విశాఖపట్నం: 'కలెక్టర్ కుర్చీ, కారు, ఆఫీస్‌లోని ఫర్నీచర్ అటాచ్ చేయండి' అని కోర్టు ఆదేశాలు, అసలేం జరిగింది?

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, కలెక్టర్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖలో ప్రభుత్వం నియమించిన గవర్నమెంట్ ప్లీడర్‌ - జీపీకి (ప్రభుత్వ న్యాయవాది) గౌరవ వేతనం చెల్లించకపోవడంపై జిల్లా కలెక్టర్ కారు, కుర్చీ, ఆయన ఆఫీసులోని సామగ్రిని అటాచ్ చేస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.

సుమారు రూ. 54 లక్షల వేతన బకాయిలు చెల్లించనందుకు, కలెక్టర్ కారు, కుర్చీలను అటాచ్‌మెంట్ చేయాలని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆదేశించారు.

వడ్డీతో సహా ఈ సొమ్మును చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కలెక్టర్ కుర్చీ, కారు అటాచ్‌మెంట్..

విశాఖ జిల్లా కోర్టులో 2015 ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ వరకు తాళ్లూరి రవి కుమార్‌ గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేశారు.

ఆయనకు చెల్లించాల్సిన గౌరవ వేతనం సుమారు రూ. 54 లక్షలను ప్రభుత్వం చెల్లించలేదు.

దీనిపై తాళ్లూరి రవి కుమార్ తనకు చెల్లించాల్సిన వేతనానికి జిల్లా కలెక్టర్‌ను బాధ్యుడిని చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఈ ఏడాది జనవరి 31న రవి కుమార్‌కు చెల్లించాల్సిన 72 నెలల వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు, విశాఖపట్నం 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు తీర్పు చెప్పారు.

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, కలెక్టర్

ఫొటో సోర్స్, Screenshot

రవి కుమార్ ఏం చెప్పారు?

"నా వేతన బకాయిల చెల్లింపుల గురించి అదనపు జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. కానీ, స్టే లభించలేదు. దీంతో, నేను కోర్టు తీర్పుని అమలు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశాను" అని తాళ్లూరి రవి కుమార్ బీబీసీతో చెప్పారు.

"కలెక్టర్ వాడుతున్న కియా కారు (AP 39 EM 1), యాపిల్ కంప్యూటర్, కలెక్టర్ కుర్చీ, కలెక్టర్ చాంబర్‌లోని టేబుల్, కలెక్టర్ గదిలో ఉండే 12 ఎగ్జిక్యూటివ్ చైర్స్‌ను వేలం వేసి నా బకాయి కింద ఇప్పించాలని కోర్టును కోరాను. వీటన్నింటి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా" అని రవి కుమార్ అన్నారు.

'' 2015 ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ వరకు నేను ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేశాను. ఇప్పటి వరకు నాకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వలేదు. ప్రభుత్వాలు ఇలా ఉంటే ఏం చేయాలి'' అని రవి కుమార్ అన్నారు.

ఇప్పుడు తనకు వడ్డీతో కలిపి రూ. 74 లక్షల 80 వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఆయన చెప్పారు.

"ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించిన వారికి వేతనం ఇవ్వకపోవడం దురదృష్టకరం."

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, కలెక్టర్

ప్రభుత్వ ప్లీడర్లు అంటే..

ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించే న్యాయవాదులను గవర్నమెంట్ ప్లీడర్‌లు (జీపీలు) అంటారు.

వీరికి కొన్ని బాధ్యతలు ప్రభుత్వం అప్పగిస్తుంది. వాటిల్లో ప్రధానంగా...

  • ప్రభుత్వ శాఖల తరఫున కేసులు వాదించడం
  • చట్టబద్ధమైన సలహాలు ఇవ్వడం (ప్రభుత్వ శాఖలకు లేదా అధికారి/అధికారులకు నిబంధనల ప్రకారం ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పడం)
  • తీర్పుల అమలుపై సూచనలు చేయడం (ఒక కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత, ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలమైనా, ప్రతికూలమైనా… దానిని ఎప్పుడు, ఎలా, ఏ శాఖ ద్వారా అమలు చేయాలో చెప్పడం)

ఈ విధులు నిర్వహించే గవర్నమెంట్ ప్లీడర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది.

