కుక్కకు రూ. 38 వేల చొప్పున రైతులకు పరిహారం.. దక్షిణ కొరియాలో లక్షల కుక్కలను చంపేయబోతున్నారా?

కుక్కుల పెంపకం కేంద్రాలు, దక్షిణకొరియా

ఫొటో సోర్స్, Hyunjung Kim/BBC News

ఫొటో క్యాప్షన్, ఫారాలలోని కుక్కలు
    • రచయిత, గవిన్ బట్లర్, హ్యున్‌జంగ్ కిమ్
    • హోదా, బీబీసీ న్యూస్

దక్షిణ కొరియాలో జూ యోంగ్-బాంగ్(60) మాంసం కోసం కుక్కలను పెంచుతుంటారు.

కానీ, అతని వ్యాపారం ఇపుడు ఇబ్బందుల్లో ఉంది. ఈ మాంసం అమ్మకం చట్టవిరుద్ధంగా మారబోతుంది.

దక్షిణ కొరియా ప్రభుత్వం 2024లో కుక్క మాంసం అమ్మకాలను నిషేధించింది.

మాంసం కోసం కుక్కలను పెంచే రైతులు 2027 ఫిబ్రవరి లోపు అమ్మేయాలని, వ్యాపారాలను మూసేయాలని గడువు విధించింది.

"గత వేసవి నుంచి మేం మా కుక్కలను అమ్మడానికి ప్రయత్నిస్తున్నాం కానీ, మాంసం విక్రయించే వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు" అని జూ యోంగ్ బాంగ్ బీబీసీతో చెప్పారు.

వ్యాపారాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం ఇచ్చిన సమయం సరిపోదని చాలామంది రైతులు అంటున్నారు.

మరోవైపు ఫారాల్లో ఉన్న దాదాపు ఐదు లక్షల కుక్కల రక్షణ కోసం అధికారులు ఇప్పటివరకు తగిన ప్రణాళికతో ముందుకు రాలేదు.

అన్ని కుక్కలకు పునరావాసం కష్టమని జంతు హక్కుల సంఘాలతో పాటు, బ్యాన్ సమర్థిస్తున్న వారు, నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. పునరావాసం దొరకని కుక్కల పరిస్థితి చాలావరకు యూథనేసియా(కారుణ్య మరణం)కు దారితీయవచ్చు.

ప్రభుత్వం ఇచ్చిన గడువులో సగం పూర్తవుతోంది, అయినా కూడా కుక్కలను విక్రయించడానికి పెంపకందారులు ఇబ్బందిపడుతున్నారు, వారి వద్ద వందలాది కుక్కలున్నాయి.

"ప్రజలు బాధపడుతున్నారు" అని ఒక కుక్కల పెంపకందారుల బృందానికి నాయకత్వం వహిస్తున్న జూ యోంగ్ చెప్పారు.

"మేం అప్పుల్లో కూరుకుపోతున్నాం, కొందరికి వేరే పనేమీ దొరకడం లేదు" అని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జూ యోంగ్ బాంగ్

ఫొటో సోర్స్, News1

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా ప్రభుత్వ నిర్ణయంతో అప్పుల్లో కూరుకుపోతున్నామని కుక్కల పెంపకందారు జూ యోంగ్-బాంగ్ అన్నారు.

'ప్రణాళిక లేదు'

మాంసం కోసం కుక్కలను పెంచే రైతు ‘చాన్-వూ’ తన ఫారంలోని 600 కుక్కలను విక్రయించడానికి ఇంకా 18 నెలల సమయం ఉంది. ఆలోగా కుక్కలను విక్రయించేసి, పెంపకం ఆపేయకపోతే ఆయనకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు.

"నేను నా డబ్బునంతా ఫారంలోనే పెట్టుబడిగా పెట్టాను" అని 33 ఏళ్ల చాన్ వూ అన్నారు.

నిషేధానికి ముందు తన దగ్గర వారానికి సగటున అర డజను కుక్కలను కొనుగోలు చేసిన వ్యాపారులు.. ఇపుడు అసలు రావడమే లేదని ఆయన చెప్తున్నారు.

