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతంలో విమానం కూలిపోయింది.

అయితే, ఈ విమాన ప్రమాదం నుంచి భారత సంతతి బ్రిటిషర్ రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రమాదంలో చనిపోయిన కొందరి వివరాలను బీబీసీ ధ్రువీకరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, లండన్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో చనిపోయారు.

విజయ్ రూపానీ

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో చనిపోయినట్టు పౌరవిమానయానశాఖ మంత్రి తెలిపారు.

బీజేపీ నేత అయిన రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

అజయ్ కుమార్ రమేశ్

విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విశ్వాస్‌కుమార్ రమేశ్ పక్కనే కూర్చున్న ఆయన సోదరుడు అజయ్ కుమార్ రమేశ్ మరణించారు.

తాను క్షేమంగా ఉన్నానని చెప్పేందుకు కుటుంబ సభ్యులకు విశ్వాస్ కుమార్ రమేశ్ ఫోన్ చేశారని, కానీ సోదరుడి గురించి ఆయనకేమీ తెలియదని వారి కజిన్ అజయ్ వాల్గీ బీబీసీకి చెప్పారు.

విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, లండన్

ఫొటో సోర్స్, Family Handout

ఫొటో క్యాప్షన్, అకీల్ ననబవ, ఆయన భార్య హన్నా వొరాజీ అనుకోకుండా భారత పర్యటనకు వచ్చారు.

ననబవ కుటుంబం

గ్లూసెస్టర్‌లో నివసించే బ్రిటిషర్ల కుటుంబం ఈ ప్రమాదంలో మరణించినట్టు భావిస్తున్నారు. ఆ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. వారిలో ఓ చిన్నారి ఉన్నారు.

అకీల్ ననబవ, ఆయన భార్య హన్నా వొరాజీ, వారి నాలుగేళ్ల కుమార్తె సారా ననబవ విమానంలో ఉన్నారు.

వారి మృతిపై తీవ్రసంతాపం తెలియజేస్తూ గ్లూసెస్టర్ ముస్లిం సొసైటీ ప్రకటన విడుదల చేసింది.

''ఇంతటి బాధను ఏ మాటలూ తగ్గించలేవు. కానీ ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న సానుభూతితో ఆ కుటుంబం ఉపశమనం పొందాలని కోరుకుంటున్నాం''

''వారి జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి కలగాలి'' అని ఆ ప్రకటనలో తెలిపింది.

అదామ్, హసీనా తజు, అల్తాఫ్ హుసేన్ పటేల్

72ఏళ్ల అదమ్ తజు, ఆయన భార్య, 70ఏళ్ల హసీనా తమ అల్లుడు 51 ఏళ్ల అల్తాఫ్ హుసేన్ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్ నుంచి లండన్ తిరిగి వెళుతున్నారు. ఈ ముగ్గురూ లండన్‌లో నివసిస్తున్నారు.

ప్రమాదం సంగతి తెలిసి వారి మనవరాలు అమ్మారాహ్ తజు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్లాక్‌బర్న్‌లోని ఉన్న ఆమె ప్రమాద విషయాన్ని నమ్మలేకపోయారు.

ఎయిర్ ఇండియా నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం అందిన వెంటనే తన తండ్రి అల్తాఫ్ తజు, తన సోదరితో కలిసి లండన్ వెళ్లారని ఆమె చెప్పారు.

విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, లండన్

ఫొటో సోర్స్, Instagram

ఫొటో క్యాప్షన్, ఫియాంగల్, జామీ గ్రీన్‌లా-మీక్ విమానం ఎక్కేముందు భారత పర్యటనపై ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

ఫియాంగల్, జామీ గ్రీన్‌లా-మీక్

బ్రిటిష్ జంట ఫియాంగల్, జామీ గ్రీన్‌లా-మీక్ లండన్‌లో స్పిరిచ్యువల్ వెల్‌నెస్ సెంటర్ నడిపేవారు.

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతున్నామంటూ గురువారం(జూన్ 12)వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ఆ వీడియోలో భారత పర్యటన గురించి వారు నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటున్నారు.

విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా, అహ్మదాబాద్, లండన్

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, ఇద్దరు పిల్లలతో కలిసి సయ్యద్, ఆయన భార్య విమానం ఎక్కారు.

సయ్యద్ కుటుంబం

ప్రమాదం జరిగిన విమానంలో పశ్చిమ లండన్‌కు చెందిన జావెద్ సయ్యద్, ఆయన భార్య మరియం ఉన్నారు.

వీరిద్దరూ తమ ఇద్దరి పిల్లలుతో కలిసి విమానం ఎక్కారు.

సయ్యద్ భార్య హారోడ్స్‌ కంపెనీలోనూ, సయ్యద్ లండన్‌లోని ఒక హోటల్‌లో పనిచేసేవారు.

సింగ్‌సన్

సింగ్‌సన్ ఎయిర్ ఇండియాఫ్లైట్ 171 క్యాబిన్ సిబ్బందిలో ఒకరని ఆమె కుటుంబం తెలిపింది.

ఆమె గురించి సమాచారం తెలుసుకునేందుకు తాను ప్రయత్నించానని, కానీ ఏమీ తెలియదలేదని సింగ్‌సన్ కజిన్ టి. థంగ్‌లింగో హోకిప్ అహ్మదాబాద్ ఆస్పత్రి బయట బీబీసీతో చెప్పారు.

సింగ్‌సన్‌కు తల్లి, సోదరుడు ఉన్నారని, కుటుంబంలో వారు ఆమెపైనే ఆధారపడి జీవిస్తున్నారని, కుటుంబంలో సంపాదిస్తోంది ఆమె ఒక్కరే అని హోకిప్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)