ఈ గౌరవ వేతనమే తాళ్లూరు రవి కుమార్‌కు ఇవ్వలేదు.

ఇప్పుడు అసలు, వడ్డీ కలిపి సుమారు రూ. 75 లక్షల వరకు చెల్లించాలని ఆయన అంటున్నారు.

"జీపీలు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కారు. గౌరవ వేతనం ఆధారంగా పని చేసే నామినేటైన న్యాయవాదులు. వేతనం ఆలస్యమైతే, మా హక్కులను రక్షించుకునే మార్గం కోర్టే" అని రవి కుమార్ చెప్పారు.

కలెక్టర్ కుర్చీ, కారు స్వాధీనం చేసుకుంటారా?

గవర్నమెంట్ ప్లీడర్‌గా పని చేసిన తాళ్లూరు రవి కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, ''కోర్టు ఆదేశాల ప్రకారం.. కోర్టు సిబ్బంది సమక్షంలో కలెక్టర్ కుర్చీ, కారు, సామగ్రి అటాచ్ చేయించేందుకు గురువారం.. అంటే, జూన్ 26న కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నా'' అని చెప్పారు.

అయితే, నిజంగానే కలెక్టర్ కారు, కుర్చీలను అలాచ్ చేస్తారా? అని రవి కుమార్‌ను బీబీసీ ప్రశ్నించింది.

''మాకు రావాల్సిన గౌరవ వేతనాన్ని దక్కించుకునే క్రమంలో కలెక్టర్ కారు, కుర్చీ, ఆయన చాంబర్‌లోని టేబుళ్లను వేలం వేసి డబ్బులు ఇప్పించాలని కోర్టుని ఆశ్రయిస్తాం. గౌరవానికి భంగం కలిగినప్పుడైనా వ్యవస్థలు స్పందిస్తాయనే ఆశతోనే ఇలా చేస్తాం. అయితే, అటాచ్ చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. డబ్బులు చెల్లిస్తారనే ఆశిస్తున్నా" అని రవి కుమార్ చెప్పారు.

కోర్టు ఆదేశాల గురించిన సమాచారం, వివరాలు తెలుసుకునేందుకు కలెక్టర్‌ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదు.

కలెక్టర్ స్పందన రాగానే, ఈ కథనంలో అప్డేట్ అవుతుంది.

కార్యాలయం

గతంలోనూ ఒక కేసులో ఇలాగే..

ఇప్పుడే కాదు గతంలో కూడా ఒకసారి విశాఖ జిల్లా కలెక్టర్ కారు, కుర్చీలను అటాచ్ చేయమని కోర్టు తీర్పు ఇచ్చింది.

1997లో ఏలేరు కాలువ కోసం భూముల సేకరణ పరిహారానికి సంబంధించిన కేసు విషయంలో ఇలానే జరిగిందని సీనియర్ జర్నలిస్ట్ వీవీ రమణమూర్తి బీబీసీతో చెప్పారు.

"1997 ఏలేరు కాలువ నిర్వాసిత రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో కలెక్టర్ కారు, కుర్చీ, ఇతర ఆఫీసు సామగ్రిని అటాచ్ చేస్తూ కోర్పు తీర్పు ఇచ్చింది. అప్పుడు కలెక్టర్‌గా ఎంజీ గోపాల్ ఉన్నారు.

ఏలేరు కాలువ కోసం రైతుల నుంచి భూముల సేకరణ చేసిన ప్రభుత్వం, వారికి ఇవ్వాల్సిన పరిహారం చెల్లించకుండా ఆలస్యం చేసింది. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించారు" అని రమణమూర్తి గుర్తు చేసుకున్నారు.

అయితే, అప్పుడు రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)