కుక్క మాంసం వ్యాపారాన్ని బ్యాన్ చేయడానికి పనిచేసిన జంతు హక్కుల సంఘాలను, ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఫారాలలో ఉన్న 5 లక్షల కుక్కలను ఏం చేయాలనే ప్రణాళిక లేకుండానే నిషేధం విధించారని ఆరోపించారు.

ఫారాలలో మిగిలిపోయిన కుక్కలను ఎలా సంరక్షించాలనే విషయంపై ప్రభుత్వంతో పాటు పౌర సంఘాల వద్ద కూడా స్పష్టమైన ప్రణాళికలు లేవని హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ కొరియా (హ్వాక్) క్యాంపెయిన్ మేనేజర్ లీ సాంగ్క్యుంగ్ అభిప్రాయపడ్డారు.

దక్షిణ కొరియా, కుక్కలు

ప్రభుత్వం ఏమంటోంది?

ఫారం యజమానులు తమ కుక్కలను అప్పగిస్తే, స్థానిక ప్రభుత్వాలు వాటిని స్వీకరించి, షెల్టర్లలో పెంచుతాయని దక్షిణ కొరియా వ్యవసాయ, ఆహార, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మఫ్రా)కు చెందిన విదేశీ మీడియా ప్రతినిధి బీబీసీతో అన్నారు.

చాలా ఫామ్ డాగ్‌లు పెద్ద జాతికి చెందినవి కానీ, కొరియాలోని నగర ప్రజలు చిన్న పెంపుడు కుక్కలను ఎక్కువగా ఇష్టపడతారు.

కొన్ని కుక్కలను ప్రమాదకరమైనవిగా లేదా అనారోగ్యకరమైనవిగా చూస్తారని లీ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, షెల్టర్లు ఇప్పటికే నిండి పోయాయి. లెక్కలేనన్ని కుక్కలు, ఎక్కడికి పంపాలో తెలియదు, ఈ పరిస్థితి చివరికి యుథనేసియాకూ దారితీయవచ్చు.

"ఈ సంఘాల డిమాండ్ ప్రకారం చట్టం చేశారు కాబట్టి, వారు కుక్కల కోసం పరిష్కారాన్ని కూడా రూపొందిస్తారనుకున్నా. కానీ, ఇప్పుడు జంతు హక్కుల సంఘాలు కూడా కారుణ్య మరణమే ఏకైక ఆప్షన్ అని చెబుతున్నాయని విన్నాను" అని చాన్ వూ చెప్పారు.

జంతు హక్కుల సంఘాలు

ఫొటో సోర్స్, Hyunjung Kim/BBC News

ఫొటో క్యాప్షన్, 2015 నుంచి దాదాపు 2,800 కుక్కలకు పునరావాసం కల్పించామని హ్వాక్ చెబుతోంది.

జంతు హక్కుల సంఘాలు ఏమంటున్నాయి?

వీలైనన్ని ఎక్కువ కుక్కలను రక్షించడానికి హక్కుల సంఘాలు ప్రయత్నిస్తాయని, కానీ కొన్ని మాత్రం మిగిలిపోతాయని కొరియన్ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ హెడ్ చో హీ-క్యుంగ్ 2024 సెప్టెంబరులో చెప్పారు. వాటిని యూథనేసియా ప్రకారం చంపేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.

యూథనేసియాపై వార్తలు రావడంతో స్పందించిన ప్రభుత్వం.. అది తమ ప్రణాళికలో భాగం కాదని చెప్పింది.

అదనపు షెల్టర్లు, ప్రైవేటు సంస్థలకు సాయం, ఫారాలు మూసివేస్తున్న రైతులకు పరిహారం కోసం ఏడాదికి 600 కోట్ల కొరియన్ వన్‌లు (సుమారు రూ.36.8 కోట్లు)ను కేటాయించినట్లు మఫ్రా బీబీసీతో తెలిపింది. గడువుకు ముందే ఫారాలను మూసివేసే రైతులకు ఒక్కో కుక్క కోసం 6 లక్షల కొరియన్ వన్‌లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 38,000) పరిహారం చెల్లిస్తామని తెలిపింది.

2015 నుంచి దాదాపు 2,800 కుక్కలకు పునరావాసం కల్పించామని కానీ, స్వచ్ఛంద సంస్థలు ఒంటరిగా భారీ సంఖ్యలో కుక్కలను తరలించలేవని హ్వాక్ చెబుతోంది.

మిగిలిపోయిన కుక్కల కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక తగినట్లుగా లేదని సియోల్ నేషనల్ యూనివర్సిటీలోని వెటర్నరీ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ డైరెక్టర్ చున్ మ్యుంగ్-సన్ అభిప్రాయపడ్డారు.

"దత్తత, కారుణ్య మరణం రెండింటిపై చర్చ జరగాలి. ఇలా చంపితే ప్రజలకు కోపమొస్తుంది" అని చున్ అభిప్రాయపడ్డారు.

కుక్కలు, మాంసం, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Hyunjung Kim/BBC News

విదేశాలకు ఎగుమతి..

కొన్ని సంస్థలు రక్షించిన కుక్కలను కెనడా, యూకే, అమెరికా వంటి దేశాలకు పంపుతున్నాయి, అక్కడ వాటిని దత్తత తీసుకుంటున్నారు. 2023లో అసన్ నగరంలోని ఒక ఫారం నుంచి హ్వాక్ బృందం 200 కుక్కలను రక్షించి, విదేశాలకు పంపింది.

ఆ ఫారం మాజీ యజమాని, 74 ఏళ్ల యాంగ్ జోంగ్-టే. అక్కడి కుక్కలను రక్షకులు ట్రక్కులో జాగ్రత్తగా ఎక్కించడం ఆయన చూశారు, వారు జంతువులతో అంత సున్నితంగా వ్యవహరించడం చూసి చలించిపోయినట్లు యాంగ్ బీబీసీతో చెప్పారు.

"మాకు కుక్కలు డబ్బు సంపాదించడానికి ఒక మార్గం మాత్రమే. కానీ వారు వాటిని ప్రేమ, గౌరవంతో చూసుకున్నారు. అది నన్ను కదిలించింది" అన్నారు యాంగ్.

కుక్కలు, మాంసం, దక్షిణ కొరియా
ఫొటో క్యాప్షన్, 2023లో అసన్ నగరంలోని ఒక ఫారం నుంచి హ్వాక్ బృందం 200 కుక్కలను రక్షించి, విదేశాలకు పంపింది.

ఆరోగ్యానికి ప్రమాదకరమని..

ఈ నిషేధంతో విభేదిస్తున్నానని కుక్కల పెంపకందారుడైన యాంగ్ చెప్పారు.

''కుక్కలు జంతువులు కాబట్టి వాటి మాంసం నిషేధమైతే, మరి మిగిలిన జంతువులైన ఆవులు, పందులు, కోళ్ల సంగతేంటి?. అవి కూడా ప్రకృతిలోనే బతుకుతున్నాయి'' అని ఆయన ప్రశ్నించారు.

కాగా, కుక్క మాంసాన్ని తినడం ఇతర మాంసాలు తినడం లాంటిది కాదని, ఆహార భద్రత, పరిశుభ్రత పరంగా ప్రమాదమని వెటర్నరీ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ డైరెక్టర్ చున్ సూచించారు.

హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ ప్రకారం, చైనా, ఇండోనేషియా, వియత్నాం, లావోస్, మియన్మార్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని అనేక దేశాలలో కూడా కుక్క మాంసాన్ని తింటారు.

కానీ, దక్షిణ కొరియాలో ప్రస్తుతం ఇది తగ్గుతోంది. 2024 కొరియా ప్రభుత్వ సర్వే ప్రకారం 8 శాతం మంది మాత్రమే కుక్క మాంసం తిన్నారు, 2015లో ఇది 27 శాతం ఉండేది.

నిషేధం ప్రకటించినప్పటి నుంచి మొత్తం 1537 కుక్కల పెంపకం కేంద్రాలలో 623 కేంద్రాలను మూసివేశారు.

"సమాజం మారిపోయింది. దక్షిణ కొరియా ఇప్పుడు కుక్క మాంసం ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది" అని చున్ అభిప్రాయపడ్డారు.

కాగా, చాలామంది రైతులకు కుక్క మాంసమే ప్రధాన ఆదాయ వనరు. ఈ నిషేధంతో వారికి ఏం చేయాలో తోచడం లేదని జూ వంటి రైతులు బీబీసీతో చెప్పారు. ప్రభుత్వం ఈ గడువును 2027 తర్వాత కూడా పొడిగిస్తుందని వారు ఆశిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)